ఆడపిల్లల్ని ఆడనివ్వండి!
ఎముకల బలానికి...
సర్వేక్షణం
ఆటలు ఆడడం వల్ల పతకాల సంగతెలా ఉన్నా, ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే, టీనేజ్‌కి ముందు వయసు ఆడపిల్లలు, టీనేజ్ తొలినాళ్ళలో ఉన్న ఆడపిల్లలకు ఆటల వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయట! స్వీడన్‌కు చెందిన ఒక అధ్యయనం ఈ సంగతి బయటపెట్టింది. మామూలు ఆటల మొదలు జిమ్నాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ లాంటి కాస్తంత అధిక శ్రమతో కూడిన ఆటలు ఆడడం వల్ల పెరిగే వయసు ఆడపిల్లలకు ఉపయోగం ఉందని ఆ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా ఆడపిల్లల ఎముకలు పటిష్ఠంగా మారతాయి. ఎముకల నిర్మాణం, వాటి బలం మెరుగవుతాయి. స్కూలు పిల్లల మీద అధ్యయనం చేసి, ఈ విషయం కనిపెట్టారు. మామూలు కన్నా ఎక్కువ శారీరక శ్రమ ఉండేలా ఆటలు ఆడడం వల్ల అమ్మాయిల్లో అబ్బాయిల కన్నా ఎక్కువగా ఎముకలు బలపడ్డాయి. సర్వసాధారణంగా వారానికి 60 నిమిషాలు స్కూలులో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులో పాల్గొనేవారితో పోలిస్తే, వారానికి 200 నిమిషాల పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తీసుకున్నవారిలో ఈ తేడా చాలా స్పష్టంగా కనపడింది. కాబట్టి, ఎముకలు పెరిగే టీనేజ్ తొలినాళ్ళలో ఆడపిల్లలు గనక స్కూల్‌లో ఎక్కువ సేపు ఆటల క్లాసుల్లో పాల్గొంటే, ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ముఖ్యంగా, రేపు పెద్దయ్యాక వాళ్ళ ఎముకల ఆరోగ్యం బాగుంటుంది.
ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం తగ్గుతుందని స్వీడన్‌లోని లుంద్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. వాళ్ళు ఈ అధ్యయన ఫలితాల్ని ‘ఇంటర్నేషనల్ ఆస్టియో పోరోసిస్ ఫౌండేషన్’ వారి పత్రికలో ప్రచురించారు. అందుకే, మన ఆడపిల్లల్ని ఆడనిద్దాం. మరో సాక్షీ మలిక్‌లు... పి.వి. సింధులు కావచ్చు. ఒలింపిక్స్‌లో పతకాలు తేవచ్చు. అంత వరకు వెళ్ళకపోయినా, కనీసం జీవితాంతం మన పిల్లలు ఎముక పుష్టితో ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడుపుతారు.