విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఈ ఏడాది నుంచే పీజీ ప్రోగ్రామ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది, సెప్టెంబర్ నుంచి తరగతలు
ప్రారంభించేందుకు అనుగుణంగా సన్నాహాలు చేస్తున్నాం అంటున్నారు ఐఐఎం-విశాఖపట్నం నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ సౌరవ్ ముఖర్జీ. ఐఐఎం-బెంగళూరులో డీన్(ప్రోగ్రామ్స్) బాధ్యతలు నిర్వహిస్తూ, తాజాగా ఐఐఎం-విశాఖపట్నం కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్ సౌరవ్ ముఖర్జీతో గెస్ట్ కాలం...
ఆగస్ట్ 25 నాటికి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి:
ఐఐఎం-విలో ఆగస్ట్ 25 నాటికి ప్రవేశాలను పూర్తి చేయనున్నాం. మొత్తం ఆరు రౌండ్లలో అడ్మిషన్‌ల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. చివరి రౌండ్ అభ్యర్థులు ఆగస్ట్ 25 నాటికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ మధ్య నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఐఐఎంలకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌కు అనుగుణంగా కొత్త క్యాంపస్‌ను నిర్వహించడం కొంత క్లిష్టమైనదే! అయితే మెంటార్ ఇన్‌స్టిట్యూట్ ఐఐఎం-బెంగళూరులో ఉన్న సదుపాయాలు, నిపుణులైన ఫ్యాకల్టీ వంటి వాటిని సానుకూలంగా మలచుకుని ఐఐఎం-విశాఖపట్నం క్యాంపస్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
మూడేళ్లలో శాశ్వత క్యాంపస్:
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మాకు విధించిన మూడేళ్ల కాల వ్యవధిలోపు ప్రస్తుత తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమైన ఐఐఎంను శాశ్వత క్యాంపస్‌లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేపడుతున్నాం.
ఐఐఎం-బి స్థాయిలోనే:
ఐఐఎం-వీలో తొలి బ్యాచ్ 65 మంది విద్యార్థులతో ప్రారంభం కానుంది. కరిక్యులం, సిలబస్ అంతా ఐఐఎం-బీలో అనుసరిస్తున్న విధానాల మేరకే ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు పొందేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో ఐఐఎం-బిలో బోధించే అంశాలనే ఐఐఎం- విశాఖపట్నంలోనూ అందిస్తాం. ఫలితంగా కొత్త ఇన్‌స్టిట్యూట్, తొలి బ్యాచ్ అయినప్పటికీ విద్యార్థులకు అకడమిక్స్ పరంగా ఎలాంటి అసౌకర్యం ఉండదు. ప్రస్తుతం తొలి ప్రోగ్రామ్‌లో ఆరు కోర్సులు ఉన్నాయి. వీటికి ఫ్యాకల్టీని కూడా ఐఐఎం-బెంగళూరు నుంచే నియమించాం. కాబట్టి ఫ్యాకల్టీ విషయంలోనూ ఎలాంటి సమస్య తలెత్తదు.
‘ప్రాక్టికల్’ కోసం ‘స్థానిక’ ఒప్పందాలు:
ఐఐఎం-బెంగళూరు కరిక్యులం ప్రకారం- పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రాక్టికల్ అప్రోచ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అదే కరిక్యులంను ఇక్కడ కూడా అనుసరిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రాక్టికల్‌గా మౌలిక సదుపాయాల విషయంలో స్థానికంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ల సహకారం తీసుకుంటాం. ఇప్పటికే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంతో మద్దతు లభిస్తోంది. దీంతోపాటు ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ వంటివి కూడా మేనేజ్‌మెంట్ విద్యార్థులు అకడమిక్‌గా రాణించడానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటికోసం స్థానికంగా ఉన్న ఇండస్ట్రీ వర్గాలతో ఒప్పందాలు చేసుకునే దిశగా యోచిస్తున్నాం. అంతేకాకుండా కోర్సు సమయంలో అవసరమైనప్పుడు విద్యార్థులను ఐఐఎం-బెంగళూరు క్యాంపస్‌కు తీసుకెళ్లే ప్రతిపాదన కూడా ఉంది.
నిబద్ధత ఉంటేనే సార్థకత:
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులు నిబద్ధతతో వ్యవహరించినప్పడే తమ లక్ష్యం నెరవేరుతుంది. మేనేజ్‌మెంట్ విద్య అప్లికేషన్ ఓరియెంటేషన్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తుంది. అందువల్ల మేనేజ్‌మెంట్ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులపై వాస్తవ దృక్పథం అలవర్చుకోవాలి. ఫలితంగా వ్యాపార రంగంలోని పరిణామాలు, అందుకనుగణంగా నిర్వహణ పరంగా జరుగుతున్న మార్పులపై అవగాహన లభిస్తుంది.
కలిసొచ్చే పీర్ లెర్నింగ్:
ఐఐఎంలలో చేరే విద్యార్థులు సహచరులతో కలిసి అభ్యసనం చేసే దిశగా కదలాలి. ఐఐఎంలలో ఏ ప్రోగ్రామ్‌లోనైనా విభిన్న నేపథ్యాల వారు ఉంటారు. ఈ క్రమంలో ఆయా విభాగాల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారితో కలిసి అధ్యయనం, చర్చించడం చేయాలి. తద్వారా ఆయా రంగాల్లో వాస్తవ పరిస్థితుల గురించి సమాచారం తెలుస్తుంది. తదనుగుణంగా అకడమిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి.
మేనేజ్‌మెంట్ కోర్సు ఔత్సాహికులకు సలహా:
క్యాట్ ద్వారా ఐఐఎంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకైనా, మరే ఇతర బిజినెస్ స్కూల్‌లో చేరాలనుకునే విద్యార్థులైనా... ఈ కోర్సు ఎంపిక విషయంలో తమ సహజ ఆసక్తి ఏంటి? అని ముందుగా స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. కొంత పని అనుభవం పొందిన తర్వాత కోర్సులో అడుగుపెడితే కెరీర్‌లో అద్భుతంగా రాణించొచ్చు. ఉదాహరణకు ఫైనాన్స్ లేదా మార్కెటింగ్‌లో ఆసక్తి ఉండి.. ఆ రంగంలో పని అనుభవంతో ఈ కోర్సులో చేరితే అత్యున్నత అకడమిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ప్రాక్టికల్ అనుభవంతో తరగతిలోని ఇతర సహచరులకు తోడ్పడేందుకు అవకాశం ఉంటుంది. మన దేశంలో ఇప్పుడున్న క్రేజ్ కారణంగా బ్యాచిలర్ డిగ్రీతోనే ఎంబీఏలో ప్రవేశిస్తున్నారు. వారి ఆసక్తిని, ఆశయాన్ని కాదనలేం. అలాంటి విద్యార్థులకు నా సలహా ఏమంటే.. వర్క్ హార్డ్, బీ-ప్రాక్టికల్, అడాప్టివ్‌నెస్ టు అప్లికేషన్ ఓరియెంటేషన్! ఈ మూడు లక్షణాలు ఉంటేనే ఎంబీఏ కోర్సులో చేరినందుకు సార్థకత లభిస్తుంది.
సాక్షి ఎడ్యుకేషన్ ఆన్‌లైన్ పరీక్షలు
హైదరాబాద్: ఏ పోటీ పరీక్షకైన ముందస్తు ప్రణాళిక, వీలైనంత సాధన ముఖ్యం. ప్రస్తుతం బ్యాంక్స్, ఇన్సూరెన్స్ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ ఆన్‌లైన్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో సాక్షి ఆన్‌లైన్ పరీక్షలకు ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది.
పోర్టల్‌లో అందుబాటులో ఉన్న టెస్టులు
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పేపర్ 1, 2: 6 టెస్టులు
ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రిలిమ్స్: 4 టెస్టులు
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ అండ్ సీహెచ్‌ఎస్‌ఎల్: 10 టెస్టులు
ఓరియంటల్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్స్: 3 టెస్టులు
అన్ని బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ పరీక్షలు: 150+ టెస్టులు
http://onlinetests.sakshieducation.com/
వర్క్ హార్డ్, బీ- ప్రాక్టికల్
Published Thu, Aug 13 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement
Advertisement