సాక్షి, నెల్లూరు: తెలుగుదేశంలో మాటల యుద్ధం ముగిసి తన్నుల యుద్ధం మొదలైంది. పాతకాపులు, వలస నేతల మధ్య దాడులు షురూ అయ్యాయి. కొత్తగా పార్టీలో చేరిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గాలు సోమవారం బాహాబాహీ తలపడ్డాయి.
నువ్వెంతంటే.. నువ్వెంతంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. వలస నేతల రాకను ఆహ్వానిస్తున్నట్లు నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని గాంభీర్యాన్ని ప్రదర్శించినా కార్యకర్తలు దీనిని జీర్ణించుకోలేకున్నారు. టీడీపీలో తుపాను ముందు ప్రశాంతత మాదిరిగా ఉన్న సందర్భంలో చిన్నపాటి సంఘటన పెద్ద తగువుకు తెరలేపింది. ఇదే అదనుగా కొత్త, పాత తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోయారు. ఇందుకు ఇందుకూరుపేట వేదికైంది.
వివరాలలోకి వెళితే.. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గీయుడు కైలాసం ఆదిశేషారెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి సతీమణి కైలాసం సుప్రియ కొత్తూరు-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున నామినేషన్ వేసింది. ఇదే స్థానానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గీయుడైన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునగాల రంగారావు సతీమణి మునగాల సుజాత కూడా నామినేషన్ వేసింది. అయితే సోమిరెడ్డి వర్గానికి చెందిన మునగాల సుజాతకే బీఫాం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని టీడీపీ మండల అధ్యక్షుడు వీరేంద్ర ఈ విషయాన్ని ఆదిశేషారెడ్డి వర్గీయులకు చె ప్పాడు.
దీంతో ఆగ్రహం చెం దిన ఆదాల వర్గీయుడు ఆదిశేషారెడ్డి తాము పోటీ నుంచి ఉపసంహరిం చుకుంటామంటూ అనుచరులతో కలసి ఎన్నికల అధికారి వద్దకు వచ్చారు. అప్పటికే టీడీపీ మండల అధ్యక్షుడు వీరేంద్రతోపాటు సోమిరెడ్డి వర్గీయుడు రంగారావు సైతం అనుచరులతో కలసి ఎన్నికల అధికారి వద్దకు చేరుకున్నారు. ఒకరికొకరు ఎదురు పడిన ఇరువర్గాలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రెచ్చిపోయారు. దూషణల పర్వానికి దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఇరువర్గాల వారు తోపులాటకు దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు.
సై అంటే సై అంటూ సవాల్ విసురుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్సై నాగేశ్వరరావు పోలీసు బలగాలతో అక్కడి చేరుకున్నారు. సోమిరెడ్డి, ఆదాల వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరకు పాతకాపైన సోమిరెడ్డి వర్గీయుడు రంగారావును కాదని కాదని ఆదాల వర్గీయుడైన ఆదిశేషారెడ్డి వర్గానికే టీడీపీ బీఫాం ఇచ్చారు. దశాబ్దాలుగా పార్టీ జెండాలు మోసిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఓ టీడీపీ సీనియర్ నేత ‘సాక్షి’తో వాపోయారు. గొడవలు ఇంతటితో ఆగవన్నారు. వలస నేతలతో పార్టీ నిలువునా మునగడం ఖాయమన్నారు.
డిష్యుం..డిష్యుం
Published Tue, Mar 25 2014 3:54 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement