ప్రియాంకపైనా భ్రమలు పోతాయి
న్యూఢిల్లీ: సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ వారణాసిలో మోడీపై పోటీ చేయాలని.. అలా చేస్తే ఆమెపై ఉన్న భ్రమలన్నీ పటాపంచలవుతాయని బీజేపీ ఎద్దేవా చేసింది. రాహుల్‌గాంధీ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... వారి కుటుంబం ప్రియాంకవైపు చూస్తోంద ని విమర్శించింది. వారణాసిలో మోడీపై పోటీ చేస్తానని ప్రియాంకాగాంధీ పేర్కొన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో..
సోమవారం బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్పందించారు. ‘కాంగ్రెస్‌లో ఒక వారసుడు విఫలం కాగానే.. ప్రత్యామ్నాయంగా మరో కుటుంబ సభ్యుడి కోసమే చూస్తారు. ఇది ఊహించిందే. రాహుల్‌పై భ్రమలు తొలగిపోగానే.. ప్రియాంక వైపు చూస్తున్నారు. ఆమెపైనా భ్రమలు తొలగిపోవడం ఇప్పుడు దేశానికి అవసరం. మోడీపై ప్రియాంక పోటీ చేయాలి. అప్పుడు ఈ వారసురాలిపైనా భ్రమలు పటాపంచలవుతాయి’ అని జైట్లీ అన్నారు.