‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలిం చారు. 23 జిల్లాలను ఒకే రీతిలో ప్రేమించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశారు.
23 జిల్లాల ప్రజలనూ వైఎస్ ఒకేలా ప్రేమించారు: విజయమ్మ
ఇన్నాళ్లూ ఖూనీకోర్లు.. అక్రమార్కులూ అంటూ కాంగ్రెస్ నేతలను తూర్పారబట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ నేతలకే రెడ్‌కార్పెట్ పరచి టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డయినా కరుస్తారనడానికి ఇదే నిదర్శనం.
- వైఎస్ విజయమ్మ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలిం చారు. 23 జిల్లాలను ఒకే రీతిలో ప్రేమించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశారు. అందుకే వైఎస్‌ను అన్ని ప్రాంతాల ప్రజలు అభిమానిస్తున్నారు. వైఎస్ మరణిస్తే.. ఆ వార్త విని 700 మంది చనిపోయారు. వైఎస్ బతికున్న రోజుల్లో ఏ రోజు కూడా రాష్ట్రాన్ని విభజించే సాహసం చేయలేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోడ్‌షో నిర్వహించారు.
వైఎస్సార్ సర్కిల్ వద్ద భారీ జనసంద్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ చనిపోయిన నాలుగు నెలలకే కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై తెలుగు జాతిని రెండు ముక్కలు చేయడానికి కుట్రపన్నాయని, ఆ కుట్రను రాష్ట్రంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డి అమలు చేశారని విమర్శించారు. ‘‘చంద్రబాబు సమన్యాయం అంటూ రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు, సీట్ల కోసం తాపత్రయపడితే, కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనకు రూట్ మ్యాప్ రూపొందించి.. మరోవైపు సమైక్య చాంపియన్ ముద్ర కోసం పడరాని పాట్లు పడ్డారు’’ అని దుయ్యబట్టారు.