నేనొక బిజినెస్ పర్సన్‌ని. తీరిక లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను వాడుతూనే ఉంటాను. నా బిజినెస్ వ్యవహారాలన్నీ దాంతోనే సాగుతుంటాయి. ఇటీవల నా బొటనవేలు చాలా నొప్పిగా అనిపిస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? తగ్గేందుకు మార్గం చెప్పండి. – ఆర్. శ్రీధర్‌రెడ్డి, విజయవాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో డీ–క్వెర్‌వెయిన్ సిండ్రోమ్ అంటారు. మనం మన స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై వాపు వస్తుంది. అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానక మళ్లీ మళ్లీ గాయం తిరగబెడుతుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. అవి...
∙టైపింగ్ లేదా టెక్ట్స్ మెటీరియల్ పంపడం కోసం ఒక బొటనవేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా మార్చి మార్చి ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించాలి.
∙ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకొని మరో చేతి బొటనవేలిని ఉపయోగించే బదులు, దాన్ని ఒక ఉపరితలం మీద పెట్టి ఇరుచేతుల వేళ్లను మార్చి ఉపయోగిస్తూ ఉండటం.
∙మణికట్టును చాలా రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడాలి.
∙మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవడం. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది.
∙ఫోన్‌ను శరీరానికి ఒకవైపున కాకుండా మధ్యన ఉంచడం మంచిది. దీని వల్ల శరీరం అసహజ భంగిమలో వంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది.
ఇక ఈ జాగ్రత్తలతో పాటు మరికొన్ని జాగ్రత్తలూ అవసరం. అవి...
∙ఫోన్ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం.
∙పొడవు పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్ వాడుతూ బొటనవేలి ఉపయోగాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది.
∙‘ఐ యామ్ ఇన్ మీటింగ్’ లాంటి కొన్ని రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి. వాటి సహాయం తీసుకుంటే టైపింగ్ బాధ తగ్గడంతో పాటు, సమయమూ ఆదా అవుతుంది.
∙ఎవరిపేరునైనా కనుగొనాలంటే పూర్తిగా స్క్రీన్ స్క్రోల్ చేస్తుండే బదులు షార్ట్‌కట్స్ ఉపయోగించడం ద్వారా సమయాన్నీ, బొటనవేలి ఉపయోగాన్నీ తగ్గించవచ్చు.
∙అదేపనిగా ఫోన్ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2–3 నిమిషాల పాటు మీ బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించండి.
మద్యంతోనూ వెన్నునొప్పి వస్తుందా?
నా వయసు 38 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. చాలాసేపు కూర్చొని ఉంటాను. వెన్నునొప్పి వస్తుండడంతో ఇటీవల డాక్టర్‌ను కలిశాను. చాలాసేపు కూర్చొని ఉండటంతోపాటు, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్ల వల్ల కూడా వెన్నునొప్పి తీవ్రమవుతోందని డాక్టర్ చెప్పారు. ఆయన చెప్పేది వాస్తవమేనా?– ఎమ్. కల్యాణ్, బెంగళూరు
మీ డాక్టర్ చెప్పిన విషయాలు వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించినా, జీవనశైలి నిపుణులమైన మాకు మాత్రం ఆశ్చర్యకరం కాదు. ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవమే. వెన్నునొప్పికి మూడు ప్రధానమైన అంశాలు దోహదపడతాయి. అవి... ఊబకాయం, విపరీతమైన పొగతాగడం, అత్యధిక స్థాయిలో మద్యం తీసుకోవడం. పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత (బోన్ డెన్సిటీ) గణనీయంగా తగ్గుతుంది. నిజానికి ఎముకల్లో ఎంత ఖనిజాల సాంద్రత (నార్మల్ మినరల్ డెన్సిటీ) ఉండాలో అంత ఉంటేనే... అవి పటిష్టంగా ఉండి, చిన్న చిన్న దెబ్బలకే విరగకుండా ఉండటం (రెసిస్టెన్స్ టు ఫ్రాక్చర్స్) కోసం తయారై ఉంటాయి. కానీ ఇలా పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గగానే అవి చిన్న చిన్న దెబ్బలకే విరగడం మొదలవుతాయి. ప్రధానంగా ఈ లక్షణం మన శరీరం బరువును తీసుకునే ఎముకలు, వెన్నెముకలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రోజూ మూడు పెగ్గుల కంటే ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో ఎముకల సాంద్రత తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంటుంది. పైగా పొగతాగడం, మద్యం తీసుకోవడం అనే చర్యలు మనం ఆహారం ద్వారా తీసుకునే క్యాల్షియం జీర్ణక్రియ ద్వారా మన ఎముకలకు అందకుండా చేస్తాయి. కొత్త ఎముక పెరిగే ప్రక్రియనూ ఆలస్యం చేస్తాయి. ఎముకకు రక్తసరఫరానూ తగ్గిస్తాయి. దాంతో ఎముకలు బలహీనపడతాయి. ఫలితంగా మీ వెన్నెముకలోనూ సాంద్రత తగ్గినందువల్లనూ, మీ బరువు దానిపై పడుతుండటం వల్లనూ వెన్నునొప్పి వస్తుంటుంది. అయితే మీరు మీ పొగతాగే అలవాటు, మద్యపానం అలవాట్లను మానేసి, మీ జీవనశైలిని మెరుగుపరచుకొని రోజూ క్రమం తప్పకుండా పోషకాహారాన్ని తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల స్థూలకాయం తగ్గడంతోపాటు, వెన్నునొప్పీ తగ్గుతుంది.
మునుపటి ఫిట్‌నెస్ పొందడం ఎలా?
నా వయసు 56 ఏళ్లు. మొదట్నుంచీ హెల్దీపర్సన్‌ను. ఎక్సర్‌సైజ్ కూడా బాగానే చేసేవాడిని. కానీ ఈమధ్య నాలో ఫిట్‌నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. గతంలో ఒకే అంగలో రెండ్రెండు మెట్లు ఎక్కేవాడిని. ఇటీవల అలా ఎక్కలేకపోతున్నాను. కొంచెం నడిస్తే అలసిపోతున్నాను. మునుపటి ఫిట్‌నెస్ పొందడానికి ఏం చేయాలి?– డి. హరిహరరావు, హైదరాబాద్
మీ వయసు వారంతా కీలకమైన ఇలాంటి సమయంలో మునుపటి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ప్రధానం. సాధారణంగా మీ వయసు వారిలో చాలామందికి డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధులు ఉండటం మామూలే. అలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఫిట్‌నెస్‌ను నిలుపుకోడానికి ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్నిరకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దానివల్ల వయసుపైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినా... ఎముకలు విరిగే అవకాశం తగ్గుతుంది. వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు... అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి సలహా పొందడం అవసరం.వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్‌సైజ్‌కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి తప్ప నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వ్యాయామం ఆపేసి వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స లేదా సూచనలు పొందాలి.
డా. సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment