ఇరినా బ్రూనింగ్
ఒక ప్రయాణం జీవిత గమనాన్నే మార్చేయవచ్చు. ఈ మాట ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్ విషయంలో నిజమైంది. నాలుగు దశాబ్దాల క్రితం జర్మనీ నుంచి ఇండియా వచ్చి, ఇక్కడే స్థిరపడిపోయారు బ్రూనింగ్. అందుకు కారణం.. ఆవులపై ఆమెకు కలిగిన ప్రేమ, ఆపేక్ష!
ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్‌కి ఇప్పుడు 59 ఏళ్లు. ఆమె నలభై ఏళ్ల కిందట.. 1978లో భారతదేశంలో పర్యటించారు. తండ్రి ఇండియాలో ఉన్న జర్మనీ రాయబార కార్యాలయంలో ఉద్యోగి కావడం కూడా ఆమె ఇండియా రావడానికి ఒక కారణం. ఆ పర్యటనలో ఆమె రాధాకుండ్, మధుర వగైరా ప్రదేశాలను చూశారు. మధురలోనే ఉండిపోయారు. ఆ ప్రయాణం ఆమెను ఆవులకు దగ్గర చేసింది. వాళ్ల పొరుగింటావిడ ఆవు మీద చూపిస్తున్న ప్రేమకు కదిలిపోయారు బ్రూనింగ్. తాను కూడా ఒక ఆవుని తెచ్చుకున్నారు. ఆవులను ఎలా పెంచాలో పక్కింటామె నేర్పించింది. ఇంకా తెలుసుకోవడానికి ఇంగ్లిష్, జర్మన్ భాషల్లో ఉన్న పుస్తకాలను కొన్నారు బ్రూనింగ్. ఒక్క ఆవుతో సంరక్షణ మొదలుపెట్టిన బ్రూనింగ్ దగ్గర ఇప్పుడు దూడలు, కోడెలతో కలిపి మొత్తం పన్నెండు వందల వరకు ఆవులున్నాయి. ఆ ఆవులే ఆమెకి లోకం. వాటికి గ్రాసం పెట్టి శుభ్రం చేయడానికి, అనారోగ్యంతో బాధపడుతున్న వాటికి మందులు వేయడానికి మొత్తం అరవై మంది వరకు పనివాళ్లున్నారు. నెలకు ఖర్చు ఇరవై లక్షలు దాటుతోంది.
పాలిచ్చే దశ దాటిన ముసలి ఆవులను, కాళ్లు విరిగిన వాటిని, కళ్లు పోయిన వాటిని బ్రూనింగ్ నడుపుతున్న ‘సురభి గోసేవా నికేతన్’ గోశాల ముందు వదిలి వెళ్లిపోతుంటారు స్థానికులు. వాటి బాధ్యత కూడా ఆమె ఎంతో ఆపేక్షగా స్వీకరిస్తారు. ఒకసారి బ్రూనింగ్ గోశాలలోకి అడుగుపెట్టిన ఆవు పోషణ, సంరక్షణ అంతా ఆమె స్వయంగా చూసుకుంటారు.అయితే అన్నిటికీ కలిపి నెలకు ఇరవై లక్షలు ఖర్చు చేయడం కష్టమేనంటున్నారామె. మొదట్లో తండ్రి తన జీతం నుంచి ఆమెకు కొంత డబ్బు పంపేవారు. ప్రస్తుతం బెర్లిన్‌లో తనకు ఉన్న భవనాలు, ఇతర ఆస్తుల నుంచి వచ్చే డబ్బును ఆవుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఏడాదికోసారి బెర్లిన్ వెళ్లి తండ్రిని చూసి వస్తారు బ్రూనింగ్. ప్రభుత్వం ఆమెకి కనీసం లాంగ్‌టర్మ్ వీసా కూడా ఇవ్వలేదు. నాటి నుంచీ ఏటా వీసా రెన్యువల్ చేసుకుంటూనే ఉన్నారు! అయితే బ్రూనింగ్ డబ్బు కానీ, లాంగ్ టర్మ్ వీసా కానీ ఏమీ అడగడం లేదు. ఆవులు పెరుగుతున్నాయి, గోశాల స్థలం సరిపోవడం లేదు. కాబట్టి మరికొంత జాగా ఇస్తే... వచ్చిన ఆవులన్నింటినీ అమ్మలా సాకుతానంటున్నారు. స్థానికులు ఆమెను సుదేవీ మాతాజీ అని గౌరవిస్తున్నారు తప్ప జానెడు స్థలం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు!
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment