తూచ్... నేనింతే! | chandrababu naidu double standard on BJP Alliance | Sakshi
Sakshi News home page

తూచ్... నేనింతే!

Published Mon, Apr 7 2014 1:28 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

chandrababu naidu double standard on BJP Alliance

* మాటమార్చి.. ప్రజలను ఏమార్చి బీజేపీతో పొత్తు
* 2004లో బీజేపీ వల్లే ఓడిపోయామన్న టీడీపీ అధినేత
* వారితో పొత్తుపెట్టుకుని తప్పుచేశానని తర్వాత క్షమాపణ
* ఇప్పుడు అదే కమలదళంతో మళ్లీ పొత్తు
* బాబు వైఖరితో విసిగిపోతున్న ఆ పార్టీ ముఖ్య నేతలు
 
 యాచమనేని పార్థసారధి:  రాజకీయాల్లో నాయకుడనేవాడు ఒక మాట చెబితే కచ్చితంగా నిలబడి ఉండాలి. అప్పుడే ప్రజల్లో అతనిపై నమ్మకం ఏర్పడుతుంది. పార్టీ అన్నప్పుడు ఒక సిద్ధాంతం ప్రకారం నడవాలి. అప్పుడే ఆ పార్టీ మనగలుగుతుంది. అధికారమే పరమావధిగా... అవసరానికి అనుగుణంగా ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకులు ప్రజల్లో పలచనవుతారు. నమ్మకం కోల్పోతారు. అధికారం కోసం ఏ గడ్డయినా కరిచే నాయకులను ప్రజలు సైతం తిరస్కరిస్తారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. చంద్రబాబు నాయుడికి అవేమీ పట్టడం లేదు. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని చెప్పుకునే చంద్రబాబు  మైనారి టీలను నట్టేట ముంచారు. అందుకు ఆయన చెప్పిన మాటలే ప్రత్యక్ష నిదర్శనం. ఒకటి, రెండుసార్లు కాదు..స్వయంగా శాసనసభ వేదికగా ముస్లింలకు క్షమాపణ చెబుతున్నా నన్నారు. మరోసారి ఆ తప్పు చేయనన్నారు. గోద్రా అల్లర్లకు కారణమైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మళ్లీ జీవితంలో అలాంటి తప్పు చేయనన్నారు. ఇప్పుడా చంద్రబాబే మళ్లీ బీజేపీ పంచన చేరారు. మోడీ ప్రభావం తనకు కలిసొస్తుందన్న ఆశతో... ఇన్నాళ్లు వేసుకున్న లౌకిక ముసుగుతీసి మరోసారి మైనారిటీలను నట్టేట ముంచారు.

ఏ ఎండకా గొడుగు
గోద్రా అల్లర్లకు కార కుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని సాకుగా చూపి బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని  బహిరంగంగా లెంపలేసుకున్న చంద్రబాబు ఇప్పుడదే మోడీని కీర్తిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును ఆ పార్టీ ఖరారు చేసిన రోజు నుంచి చంద్రబాబు ఆయన వెంటపడ్డారు. నిత్యం మోడీ జపం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిగా పనికిరాడని, ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబే ఇప్పుడు అదే మోడీ ఆసరాగా ఎన్నికల్లో లబ్ధిపొందొచ్చన్న నిర్ణయానికి వచ్చారంటే ఆయన నైజమేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తనకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా లేకపోతే మరో రకంగా మాట్లాడటం బాబు నైజం. 

1998లో లోక్‌సభకు ఎన్నికలు జరిగే వరకూ చంద్రబాబు బీజేపీకి దూరంగా ఉన్నారు. ఆ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆయన బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీ మసీదు (బాబ్రీ మసీదు)లను కూలుస్తుంటే తమ పార్టీ మసీదులు, షాదీఖానాలు నిర్మిస్తోందని ప్రచారం చేసుకున్నారు. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు ఒక్కసారిగా మాట మార్చారు. ఎన్నికల ముందు వరకూ ఏ పార్టీని మసీదులు కూలుస్తోందని విమర్శించారో, ఆ తరువాత అదే పార్టీతో జత కట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందారు.

2003లో అసెంబ్లీని రద్దు చేసిన చంద్రబాబు అదే పార్టీతో కలిసి 2004లో సాధారణ ఎన్నికల బరిలోకి దిగి అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. మరోవైపు ఏ ఎండకాగొడుగు పడుతున్న అధినేత వైఖరి తమను నిండా ముంచేలా ఉందని   ఆపార్టీ ముఖ్య నేతలే గగ్గోలు పెడుతున్నారు.
 
మేం అధికారంలో ఉన్నపుడు మా విధానాల వల్ల ఎవరైనా  ఇబ్బంది పడి ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవటం తప్పు. ఎన్‌డీఏ హయాంలో జరిగిన గోద్రా అల్లర్ల ప్రభావం మా పైనా పడింది. మేం ఆ అల్లర్లను ఖండించి నరేంద్ర మోడీ  రాజీనామా చేయాలని  డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. మైనారిటీలు మాకు దూరమయ్యారు. తర్వాత మైనారిటీలకు రిజర్వేషన్లు వంటి వాగ్దానాలు ఫలితం చూపలేక పోయాయి. మా తప్పులు సరిదిద్దుకుంటాం. భవిష్యత్‌లో ఇకపై ఎపుడూ మతతత్వ వాదులతో పొత్తు పెట్టుకునేది లేదు.
 - ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకోవటంపై 28-05-2011 జరిగిన మహానాడులో చంద్రబాబు చెప్పిన మాటలు
 
బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నరేంద్రమోడీ నియామకం వల్ల రాష్ర్టంలో ఎలాంటి ప్రభావం ఉండదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయి. కేంద్రంలో తృతీయ ప్రత్యామ్నాయం అధికారంలోకి వస్తుంది. గుజరా త్‌లో నరేంద్ర మోడీ కొత్తగా చేసింది ఏమీ లేదు. నేను ఇక్కడ అధికారంలో ఉన్నపుడు తెచ్చిన పథకాలనే మోడీ సీఎం అయ్యాక గుజరాత్‌లో అమలు చేశారు. మేం బీజేపీతో పొత్తు పెట్టుకోబోం.
 -11 జూన్ 2013న బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా మోడీని ఆ పార్టీ నియమించిన సందర్భంగా..
 
బీజేపీతో పొత్తు వల్ల మేం నష్టపోయాం. ఆ పార్టీ గుజరాత్‌లో అధికారం కోసం కేంద్రంలో అధికారాన్ని వదులుకుంది. ఒకవేళ గోద్రా ఘటన జరగకపోతే కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో మేము అధికారంలోకి వచ్చేవాళ్లం.
 -టీడీపీ 30వ వ్యవస్థాపక దినోత్సవం నాడు మీడియాతో..
 
మోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి వెంటనే బీజేపీ తొలగించాలి. లేకపోతే ప్రజలు నమ్మరు.
 -11 ఏప్రిల్ 2002న గోద్రా అల్లర్ల అనంతరం చంద్రబాబు
 
బీజేపీతో పొత్తు పెట్టుకోనని శపథం చేస్తున్నా..!
తెలుగుదేశం పార్టీ లౌకిక ప్రాతిపదికన స్థాపించబడింది. ఈ పార్టీలో అన్ని మతాలు, కులాలకు సముచిత స్థానం ఉంది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ముస్లింలు, లౌకికవాదులు దూరమయ్యారు. 2004లో తెలుగుదేశం ఘోరంగా పరాజయం పాలైంది. ఇకపై బీజేపీతో పొత్తు పెట్టుకోనని శపథం చేస్తున్నా.
 - 2012 సెప్టెంబర్ 26న.. ముస్లిం మత గురువులు, ముస్లిం సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement