రవి కాంచిన కళ
రవి కాంచిన కళ
Published Wed, Aug 7 2013 1:26 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM
సౌందర్యాన్ని ఆరాధించడం, అధ్యయనం చేయడం, ఆస్వాదించడం ద్వారా కళలోని అనుభూతి, ఆనందాలను సొంతం చేసుకోగలం. అలా సొంతం చేసుకున్న కళాపిపాసి రవీంద్రనాథ్ ఠాగూర్. చిత్రకళలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ తనదైన శైలిని ప్రతిబింబించారు. పాశ్చాత్య చిత్రకారులు చార్లెస్ పామర్, గిలార్డ్ వద్ద చిత్రలేఖనం నేర్చుకున్నప్పటికీ తాను గీసిన చిత్రాల్లో భారతీయ ఆత్మను ప్రదర్శించారు.
మిగిలిన చిత్రకారుల మాదిరిగా ముదురురంగుల్లో కాకుండా... నీటిరంగుల్లో, లేతరంగుల్లో, వివిధ మాధ్యమాల్లో చిత్రాలు వేశారు ఠాగూర్. సిరా, పేస్టల్స్‌తో కూడా చిత్రాలు రూపొందించారు. రవీంద్రుడికి అమితంగా నచ్చిన అంశం ప్రకృతి. జీవితంలో ఎక్కువగా భాగం ప్రకృతితో సంభాషణ చేయడానికి ఇష్టపడిన తాత్వికుడు ఠాగూర్. ఆయన గీసిన చిత్రాల వలన కలిగే అనుభూతి కాలాతీతమైనది. ఎప్పుడూ గుర్తుండి పోయేది.
కృతకమైన అలంకరణలు, ఆడంబరాలు నిజమైన ప్రేమకు అడ్డుగోడగా నిలుస్తాయని ఆయన నమ్మకం. అందుకే అలంకరణను వదిలి భావవ్యక్తీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిరాడంబరమైన చిత్రాలనేకం ఆయన కుంచె నుంచి జాలువారాయి. ఆయనకు సంగీతం కూడా ఇష్టమైనదే కావడంతో చిత్రాల్లో ‘లయ’ కనబడుతుంది. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రవీంద్రునికి ముందే అనేక మంది చిత్రరచన చేసినా ‘బెంగాలీ సంప్రదాయం’ ఠాగూర్ నుంచి వచ్చినదే. యూరప్‌లో వచ్చిన సాంస్కృతిక పునర్జీవనం లాంటిది బెంగాలీ చిత్రకళలో తీసుకువచ్చారు. రవీంద్రుని ద్వారా బెంగాల్ చిత్రకళ సరికొత్త ఉత్తేజాన్ని పొందింది.
తాత్వికుడైన ఠాగూర్ దృష్టిలో కళాసృష్టి అంటే-
‘‘అంధకారబంధురమైన ఈ లౌకిక ప్రపంచంలో కొట్టుమిట్టాడే వారికి అనంత సౌందర్య ప్రపంచంలో సర్వేశ్వరుడు దర్శనమిస్తాడు’’
సౌందర్యపిపాసి అయిన ఠాగూర్ తన ఊహాసుందరి, కళాప్రేయసిని ఊహిస్తూ...
‘‘ఒక శూన్య సంతోషం నాలో నిండనీ
నా చేతిని నీ చేతిలో తీసుకో అంతే చాలు
చీకటి పరుచుకునే నిశివేళ
నా హృదయం నీదిగా చేసుకో’’ అంటారు.
రవీంద్రుడు దాదాపు మూడువేల చిత్రాల్ని సృష్టించాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. రవీంద్రుడి చిత్రాలలో ఆధునికతతో పాటు సంప్రదాయం కూడా ఉండడం వలన అవి అందరినీ ఆకట్టుకున్నాయి. మన మనోసీమలో పదిలంగా నిలిచిపోతాయి.
ఇంగ్లండ్, డెన్కార్క్, రోమ్, జర్మనీ, స్వీడన్, రష్యాలలో రవీంద్రుని చిత్రప్రదర్శనలు జరిగాయి. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు రవీంద్రుడి చిత్రాలంటే ఇష్టంగా ఉండేది.
కవిత్వంలో, చిత్రాల్లో ప్రకృతిని సాక్షాత్కరింప చేసిన ఠాగూర్ మన మధ్య లేకపోయినా ఆయన గీసిన చిత్రాలు మాట్లాడుతూనే ఉంటాయి. రవీంద్రుడిని మన మధ్య నిలుపుతూనే ఉంటాయి.
- రామశాస్త్రి
(కవి, చిత్రకారుడు)
Advertisement
Advertisement