నల్లబొడ్డులూరు గ్రామం
‘ఎర్ర’ బొడ్డులూరు
Published Tue, Oct 25 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
పలాస: మందస మండలంలోని నల్ల బొడ్డులూరు పేరు చెబితే చాలు ఎర్రజెండా పట్టుకున్న ఎందరో విప్లవ వీరులు గుర్తుకు వస్తారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం తర్వాత రెండో తరం విప్లవకారులు ఆనాటి పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో ఏర్పడ్డారు. పీపుల్స్‌వార్ తర్వాత మావోయిస్టుగా ఏర్పడిన ఆ పార్టీకి మందస మండలంలో నల్లబొడ్డులూరు విప్లవ కేంద్రంగా ఏర్పడింది. బాహడపల్లి భూస్వామి వ్యతిరేక పోరాటంలో బాహడపల్లి ప్రజలతో పాటు నల్లబొడ్డులూరు పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ పోరాట ప్రభావంతో ఆయా పరిసరాల్లోని యువకులు పెద్ద ఎత్తున దళాల్లోకి వెళ్లారు. అలా వెళ్లిన వారిలో 16 ఏళ్ల వయస్సులో బొడ్డు కుందనాలు విప్లవ బాట పట్టింది. కుందనాలు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారనే వార్త వినడంతో ఆ గ్రామానికి చెందిన అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యురాలు దున్న కాములమ్మతో పాటు గ్రామస్తులు మల్కన్‌గిరి వెళ్లారు. నల్లబొడ్డులూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుందనాలకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. పొట్ట కూటి కోసం అంతా వేరే ప్రాంతాల్లో ఉండగా కుందనాలు తల్లిదండ్రులు బొడ్డు సింహాద్రి, దమయంతిలు మాత్రమే ఇంటి వద్ద ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో మావోయిస్టు నాయకుడు దున్న కేశవరావు అలియాస్ అజాద్ ఒడిశాలోని భువనేశ్వరం జైలులో గత కొన్నేళ్లుగా మగ్గుతున్నారు. బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చి జైలు గోడలు దాటక ముందే మరోకేసు బనాయిస్తూ జైలుకు పంపిస్తున్నారు. ఆమె తల్లి దున్న కాములమ్మ పలుమార్లు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులను సంప్రదించినా ఫలితం లేకపోయింది.
Advertisement
Advertisement