
4 స్తంభాలాట
తెలంగాణలో పొత్తు కోసం ప్రధాన పార్టీల ఎత్తులు
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల చర్చల్లో ఆసక్తికర మలుపులు
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో ఏకకాలంలో టీఆర్‌ఎస్ చర్చలు
టీడీపీతో చర్చలు జరుపుతూనే.. టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్న బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య పొత్తుల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని, ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్ తాజాగా కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతోంది. ఒకవైపు తమ ప్రతిపాదనను కాంగ్రెస్ ముందుంచిన టీఆర్‌ఎస్ పెద్దలు.. అదే సమయంలో బీజేపీ అగ్రనేతలతోనూ పొత్తుపై టచ్‌లో ఉండటం విశేషం. తమ ప్రతిపాదనలకు ఓకే చెప్తే కాంగ్రెస్‌తోనే వెళతామని.. లేనిపక్షంలో బీజేపీతో పొత్తు ఖాయమని టీఆర్‌ఎస్ నేతలు సంకేతాలు పంపుతున్నారు. మరోవైపు ఇప్పటికే బీజేపీతో పొత్తు చర్చలు నడుపుతున్న టీడీపీ.. ఆ దోస్తీని పక్కా చేసుకోవటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీతో టీఆర్‌ఎస్ జట్టు కడుతుంది? టీఆర్‌ఎస్, టీడీపీల్లో ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది.
60 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు కావాలన్న టీఆర్‌ఎస్!
టీఆర్‌ఎస్ తమతోనే కలిసి వస్తుందని కాంగ్రెస్, బీజేపీ తమతో పొత్తు పెట్టుకుందని టీడీపీ పెద్దలు ధీమాతో ఉన్న తరుణంలో.. కాంగ్రెస్, బీజేపీలతో టీఆర్‌ఎస్ పెద్దలు ఏకకాలంలో పొత్తుల చర్చలకు తెరతీయటంతో పొత్తు వ్యవహారం రసకందాయంలో పడింది. బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఢిల్లీలోనే ఉన్న పార్టీ తెలంగాణ నేతలను పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరు ఎంపీ స్థానాలు, 60కి పైగా ఎమ్మెల్యే సీట్లతో పాటు సీఎం పదవిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని టీఆర్‌ఎస్ కోరుతున్న విషయాన్ని ఆయన రాష్ట్ర నేతలకు వివరించి వారి అభిప్రాయాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ప్రతిపాదన పట్ల రాష్ట్ర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. కానీ.. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటేనే తెలంగాణ లో కాంగ్రెస్ సేఫ్‌గా ఉంటుందనే భావన కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏమిటి చేయటమనే డైలమాలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు పడ్డారు.
40 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే!
టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని పదేపదే చెప్తున్న కాంగ్రెస్.. అందులో భాగంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ జి.వివేక్ తదితరులను దిగ్విజయ్‌సింగ్ బుధవారం తన నివాసానికి పిలిపించుకున్నారు. సుమారు గంటపాటు సమావేశమై టీఆర్‌ఎస్ ప్రతిపాదనలపై చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర పాలన ఉండాలంటే టీఆర్‌ఎస్‌తో పొత్తు అవసరం ఎంతైనా ఉందని దిగ్విజయ్ వారితో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతమున్న 25 సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలతో పాటు మరో 15 సీట్లు కలిపి మొత్తం 40 వరకు అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ సీట్లు కేటాయిద్దామని ప్రతిపాదించారు. మిగిలిన 79 అసెంబ్లీ సీట్లలో 10 స్థానాల్లో ఎంఐఎంతో అవగాహన ఉంటుందని, అలాగే పొత్తులో భాగంగా 9 సీపీఐ, 2 న్యూడెమోక్రసీ పార్టీలకు కేటాయించాల్సి ఉందని, మిగిలిన 58 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు జరిపారు.
సీఎం పదవి హామీ ఇస్తే.. టీఆర్‌ఎస్ ఓకే!
ఇదే అభిప్రాయాన్ని తమతో టచ్‌లో ఉన్న టీఆర్‌ఎస్ నేతలకు దిగ్విజయ్‌సింగ్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అటువైపు నుంచి మాత్రం 60 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు కేటాయిస్తే తప్ప పొత్తు సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే.. ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌కు సీఎం పదవి ఇస్తామని హామీ ఇస్తే సీట్లు తగ్గించుకునేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కూడా ఆ పార్టీ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. సీఎం సీటు సాధ్యం కాదని, సీట్ల సర్దుబాటులో భాగంగా తాము ప్రతిపాదించిన దానికంటే మరో రెండు, మూడు సీట్లు అటుఇటుగా సర్దుబాటు చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు సూచించినా టీఆర్‌ఎస్ నేతల నుంచి సానుకూల స్పందన రాలేదని కాంగ్రెస్ వరా్గాలు చెప్తున్నాయి. ఈ నేపధ్యంలో 24 గంటల్లో తమ ప్రతిపాదనల సంగత తేల్చాలని, లేనిపక్షంలో బీజేపీతో వెళ్లేందుకు వెనుకాడబోమని గులాబీ దళం నాయకులు తెగేసి చెప్పినట్లు తెలిసింది. దిగ్విజయ్‌తో చర్చల్లో పాల్గొన్న నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌తో పొత్తు ఖరారయ్యేలా కనిపించటం లే దు. ఎన్నికల్లో ఆ పార్టీతో తేల్చుకోక తప్పదు. దిగ్విజయ్ కూడా ఇదే భావనతో ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
కమలనాథులతో గులాబీదళం మంతనాలు...
కాంగ్రెస్‌తో పొత్తు సాధ్యమయ్యే పరిస్థితులు కానరాకపోవడంతో గులాబీ నేతలు తమ దృష్టిని బీజేపీ వైపు మళ్లించారు. గత మూడు రోజులుగా టీడీపీ, బీజేపీ పొత్తుల లెక్కలు తేలకపోవటంతో.. బీజేపీతో టీఆర్‌ఎస్ మంతనాలు మొదలుపెట్టింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు బుధవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్‌జవదేకర్‌లను కలిశారు. మరో సీనియర్ నేత అరుణ్‌జైట్లీతో కూడా మంతనాలు జరిపారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన టీఆర్‌ఎస్, తెలంగాణ ఏర్పాటులో చిత్తశుద్ధిని చూపిన బీజేపీ కలిసి వెళ్లడం వల్ల ఉభయ పార్టీలకు ప్రయోజనం ఉంటుందని రాజ్‌నాథ్‌కు వారు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకించిన టీడీపీ వల్ల బీజేపీకి నష్టమే తప్పితే ఒరిగే ప్రయోజనం ఉండదని కూడా పేర్కొన్నట్లు సమాచారం. అలాగే.. తెలంగాణలోని బీజేపీ నాయత్వం టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న విషయాన్నీ వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి 30 అసెంబ్లీ సీట్లు, 6 లోక్‌సభ స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వారు రాజ్‌నాథ్ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం.
‘సైకిల్’ కన్నా ‘కారు’తోనే జోరు...
ఈ ఆఫర్‌కు బీజేపీ సైతం మొగ్గుచూపిందనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఇస్తామన్న దానికన్నా తక్కువ సీట్లు ఇస్తామన్న టీఆర్‌ఎస్ వైపు బీజేపీ మొగ్గుచూపడానికి ప్రధాన కారణం.. అలా పోటీ చేసే స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటమేనని చెప్తున్నారు. అదే టీడీపీతో పొత్తు అయితే గెలుపుపై అంత నమ్మకం ఉండదనే వాదన ఉంది. బీజేపీ తమతోనే పొత్తుపెట్టుకుంటుందని టీఆర్‌ఎస్ సైతం బలంగా భావిస్తోంది. అయితే.. ప్రస్తుతం టీడీపీతో చర్చలు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి హామీ ఇవ్వలేమని, కానీ టచ్‌లో ఉండాలని టీఆర్‌ఎస్ ప్రతినిధులకు బీజేపీ అగ్రనేతలు సూచించినట్లు సమాచారం.
టీడీపీతో వెళ్తే ఇక కోలుకోలేమంటున్న టీ-బీజేపీ
బీజేపీ - టీడీపీ పొత్తు కోసం నరేంద్రమోడీ, తమకు సన్నిహితులైన బడా పారిశ్రామికవేత్తల ద్వారా చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ.. బీజేపీ రాష్ట్ర శ్రేణులు మాత్రం అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దేవద్దని కరాఖండిగా చెప్తున్నాయి. టీడీపీతో కలిసి వెళ్తే ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలటమే కాకుండా వచ్చే ఎన్నికల వరకు కూడా కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ బలం పెరిగినందున భావసారూప్యత గల టీఆర్‌ఎస్‌తో చెలిమి చేయటమే మంచిదని బీజేపీ రాష్ట్ర నేతలు వాదిస్తున్నారు. అలాగే.. టీడీపీతో పొత్తుకు తొలుత అనుకూలంగా ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా చంద్రబాబు వైఖరితో విసిగిపోయి ఆ పార్టీతో పొత్తు వద్దనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బడా పారిశ్రామికవేత్త సాయం కోరిన బాబు...
కానీ.. తెలంగాణలో అస్తిత్వం కోసం నానా తంటాలు పడుతున్న టీడీపీ మాత్రం ఈ ఎన్నికల్లో బీజేపీ అండలేకుంటే నామమాత్రపు సంఖ్యలో కూడా సీట్లు గెలుచుకునే అవకాశం లేదని ఆందోళన చెందుతోంది. దాదాపు ఆరు నెలల కిందటి నుంచే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కనుసన్నల్లో మెలుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన నుంచి పొత్తుకు అనుకూలంగా అనుమతి పొందారు. ఇప్పటికీ ఆయన అదే అభిప్రాయంతో ఉండేలా.. రాజ్‌నాథ్‌సింగ్ లాంటి వారు విసిగిపోయి పొత్తు వద్దన్నా మోడీ మనసు మార్చుకోకుండా ఉండేలా.. జాతీయ స్థాయిలో తనకు సన్నిహితుడైన ఓ బడా పారిశ్రామికవేత్త సాయాన్ని కూడా చంద్రబాబు తీసుకుంటున్నట్లు తెలిసింది. సదరు పారిశ్రామికవేత్త బీజేపీ - టీడీపీ పొత్తు కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు చెప్తున్నారు. మంగళవారం అరుణ్‌జైటీ సమక్షంలో అర్ధరాత్రి దాటేవరకు ఇరు పార్టీ నేతల మధ్య చర్చలు జరిగినా సీట్ల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. దీంతో ఇక చర్చలు వద్దని తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా చెప్పినా కూడా.. మోడీతో మాట్లాడి చెప్తామంటూ ఆ పార్టీ అధినాయకత్వం ఇంకా సాగదీస్తోంది.
కుదిరిందని టీడీపీ.. ఏకాభిప్రాయమే లేదని బీజేపీ!
ఈ క్రమంలోనే.. చర్చల్లో పాల్గొన్న నిజామాబాద్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బుధవారమే తీవ్ర అసంతృప్తితో హైదరాబాద్‌కు తిరిగొచ్చినా.. కిషన్‌రెడ్డి, మరో సీనియర్ నేత దత్తాత్రేయలు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు.. బీజేపీతో పొత్తు కుదిరిందని, సీట్ల విషయంలోనూ దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని పేర్కొనగా.. ఆ కొద్దిసేపటికే బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ ఆ వ్యాఖ్యలను ఖండించటం గమనార్హం. పొత్తుపై ఏకాభిప్రాయమే రాలేదని, అలాంటిప్పుడు సీట్ల విషయంలో సయోధ్య కుదరిందనటం సరికాదని యెండల పేర్కొన్నారు. పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ జవదేకర్ కూడా ఢిల్లీలో ఇదే తరహా వ్యాఖ్యలు చేయటం విశేషం. ఇదిలావుంటే.. కిషన్‌రెడ్డి, జవవదేకర్‌లు గురువారం హైదరాబాద్ వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
కొసమెరుపు: తెలంగాణలో పొత్తులపై ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య నాలుగు స్తంభాలాట జరుగుతుండగా.. తాజాగా టీఆర్‌ఎస్ నాయకుడు కడియం శ్రీహరి సీపీఎం కార్యాలయానికి వెళ్లి తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో మంతనాలు ప్రారంభించారు.
పొత్తు పెళ్లిలాంటిది!
చర్చలను బట్టి అది జరగొచ్చు.. జరగకపోవచ్చు
టీడీపీతో పొత్తుపై జవదేకర్ వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీతో పొత్తు చర్చలకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ కొత్త భాష్యం చెప్పారు. అవి పెళ్లి కోసం జరిగే చర్చల వంటివని.. పెళ్లి జరగొచ్చు.. జరగకపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జవదేకర్ మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు. ‘పొత్తు అనేది పెళ్లి లాంటిదే. రాజకీయమైనా... పెళ్లయినా ఇరు పక్షాల ఆమోదయోగ్యంతోనే జరుగుతుంది. ఒక బంధం ఏర్పడటానికి పెళ్లి కోసం చర్చలు జరిపినట్లే రాజకీయాల్లో పొత్తు కోసం కూడా చర్చ జరుగుతుంది. పెళ్లి జరగవచ్చు... జరగకపోవచ్చు. అలానే పొత్తు కూడా ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. త్వరలోనే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం’ అని జవదేకర్ వ్యాఖ్యానించారు. పొత్తులపై టీవీల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. ఇరు పార్టీల మధ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం వస్తుందని చెప్పారు.
పొత్తుకు ద్వారాలు తెరిచే ఉంచాం
కేసీఆర్ మా దారికే వస్తున్నారు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్ ద్వారాలు తెరిచే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగానే టీఆర్‌ఎస్ సహా ఉద్యమ శక్తులతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంత త్యాగం చేయక తప్పదన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూంను బుధవారం ప్రారంభించిన సందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ చరిత్రాత్మక ఘటన నేపథ్యంలో పొత్తుకు తలుపులు తెరిచే ఉంచామన్నారు. తెలంగాణను పునర్నిర్మిస్తానని నిన్నటి వరకు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ‘బంగారు తెలంగాణ’గా అభివృద్ధి చేస్తానంటూ కాంగ్రెస్ దారిలోకే వచ్చారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇస్తుందనడం ఊహాగానాలేనన్నారు. సీపీఐతో పొత్తుపై ఒకటి రెండ్రోజుల్లోనే హైకమాండ్ నుంచి ప్రకటన వస్తుందని పొన్నాల చెప్పారు.
నేడు ఢిల్లీకి పొన్నాల, జానా
తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. టీపీసీసీ పంపిన జాబితాపై ఇప్పటికే పలుమార్లు చర్చించిన ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చివరి వడపోత మొదలు పెట్టింది. అందులో భాగంగా అధిష్టానం పిలుపుపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత కె.జానారెడ్డి గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. అభ్యర్థుల ఖరారుతోపాటు టీఆర్‌ఎస్‌తో పొత్తుపైనా హైకమాండ్‌తో చర్చించనున్నారు. బుధవారం కూడా హైకమాండ్ పెద్దలు కేసీఆర్‌తో మాట్లాడినట్లు టీపీసీసీ వర్గాల సమాచారం. పొత్తుపై రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.