వివాహం వద్దు వారసుడు కావాలి | Do not want to marriage to descendant | Sakshi
Sakshi News home page

వివాహం వద్దు వారసుడు కావాలి

Published Tue, Jun 28 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

వివాహం వద్దు   వారసుడు కావాలి

వివాహం వద్దు వారసుడు కావాలి

ట్రెండ్

 

అతడు పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కాని తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. ఆమెకు పెళ్లంటే అయిష్టం. కాని తల్లి కావాలనుకుంటోంది. అతను కాని ఆమె కాని డబ్బు ఖర్చు పెడితే చాలు. అద్దె గర్భం ద్వారా బిడ్డను కని సింగిల్ పేరెంట్స్ అయిపోతున్నారు. వైవాహిక వ్యవస్థ ఉలిక్కి పడేలా మొదలైన ఈ ట్రెండ్ తుషార్ కపూర్ నిర్ణయంతో కుతూహలం రేపుతోంది. పెళ్లికి నో అన్న తుషార్ అద్దె గర్భంతో తాజాగా తండ్రయ్యాడు.

 

మాతృత్వం ఎప్పుడూ తల్లికే అపాదిస్తారు. కన్నతల్లికే మాతృహృదయం ఉంటుందని అంటారు. పిల్లలు తల్లిపాలు తాగి తల్లి ఒడిలో ఎదగాలని చెప్తారు. లాల పోసి, గోరు ముద్దలు తినిపించి, జోలపాట పాడి... ఇవన్నీ అమ్మ డ్యూటీలే. వక్షంలో పాలు ఉండటం ఆమెకూ బిడ్డకూ మధ్య అవినాభావ సంబంధాన్ని ఏర్పరచింది. తండ్రి బయట వరకే ఉంటాడు. ఎత్తుకొని ఆడిస్తాడు. బజారుకు తీసుకెళతాడు. పెంపకంలో సాయపడి విద్యాబుద్ధులకు సహకరిస్తాడు. అందుకే విడాకుల కేసుల్లో చాలా మటుకు పిల్లల పెంపకం బాధ్యత తల్లికే అప్పగిస్తుంటాయి కోర్టులు. తల్లితో పెరగడంలోని వికాసం తండ్రితో పెరగడంలో ఉండదు అని భావించడం వల్ల కొనసాగుతున్న భావన ఇది.

 

ఇప్పుడు మారింది...
అయితే ఇప్పుడు కాలం మారింది. తండ్రులు తమ బిడ్డల పెంపకాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తున్నారు. ఒకవేళ విడాకులు మంజూరైతే బిడ్డల పెంపకం తీసుకోవడానికి వారు వెనుకాడటం లేదు. మరోవైపు పెళ్లికాని పురుషులు లేదా పెళ్లి చేసుకోవాలనుకోని పురుషులు కూడా పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రతి పురుషుడిలోనూ తండ్రిగా మారమని చెప్పే సహజాతాలుంటాయి కనుక తండ్రిగా ఉండాలనుకునే ఇచ్ఛ వారిని దత్తత వైపు ప్రేరేపిస్తోంది. అయితే స్త్రీలకు ఈ విషయంలో ఉన్న అనుకూలత స్త్రీలకు లేదు. పెళ్లి కాని పురుషులు దత్తత కోసం వస్తే వారిని సందేహించడమే కనిపిస్తుంది. ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకున్నాక ఆ పిల్లలను ఇతరత్ర ఏమన్నా ఉపయోగిస్తారా? వంటి సందేహాలు ఉన్నాయి. హిందూధర్మం కూడా వివాహిత దంపతులే దత్తత తీసుకోవాలని సూచిస్తుంది. మరి దీనికి విరుగుడు?

 

సరొగసీ...
ఇంతకు ముందు బిడ్డలు పుట్టడంలో ఇబ్బందులు ఉన్న భార్యాభర్తలు, లేదా పిల్లలు కనడానికి వృత్తి రీత్యా లేదా ఆరోగ్యం రీత్యా వీలు లేని శ్రీమంతులు అద్దె గర్భాల ద్వారా పిల్లలను కనడం చూశాం. ఇప్పుడు బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ ఉదంతంలో అవివాహితుడిగా ఉంటూ తండ్రిగా మారడం గమనించాం. ప్రసిద్ధ హిందీ నటుడు జితేంద్ర కుమారుడైన తుషార్ కపూర్ అవివాహితుడు. అతడికి ప్రస్తుతం 40 నిండుతున్నాయి. పెళ్లి పట్ల సముఖంగా లేని తుషార్ తండ్రిగా ఉండాలనే ఇచ్ఛను మాత్రం వదలుకోదల్చుకోలేదు. ఒకసారి తిరుమలలో దర్శనం కోసం వేచి ఉన్నప్పుడు దర్శకుడు ప్రకాష్ ఝా అతడూ కలుసుకున్నాడు. ప్రకాష్ ఝా తాను అద్దె గర్భం ద్వారా ఒక కూతురిని కన్నానని, నీకు తండ్రి కావాలంటే అదే మంచి పద్ధతి అని తుషార్‌కు చెప్పాడు. తుషార్‌కు ఈ ఆలోచన నచ్చింది. వెంటనే ముంబై జస్‌లోక్ ఆస్పత్రిలో కృత్రిమ గర్భధారణ విభాగాధిపతిని కలుసుకున్నాడు. అంతవరకూ అలాంటి ఆలోచనతో వచ్చిన మగవాళ్లు లేరు. కాని తుషార్‌లో తండ్రి కావాలనే భావనను గమనించిన ఆ విభాగాధిపతి డాక్టర్ ఫిరూజా పారిక్ అందుకు అంగీకరించి అద్దె గర్భం ద్వారా తండ్రి కావచ్చునని సూచించింది. మిగిలిన లాంఛనాలన్నీ ఆస్పత్రి వర్గాలే చేశాయి. వీటిలో ముఖ్యమైనది ఏమిటంటే ఆ అద్దెగర్భం ఇస్తున్న మహిళ ఎవరో తుషార్‌కు తెలియనివ్వకుండా ఉంచడం. తొమ్మిది నెలల పాటు తుషార్ తనకు పుట్టబోయే బిడ్డ బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నాడు. గడువు ముగిశాక కొడుకు పుట్టడంతో పొంగిపోయాడు. ఆ కొడుకు ఇంటికొచ్చాకే బయటి ప్రపంచానికి ఆ వివరాలు తెలియచేశాడు.

 

పెళ్లిలో సెగే కారణమా...
ఇవాళ్టి యువత పెళ్లికి భయపడుతోందా? జీవిత భాగస్వామితో వేగలేనని భావిస్తోందా? లేకుంటే మొదట పెళ్లికి భయపడి లివ్ ఇన్ రిలేషన్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత ఆ రిలేషన్ కూడా భారమని భావించి ఏకంగా ఒంటరిగా జీవిస్తూ అద్దె గర్భంతో తల్లిగానో తండ్రిగానో మారాలని అభిలషిస్తోంది. ఇది ప్రతి సమూహం గమనించి తమ సమూహాలలోని పెళ్లిళ్లను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తోంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎదుటి మనిషిని భరించడం నేర్పడం లేదా? సహించడం నేర్పడం లేదా? జీవిత భాగస్వామిని ఆ భాగస్వామి తప్పొప్పులతో పాటు స్వీకరించే పరిణితిని ఇవ్వడం లేదా? జీవిత భాగస్వామిని ఆ భాగస్వామి కుటుంబ సభ్యులతో సహా గౌరవించే సంస్కారం ఇవ్వడం లేదా? డబ్బు, కట్నం... వీటి కోసం కీచులాటల వల్ల విడాకుల కంటే కలిసి బతకడంలోని వైఫల్యమే నేటి యువతను వివాహం అనగానే విముఖత కలిగేలా చేస్తున్నాయా?

 

భవిష్యత్తు ఏమిటి?
అద్దె గర్భాల ద్వారా స్త్రీలు తల్లులుగా, పురుషులు తండ్రులుగా మారుతుంటే ఆ పిల్లల పెరుగుదల ఎలా ఉంటుంది? తల్లిదండ్రులలో ఎవరిదో ఒకరి ప్రేమే పొందుతుంటే ఆ పిల్లల వికాసం ఎలా ఉంటుంది? అలా పెరిగి పెద్ద అయిన వారి వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఎలా ఉం టుంది? ఇవన్నీ సందేహాలే. అయితే నూటికి ఒకటో రెండో శాతం మంది మాత్రమే ఈ దారిన నడుస్తున్నారని భారతీయ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉందని భావించేవారు ఉన్నారు. కాని స్పీడు యుగం, పోటీ ప్రపంచం స్త్రీ పురుషులను తల్లిదండ్రులుగా మార్చడానికి తల్లిదండ్రులుగా కలిసి ఉంటూ పిల్లలను పెంచడానికి అడ్డంకులు కల్పిస్తున్నదనడం వాస్తవం. ధోరణి ఇలాగే ఉంటే పిల్లల బర్త్ సర్టిఫికెట్‌లో మదర్/ ఫాదర్ అని రెండు గడులు ఉండవు. సింగిల్ పేరెంట్ నేమ్ అని ఉంటుంది. అది మాత్రం తథ్యం.

 

తుషార్ కొడుకు ‘లక్ష్యా’పరు లక్ష్యా...
తుషార్ తన కొడుకు పేరును లక్ష్యా అని పెట్టాడు. తను అచ్చు నాలానే ఉన్నాడు... అందువల్ల కూడా నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నాను అని అతడు పత్రికల వారికి చెప్పాడు. తుషార్ నిర్ణయానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అని తుషార్ తల్లిదండ్రులు జితేంద్ర, శోభా కపూర్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలియచేశారు. జితేంద్రకు తుషార్ కాకుండా కుమార్తె ఏక్తా ఉన్న సంగతి విదితమే. ఆమె కూడా వివాహం చేసుకోలేదు. ‘ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. అమ్మా నాన్న చెల్లెలు, నేను నా కొడుకు లక్ష్యా... మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అని తుషార్ అన్నాడు. తుషార్ ఇలాంటి ఆలోచన చేశాడని తెలియని బాలీవుడ్ మిత్రులు కూడా ఈ వార్తతో ఎంతో ఆశ్చర్యం ప్రకటించారు. తుషార్ నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు తెలిపారు. జస్‌లోక్ ఆస్పత్రి వర్గాలు కూడా ‘తుషార్ లాంటి సెలబ్రిటీ తీసుకున్న నిర్ణయం ఎక్కువ మందికి చేరి అవివాహిత పురుషులు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నాం’ అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement