గీతారెడ్డి ఫైవ్ స్టార్ మినిష్టర్: కేసీఆర్
మెదక్ : మెదక్ జిల్లాలో రాజకీయ నేతల ఎన్నికల ప్రచారం పోటీ పోటీగా కొనసాగుతోంది. మెదక్ జిల్లా జహీరాబాద్లో శనివారం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గీతారెడ్డి ఫైవ్ స్టార్ మినిష్టర్ అని, ఆమె సామాన్యులకు అందుబాటులో ఉండరని వ్యాఖ్యానించారు. గీతారెడ్డిపై సీబీఐ కేసులు ఉన్నాయని, ఆమె జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు.
14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే క్షేమంగా ఉంటుందో ప్రజలే ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో ఎవరి తలరాతను వాళ్లు రాసుకునే సమయం వచ్చిందన్నారు. 40ఏళ్ల పాటు తెలంగాణను కాంగ్రెస్ పాలించిందని, అయితే తెలంగాణ అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించారు. కాగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి మహిళా కావాలన్నది తన కోరిక అంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నేతగా ఉన్న గీతారెడ్డి సీఎం రేసులో ముందున్నారు.