చౌటుప్పల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా పలు జిల్లాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్న.. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులెవరూ బలిదానాలు చేసుకోవద్దు.. తెలంగాణను చూడడానికి బతికుండాలని చెప్పా.. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశా.. ఈ చిన్నమ్మను మరవొద్దు.. చిన్నమ్మ పిలుపునూ మరవొద్దు.. కాంగ్రెస్ పాలనను అంతం చేయాలి’ అని బీజేపీ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ చౌటుప్పల్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో జరిగిన జాప్యం వల్లే 1100మంది బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ పార్టే బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో 50వేల మంది ఫ్లోరైడ్ బాధితులు జీవచ్ఛవాలుగా మారారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో ఫ్లోరైడ్ నుంచి నల్లగొండ జిల్లాకు విముక్తి కలిగిస్తామన్నారు.
ప్రత్యామ్నాయాన్ని కోరుతున్నారు
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గాన్ని కాంగ్రెస్, కమ్యూనిస్టులే పాలిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. దేశంలోనే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ ఎక్కువ. ఫ్లోరైడ్‌ను రూపుమాపలేని ఈ నాయకులు చివరకు ఫ్లోరైడ్ నియోజకవర్గంగా పేరు మార్చుతారేమోనని అనిపిస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుతున్నారు. అదే బీజేపీ .
- గంగిడి మనోహర్‌రెడ్డి (మునుగోడు అసెంబ్లీ)
శ్రీరామ్‌సాగర్ కాలువ డిజైన్ మార్చారు
శ్రీరామ్ సాగర్ కాలువ ఆలేరు, తుంగతుర్తి మీదుగా ఆత్మకూరు వరకు చేరాలి. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దీని డిజైన్ మార్చి జనగామకే పరిమితం చేశారు. దీనిపై ఎన్నడూ మాట్లాడని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారు? ఇలాంటి వారి పట్ల ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి.
- కాసం వెంకటేశ్వర్లు (ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి)
ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్
ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను పట్టించుకోని కేసీఆర్.. తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారు. కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారు. చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటి, పీడీయాక్ట్‌పై 12నెలలు జైలుకెళితే పట్టించుకోలేదు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులు నలుగురికి టికెట్లు ఇచ్చుకున్నారు.
- చెరుకు లక్ష్మి (నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి)
గుజరాత్ మాదిరిగా అభివృద్ధి
బీజేపీ అధికారంలోకి వస్తే గుజరాత్ మాదిరిగా అభివృద్ధి చేస్తాం. గుజరాత్‌లో 24గంటలు కరెంటు ఇవ్వడంతో పాటు, పక్క రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. ఇక్కడ కూడా బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు చేపడతాం. రైతులకు నాణ్యమైన కరెంటు, విత్తనాలు సరఫరా చేస్తాం. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు నిధిని ఏర్పాటు చేస్తాం.
- నల్లు ఇంద్రసేనారెడ్డి( భువనగిరి ఎంపీ అభ్యర్థి )
చిన్నమ్మను మరువద్దు
Published Sun, Apr 27 2014 3:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement