అజాం ఖాన్ ను వెనకేసుకొచ్చిన అఖిలేశ్‌యాదవ్
బాదౌన్: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహాన్ని చవిచూసిన ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వెనకేసుకొచ్చారు. అజాం ఖాన్ వివరణ వినకుండానే ఎన్నికల సంఘం ఆయనపై చర్య తీసుకుందని అఖిలేశ్ తప్పుబట్టారు. కార్గిల్ యుద్ధ విజయం ముస్లిం సైనికల వల్లే సాధ్యమైందని అజంఖాన్ ఇటీవల అనడంతో... సభలు, సమావేశాలు, ఊరేగింపులు, రోడ్‌షోలలో పాల్గొనకుడా ఆయనపై ఈసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈసీ నోటీసులకు అజంఖాన్ వివరణ ఇచ్చారని, దాన్ని పరిశీలించకుండానే ఆయనపై చర్యలు తీసుకున్నారని అఖిలేశ్ సోమవారం బాదౌన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు.
తమ పార్టీ నేతలపై వేధింపులకు పాల్పడితే ప్రజలు తమకు మద్దతుగా పెద్ద ఎత్తున ఓటు వేయడం ద్వారా బదులిస్తారని చెప్పారు. బీజేపీ రూ.1,000కోట్లు ప్రచారం కోసం ఖర్చు చేస్తోందని తాను అంటుంటే, మీడియా రూ. 10వేల కోట్లు అని చెబుతోందని... విచారణ జరిపితే ఇది ఇంకా పెద్ద మొత్తంలోఉండొచ్చన్నారు.