బిరబిరా కృష్ణవేణమ్మ | special story to Mumbai Municipal Corporator kandiga Krishnaveni Reddy | Sakshi
Sakshi News home page

బిరబిరా కృష్ణవేణమ్మ

Published Thu, Apr 20 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

బిరబిరా కృష్ణవేణమ్మ

బిరబిరా కృష్ణవేణమ్మ

సాధికారత

కృష్ణమ్మ మహారాష్ట్రలో పుట్టి ఏపీకి వచ్చింది.
కృష్ణవేణి... ఏపీలో పుట్టి మహారాష్ట్రకు వెళ్లింది.
ఏమిటి పోలిక... కృష్ణమ్మకు, కృష్ణవేణికి!
చిన్న పాయగా మొదలైంది కృష్ణానది.
మూమూలు గృహిణిగా మొదలైంది కృష్ణవేణి.
పరవళ్లతో ప్రవహిస్తోంది కృష్ణమ్మ.
ఉరకలపై ప్రజాసేవ చేస్తోంది కృష్ణవేణమ్మ.
బిరబిరా కృష్ణమ్మ అంటాం కదా...
అలాగే... బిరబిరా కృష్ణవేణమ్మ అనాలి!!


తెలుగువారికి అందని ద్రాక్షగా మిగిలిన బృహన్‌ ముంబై మహానగర్‌ పాలిక (మున్సిపల్‌ కార్పొరేషన్‌) లో ఈ ఏడాది ప్రాతినిధ్యం లభించింది! గత ఎన్నికల్లో వరంగల్‌ జిల్లాకి చెందిన అనూష వల్పదాసి శివసేన టిక్కెట్‌పై విజయం సాధించి అతిపిన్న వయసు కార్పొరేటర్‌గా రికార్డు సృష్టించినప్పటికీ, అనంతరం సాంకేతిక కారణాల వల్ల ఆమె పదవి రద్దు అయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కండిగ కృష్ణవేణి రెడ్డి (48) కార్పొరేటర్‌గా విజయం సాధించడంతో.. ఐదు దశాబ్దాల తెలుగు ప్రజల నిరీక్షణ ఫలించినట్లయ్యింది. ముంబైలోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయంలో ఇటీవలి వరకు ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన కండిగ కృష్ణవేణి ఇప్పుడు ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌ అయ్యారు.  

కడప నుంచి ముంబైకి
కృష్ణవేణి స్వస్థలం కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట గ్రామం. నాన్న పూత్తూరు శివరామిరెడ్డి, అమ్మ వెంకటలక్ష్మి. కృష్ణవేణి విద్యాభ్యాసం అనంతరాజుపేటతో పాటు రైల్వేకోడూరులో జరిగింది. వివాహం చిత్తూరు జిల్లాకు చెందిన కండిగ వినోద్‌ రెడ్డితో జరిగింది. వినోద్‌ ఉద్యోగ రీత్యా ఈ దంపతులు ముంబైలో స్థిరపడ్డారు. సుమారు ఇరవై ఏళ్లకుపైగా ఆమె ఒక సాధారణ గృహిణిగా కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు.   కృష్ణవేణికి సమాజానికి ఏదైనా చేయాలన్న తపన ఉండడంతో తమ ప్రాంతంలో తన వంతుగా సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు.

ఇంటి నుంచి ఉద్యోగానికి
తండ్రి దివంగత శివరామిరెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కృష్ణవేణికి అంతగా రాజకీయ అనుభవంలేదు. అయితే 2014లో ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరడంతో ఆమె ఆలోచనా పరిధి విస్తృతం అయింది. ‘‘సాక్షిలో నేను విధులు నిర్వహించింది 15 నెలలే అయినప్పటికీ, అనేక విషయాలను తెలుసుకోగలిగాను. ముఖ్యంగా సాక్షి ఉద్యోగిగా మా ఏరియాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు గౌరవం లభించే ది. దీంతో మరిన్ని సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు కలిగింది. ఆ క్రమంలోనే స్థానిక నాయకుల ప్రోత్సహంతో బీజేపీలో చేరాను’’ అని చెప్పారు కృష్ణవేణి. 2015లో కృష్ణవేణి దక్షిణ మధ్య ముంబై బీజేపీ మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే మొదట ఆమె పూర్తిస్థాయిలో పార్టీకి సేవలు అందించలేకపోయారు. ఆ ఏడాదే ఆమె తల్లి మరణించారు. అనంతరం అదే ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ‘పసుపు కుంకుమ’ తదితర కార్యక్రమాల ద్వారా తమ ప్రాంతంలోని మహిళలతో కృష్ణవేణి మమేకమై ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ఆ అనుబంధాన్ని బరింత దృఢంగా కొనసాగించారు.

ఉద్యోగం నుంచి పాలిటిక్స్‌కి
గత ఏడాది ఫిబ్రవరిలో సైన్‌ కోలీవాడాలోని ఇంద్రనగర్‌ గార్డెన్‌లో కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ఆమెకు ఒక గుర్తింపు సంపాదించి పెట్టింది. పార్టీలో ఆమె ప్రాధాన్యాన్ని మరింత పెంచేలా చేసింది. బీజేపీ దక్షిణ మధ్య ముంబై అధ్యక్షులు అనీల్‌ ఠాకూర్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కెప్టెన్‌ తమిళ సెల్వన్‌లు బీజేపీ దక్షిణ ముంబై మహిళ విభాగానికి అధ్యక్షురాలిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆమె క్రియాశీలత, నిర్వహణ సామర్థ్యాలు దక్షిణ మధ్య ముంబై జిల్లాలోని బీజేపీ నాయకులతోపాటు దాదాపు ఇతర ప్రముఖులందరి దృష్టికీ వెళ్లాయి.

సొంత టీమ్‌తో ఇంటింటికీ
2016 డిసెంబరులో కృష్ణవేణి తన కంటూ ఒక టీమ్‌ను నియమించుకున్నారు. ఈ టీమ్‌తో కలిసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ప్రచారకర్త అయ్యారు.‘ఘర్‌ ఘర్‌ కి అభియాన్‌’ ద్వారా... ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలపై స్థానికుల్ని చైతన్యవంతుల్ని చేశారు. ఫలితమే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టిక్కెట్‌. ‘‘కార్పొరేటర్‌గా బరిలోకి దిగిన అనంతరం మహిళలే నాకు బలంగా నిలిచారు. వారిలో తెలుగువారు కూడా ఉన్నారు’’ అని కృష్ణవేణి తెలిపారు. ప్రచారానికి తక్కువగా సమయమే లభించినప్పటికీ బహిరంగ సభలు కాకుండా ఇంటింటి ప్రచారానికి ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. తన వార్డులో కేవలం ఒకే ఒక్క బహిరంగ సభ జరిగింది. ఆమె వెంట ప్రచారంలో సుమారు 75 నుంచి 80 శాతం మహిళలుంటే 20 నుంచి 25 శాతం మాత్రమే పురుషులుండేవారు. ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉండడంతో చాలాసార్లు  కేవలం పాలు తాగి పడుకోవాల్సి వచ్చేదని కృష్ణవేణి తెలిపారు.  

ఒత్తిళ్ల నుంచి విజయానికి
రాజకీయాల్లోకి రావడానికి ముందు, తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు ఇచ్చిన, ఇస్తున్న సహకారం మరువలేనిదని కృష్ణవేణి అన్నారు. ‘‘నా భర్తతో పాటు నా ఇద్దరు పిల్లలు కుషాల్, వినీత్‌ల సహకారం అన్ని విధాలా నా ఒత్తిడిని తగ్గించింది. ముఖ్యంగా మా చిన్నబ్బాయి వినీత్‌తోపాటు వినీత్‌ కాలేజీ ఫ్రెండ్స్‌ నా ప్రచారానికి, పనులకు కష్టపడి సహకరించారు’’ అని కృష్ణవేణి చెప్పారు. కుషాల్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ చేసి ఎంబిఎ చేస్తూ ఉద్యోగం చేస్తుంటే, వినీత్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసి తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాడు. కృష్ణవేణి భర్త ముంబైలోని ‘కేర్‌ ఇట్‌’ ఫార్మా యునిట్‌ను నడుపుతున్నారు. పెద్దబ్బాయికి తన తల్లి రాజకీయాల్లోకి తిరగడం ఇష్టం లేకపోవడంతో ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి  ఆసక్తి కనబరచలేదు. నిరంతరం ఆమె పార్టీ పనుల్లో తీరిక లేకుండా ఉండడాన్ని చూసి ‘ఎందుకమ్మా ఇదంతా’ అని బాధపడేవాడు.

పదవి నుంచి ప్రజాసేవకు
కృష్ణవేణి పోటీ చేసిన వార్డు 1740 (యాంటాప్‌ హిల్స్‌ – విజయ్‌నగర్‌)లో అత్యధికంగా మురికివాడలే ఉన్నాయి. తాగునీరు, మురుగునీటి వ్యవస్థతోపాటు ఆ వార్డులో అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కృష్ణవేణి తెలిపారు. ‘‘రాజకీయాల్లో నాకంటూ ఓ ప్రత్యేక ముద్ర కోసం ప్రయత్నిస్తా. అందరిని కలుపుకుని పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతా. ముఖ్యంగా బీజేపీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే కెప్టెన్‌ తమిళ సెల్వన్‌తోపాటు నా వార్డులోని బీజేపీ నాయకుల మార్గదర్శకత్వంలో కార్యకర్తలను కలుపుకుని పని చేస్తా’’ అని చెప్పారు.

‘‘మహిళలతోపాటు యువత రాజకీయాల్లో కొస్తే కొత్త ఆలోచనలతోపాటు, సాంకేతిక పరిఙ్ఙానాన్ని ఉపయోగించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు నాకు అవకాశం కల్పించారు. పార్టీతోపాటు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తా’’ అని కృష్ణవేణి అన్నారు.  ‘రాజకీయ అనుభవం లేని మీరు రాజకీయ బురదలోకి ఎందుకుకొస్తున్నారు.. వచ్చినా.. ఎలా నెగ్గుకొస్తారు?’ అని కృష్ణవేణిని చాలామందే ప్రశ్నించారు. వారందరికీ చిరునవ్వుతో ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే. ‘‘రాజకీయం బురద కాదు. బురదను శుభ్రం చేసే అవకాశం?’’అని!



శ్రమను గుర్తించాడు కుషాల్‌!
‘నేను గెలిచినట్టు ప్రకటన రాగానే వాడిని ‘నాకు కంగ్రాట్స్‌ చెప్పవా?’ అని అడిగితే మా పెద్దబ్బాయి ఏమన్నాడో తెలుసా... సింపుల్‌గా ‘నీ కష్టానికి ఫలితం దక్కింది’ అన్నాడు. ఆ మాట నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అభినందనలు చెప్పినా అంత ఆనందం కలిగేది కాదేమో! నా శ్రమను గుర్తించాడు మా పెద్దబ్బాయి’ అని కృష్ణవేణి చెప్పారు. అన్నట్టు... ప్రత్యర్థులు కూడా ఆమెను ‘లోకం తెలియని’ ఇల్లాలిగానే ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని తన గెలుపుతో తిప్పికొట్టారు కృష్ణవేణి.

‘రాజకీయాలొద్దు... బురద’ అన్నారు పెద్దవాళ్లు.
‘ఎందుకమ్మా ఇదంతా’ అన్నాడు పెద్ద కొడుకు.
‘లోకం తెలియని ఇల్లాలివి’ అన్నారు ప్రత్యర్థులు.
అయినా ఆమె నిలిచారు. నిలిచి గెలిచారు.
– గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement