ఈమె పేరు శ్యామల గోలి. చిన్నప్పటి నుంచి చదువులో యావరేజ్.. తండ్రి ఒకటి తలిస్తే తాను ఇంకోటి నేర్చుకున్నారు. ఎవరూ ఊహించని దారి ఎంచుకున్నారు.. బొమ్మల్ని కదిలించి యానిమేటర్ అయ్యారు.. నష్టాలకు ఎదురీదారు. తన 44వ యేట స్విమ్మింగ్‌ను కెరీర్‌గా తీసుకున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఇటీవల (డిసెంబర్ 22వ తేదీన) హుగ్లీలో పధ్నాలుగు కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ అన్ని విజయాల వెనక ఒక ఫెయిల్యూర్ ఇచ్చిన ప్రేరణ ఉంది. తండ్రి చెప్పిన మాట తాలూకు శక్తి ఉంది.
శ్యామల సొంతూరు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట. మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్ లిఫ్టర్. చాలా రికార్డులు బ్రేక్ చేశారు. కాని తన ముగ్గురు పిల్లలను క్రీడలకు దూరంగా పెట్టారు. ఆటల్లో నెగ్గుకు రాగలరేమో కాని ఆ రంగంలోని రాజకీయాల్లో నెగ్గుకు రావడం కష్టమని.. ఆ రంగంలోని కష్టనష్టాలను చూసి, అనుభవించిన వాడిగా. వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్లినప్పుడల్లా జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిల్లో ఐఏఎస్ ఆఫీసర్ల హోదా, వాళ్లకు అందే గౌరవాలు చూసి తన పెద్ద కూతురు శ్యామల (శ్యామలకు ఒక తమ్ముడు, చెల్లి)ను ఐఏఎస్ చేయాలని నిశ్చయించుకున్నాడు. శ్యామల మాత్రం అనుకోలేదు, ఆసక్తీ చూపించలేదు. అందుకే ఆమె గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం.
పెళ్లితో కాదు.. ఆర్థిక స్వాతంత్య్రంతో..
చదువులో అంతగా ఆసక్తిలేని శ్యామలకు మొదటి నుంచీ చిత్రలేఖనం మీదే శ్రద్ధ. హైస్కూల్లో ఉన్నప్పుడే బీఈడీ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ కోసం కాన్సెప్ట్ డెవలప్‌చేసి.. బొమ్మలు గీసిస్తూండేవారు. పిల్లలను ఆటలకు దూరంగా ఉంచారే కాని తండ్రిగా వెంకటరాజు పిల్లలనెప్పుడూ బంధించలేదు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక్క మగపిల్లాడి మధ్య లింగవివక్షనూ చూపించలేదు. చిన్నప్పుడొకసారి శ్యామల తనకు ఇష్టమైన సినిమా నటుడి బొమ్మతో ఉన్న పేపర్‌ను పుస్తకానికి అట్టగా వేసుకుంటే చూసి ‘‘ అమ్మాయికి పెళ్లి పరమావధి కాదు.. ఆర్థిక స్వాతంత్య్రంతోనే జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఇలాంటి బొమ్మలు పెళ్లి మీదకు ఆలోచనలు మళ్లిస్తాయి’’ అని కూతురిని హెచ్చరించారు. ఆ మాటతో అప్పటికప్పుడు అట్టను చించనైతే చించేశారు కాని చదువు మీద ఆసక్తయితే పెంచుకోలేదు ఆమె. ఫలితం.. టెన్త్‌లో ఫెయిల్. ఆ ఫెయిల్యూరే ఆమెలో పట్టుదలను పెంచి తర్వాత విజయాలను చూపించింది. నాగార్జున యూనివర్శిటీలో ఎమ్మే సోషియాలజీ చేయించింది.
తర్వాత..
‘‘ఏముంది? పెళ్లి. మా వారి పేరు మోహన్. సివిల్ ఇంజనీర్. అయితే మా నాన్న మాట మాత్రం మరచిపోలేదు’’అంటూ తన జీవితంలోని తర్వాత ఘట్టం చెప్పారు శ్యామల. రెండేళ్లకు బాబు పుట్టాడు. అప్పుడు వాళ్లాయన ఉద్యోగరీత్యా గుజరాత్‌లో ఉన్నారు. ఒకసారి సంక్రాంతి కోసమని సామర్లకోట వచ్చారు. తర్వాత రెండు నెలలకే బంధువుల పెళ్లి ఉంటే చంటిబాబుతో మళ్లీ అంతదూరం ప్రయాణం చేసి రావడం కష్టమని శ్యామలను ఊళ్లోనే ఉంచి అతను వెళ్లిపోయారు. ఆ టైమ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు శ్యామల. కాకినాడలోని ఎరీనా మల్టీమీడియా ఇన్‌స్టిట్యూట్‌లో చేరి మల్టీమీడియా, వెబ్‌డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. యేడాది కోర్స్‌ను మూడు నెలల్లో పూర్తిచేశారు శ్యామల. సరిగ్గా అప్పుడే భర్తకు బెంగళూరు బదిలీ అయింది. మకాం బెంగళూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓ ఊరికి మారింది.
యానిమేషన్ సిరీస్..
మల్టీ మీడియా, వెబ్‌డిజైనింగ్‌లో డిప్లొమా కోర్స్ ఇచ్చిన నేర్పు, నైపుణ్యంతో, తండ్రిమాటనూ ప్రాక్టికల్ చేయడానికి ఫోటోగ్రాఫిక్స్ స్టూడియో పెట్టారు. మంచి లాభాల్లో సాగుతూన్నప్పుడే పిల్లాడి స్కూల్ కోసం బెంగళూరుకి షిఫ్ట్ కావల్సి వచ్చింది. ఖాళీగా కూర్చోవడం ఇష్టంలేక ఉద్యోగం కోసం వెదికారు. చిన్న యానిమేషన్ స్టూడియోలో ఉద్యోగం దొరికింది. అప్పటికే బాబు కోసం స్పైడర్ మాన్‌లాంటి యానిమేషన్ క్యారెక్టర్ ఒకటి తయారు చేయాలని పంచతంత్ర కథలను తనే రిటోల్డ్ చేసుకొని.. బొమ్మలు గీస్తూ.. గ్రాఫిక్ చేస్తూ .. వాటికి తన వాయిస్‌నే రికార్డ్ చేస్తూండేవారు ఇంట్లో. తను పనిచేస్తున్న స్టూడియోలోనే మణిరత్నం ‘బాయ్స్’సినిమాలోని ఒక పాటకు విజువల్ ఎఫెక్ట్స్ తయారు చేసిన శరత్ అనే యానిమేటర్‌తో పరిచయం అయింది ఆమెకు.
‘‘ఆయన పనితీరు గమనిస్తూండేదాన్ని. ఆయనేమో తనను ఎక్కడ కాపీ కొడతున్నానో అనుకొని మానిటర్‌ను నాకు కనపడకుండా తిప్పుకొనేవారు. ఆనక నా వర్క్ గురించి తెలిసి కొన్ని టెక్నిక్స్ నేర్పించాడు’’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు శ్యామల. తర్వాత కొద్దికాలానికే ఆ స్టూడియో మూత పడింది. కాని ఆమె ఆగలేదు. డిజిటల్ డ్రీమ్ డిజైనర్స్ పేరుతో వెబ్‌డిజైనింగ్‌లోకి అడుగిడారు ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకొని. చెన్నై నుంచి సౌది అరేబియాదాకా దాదాపు రెండువందలకు పైగా దేశీ, విదేశీ ప్రాజెక్ట్‌లకు పనిచేశారు. ఈలోపు భర్తకు హైదరాబాద్‌లో మంచి అవకాశం రావడంతో అనివార్యంగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది ఆమె. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్స్‌కి పనిచేస్తూనే తన చిరకాల వాంఛ అయిన యానిమేషన్ ప్రాజెక్ట్ మీదా మనసు పెట్టారు.
ఆ పైలట్ ప్రాజెక్ట్స్‌ను తీసుకొని ప్రతి టీవీ చానల్‌కు వెళ్లి డెమోస్ ఇచ్చేవారు. ఏ చానలూ స్పందించలేదు. యేడాది తర్వాత ‘మా టీవీ’ వాళ్లు ‘మా జూనియర్స్’ చానెల్‌ను ప్రారంభిస్తూ ఆమెను పిలిచారు యానిమేషన్ సిరీస్ కావాలని. అప్పడు దొరికింది యానిమేషన్ ఫిలమ్సలో ఆమెకు బ్రేక్. పిల్లలున్న ప్రతి ఇంటికీ గోలి శ్యామల సుపరిచితులయ్యారు. ఏకైక మహిళా యానిమేషన్ సిరీస్ ప్రొడ్యూసర్‌గా దాదాపు పదేళ్లు కొనసాగారు. సొంత ప్రొడక్షన్‌లో కొన్ని ప్రయోగాలూ చేశారు. అందులో భాగంగానే లిటిల్ డ్రాగన్ అనే యానిమేషన్ మూవీ తీసి ఆర్థికంగా నష్టపోయారు. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అది శారీరక ఆరోగ్యం మీదా ప్రభావం చూపించడంతో యానిమేషన్‌ను పాజ్ చేశారు.
స్విమ్మింగ్‌తో..
చిన్నప్పటి నుంచి నీళ్లంటే భయపడే శ్యామల తన ఆరోగ్యాన్ని నీటిలోనే వెదుక్కున్నారు. మూడేళ్ల కిందట ఈత నేర్చుకొని. కెరీర్‌గా మలచుకుని. 44వ యేట రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగిన పోటీలు, ఈవెంట్లలో పాల్గొని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్‌ను దాటేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. ‘‘సాధించాలనే పట్టుదలకు వయసు ఏ మాత్రం అడ్డుకాదని నన్ను ప్రోత్సహిస్తున్న కోచ్ ఆయుష్ యాదవ్‌కు కృతజ్ఞతలు. నా ప్రతి ఎఫర్ట్ నాకో కొత్త విషయాన్ని నేర్పింది. మరింత తర్ఫీదునిచ్చింది. వీటన్నింటికీ వెన్నంటే ఉన్న మా వారు, మా అబ్బాయి, మా నాన్నే నా స్ట్రెన్త్. విమెన్ సేఫ్టీకి సంబంధించి ఒక యానిమేషన్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన ఉంది’’ అని చెప్తారు శ్యామల గోలి.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment