28 ఏళ్లకు మళ్లీ ‘అదృశ్యం’
► ఐలయ్య, రాయమల్లు జాబితాలో ఆర్కే..!?
► అగ్రనేత జాడపై కొనసాగుతున్న సస్పెన్స్
పెద్దపల్లి: తెలంగాణ ప్రాంతంలో 1988లో సంచలనం సృష్టించిన మావోయిస్టు నేతల అదృశ్యం 28 ఏళ్ల తర్వాత మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే ఉదంతంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్ నాటి నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ఇన్‌చార్జి రామకృష్ణ అలియాస్ ఆర్కే కనిపించకుండా పోవడంతో.. గతం అదృశ్యం జాబితాలోనే ఆర్కే చేరుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 28 ఏళ్ల క్రితం అంటే.. 1988 డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని నవ్‌రంగ్ థియేటర్ వద్ద అప్పటి పీపుల్స్‌వార్ కార్యదర్శి గోపగాని ఐలయ్య, కొరియర్ బుర్ర రాయమల్లును పోలీసులు పట్టుకెళ్లారని తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో పెద్ద విధ్వంసం జరిగింది.
ఐలయ్య, రాయమల్లుతో పాటు జనశక్తి సభ్యులు వసంత, సుజాతలను కరీంనగర్ కోర్టు వద్ద పోలీసులు మాయం చేశారని, అంతేకాకుండా మంథని నియోజకవర్గం రామయ్యపల్లికి చెందిన రమణారెడ్డి అనే అగ్రనేతను ముంబైలో పట్టుకొని జాడ తెలియకుండా చేశారని అప్పట్లో పీపుల్స్‌వార్ నేతలు ఆరోపించారు. అదృశ్యమైన తమ వాళ్ల జాడ చెప్పాలని డిమాండ్ చేస్తూ అప్పటి కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ టీడీపీ ఎంపీపీని కిడ్నాప్ చేశారు. రామగిరి ఖిలాలో నాలుగు రోజుల పాటు నిర్బంధించి తర్వాత వదిలిపెట్టారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాడిచెర్ల మండల అధ్యక్షుడు మల్హర్‌రావును కిడ్నాప్ చేసిన పీపుల్స్‌వార్ ఆయనను హతమార్చింది.
ఆ తర్వాత వరంగల్ జిల్లాకు చెందిన మరో ఎంపీపీని కిడ్నాప్ చేయడంతో పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఐదుగురితోపాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 11 మంది మిలిటెంట్లు కలిపి 16 మంది అదృశ్యంపై అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, కేఎల్‌ఎన్.రెడ్డి కమిషన్‌ను నియమించి విచారణ చేపట్టారు. మూడేళ్లు విచారణ చేపట్టిన కేఎల్‌ఎన్ రెడ్డి కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, కేఎల్‌ఎన్.రెడ్డి కమిషన్ ఇచ్చిన నివేదికతోపాటు మాయమైన వారి జాడ ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియరాలేదు.
ఆ ఎన్‌కౌంటర్‌లో మరణించింది రాయమల్లు, ఐలయ్యలే!
1988 డిసెంబర్ 27న అదృశ్యమైన గోపగాని ఐలయ్య.. బుర్ర రాయమల్లును పోలీసులు వారం రోజుల తర్వాత కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి తీసుకొచ్చి ఎన్‌కౌంటర్ చేసి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని నక్సల్ మృతి చెందినట్లు ప్రకటించిన పోలీసులు వారి మృతదేహాల ఫొటోలను పత్రికలకు విడుదల చేయలేదు. వారే మృతదేహాలను ఖననం చేశారు. కానీ, తర్వాతి రోజుల్లో పార్టీ నాటి ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది వీరిద్దరేనని ధ్రువీకరించింది. గోపగాని ఐలయ్య, బుర్ర రాములును పోలీసులు పట్టుకునేందుకు కోవర్టుగా వ్యవహరించాడనే అనుమానంతో చత్రపతి శివాజీ అనే వ్యక్తిని పార్టీ హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి వద్ద చంపేసింది.