నీటి పరీక్షలే కీలకం
అనంతపురం అగ్రికల్చర్ :
మారుతున్న వ్యవసాయ సాగు పద్ధతుల్లో నీటి పరీక్షలకు ప్రాధాన్యత ఏర్పడిందని స్థానిక మట్టి, నీటి, విత్తన పరీక్షా కేంద్రం (ఎస్‌టీఎల్) ఏడీఏ ఎం.కృష్ణమూర్తి తెలిపారు. పంటలు బాగా పండాలంటే మట్టి, నీరు, పత్ర విశ్లేషణ లాంటి పరీక్షలు చేయించుకొని, వాటి ఫలితాల ఆధారంగా సమగ్ర పోషక, నీటి, సస్యరక్షణ చర్యలు చేపడితే పెట్టుబడి ఖర్చులు తగ్గి పంట దిగుబడి పెరుగుతాయని తెలిపారు.
నీటి పరీక్ష ఆవశక్యత : నీటి పరీక్షల ఫలితాల ఆధారంగా పంటల ఎంపిక, వాటి దిగుబడులు ఆధారపడి ఉంటాయని ఏడీఏ తెలిపారు. మట్టి పరీక్షలు, ఫలితాలు, ఎరువుల వాడకం గురించి ఇటీవల రైతుల్లో అవగాహన పెరిగినా నీటి పరీక్షల గురించి తెలియడం లేదన్నారు. పెరుగుతున్న నీటి కొరత, భూమి లోపల పొరల నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం వల్ల ఎక్కువ లవణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకు హానికరమవుతున్నాయన్నారు. దీని వల్ల పంటలు సరిగా ఎదగకపోవడమే కాక నేలలు కూడా చెడిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా సాగునీటిని పరీక్ష చేయించిన తర్వాత వాడుకోవడం మంచిదని, మట్టి, నీళ్ల శ్యాంపిల్స్ ఎప్పుడు తీసుకొచ్చినా సకాలంలో ప్రయోగశాలలో పరీక్షించి వాటి ఫలితాలను ఆన్‌లైన్ చేసి, హెల్త్‌కార్డు పేరుతో రైతుకు వివరాలు అందజేస్తామన్నారు.
నీటి సేకరణ : నీళ్లకు ఎక్కడి పడితే అక్కడ ఎలా అంటే అలా తీసుకురాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ తెలిపారు. మొదట బోరుబావి నీటిని సుమారు 20–30 నిమిషాలు వదలిపెట్టాలన్నారు. ప్లాస్టిక్ సీసాలో అర లీటర్ నీటిని సేకరించాలి. వీలైనంత వరకు గాజు సీసా బదులు ప్లాస్టిక్ సీసాలను వాడాలని, పురుగు మందులు, టానిక్‌లు, మద్యం సీసాలను వాడకూడదని ఏడీఏ తెలిపారు. నీటి నమూనాను తీసే సీసాను అదే నీటితో రెండు మూడు సార్లు బాగా కడిగిన అనంతరం నీరు నింపుకుని రావాలన్నారు. కాలువలు లేదా చెరువులు నుంచి నీటి నమూనా తీసేటప్పుడు ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్‌ను కట్టి ఒడ్డుకు దూరంగా నీటిని తీయాలన్నారు. ఆ నీటితో సీసాను రెండు మూడు సార్లు కడిగి ఆ తరువాత నమూనాతో నింపాలన్నారు. సాగునీటి నాణ్యత పరీక్ష కోసం నమూనాను వెంటనే చేరేటట్లు సమీప భూసార పరీక్ష కేంద్రానికి పంపాలన్నారు. నమూనాతో పాటు రైతు పేరు, సర్వే నంబరు, బోరు లేక కాలువల వివరాలు, గ్రామం, మండలం తదితర విషయాలు తెలియచేయాలన్నారు. సేకరించిన రోజే పరీక్షా కేంద్రానికి అందజేయాలని ఏడీఏ చెప్పారు.