చలివంటలు!
వెచ్చటి జ్ఞాపకం
చలికాలం వస్తోందంటే కొందరికి చలిమంటలు గుర్తొస్తే, ఇంకొందరికి రకరకాల చలివంటలు నోట్లో నీళ్లూరిస్తాయి. మా తాతయ్యది రెండో కోవ. ఆయనకు చలికాలం రాగానే వేడివేడి పకోడీలు, గుంటపునుగులు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ ఆవపెట్టిన కూర, పనసపొట్టు కూర, పులుసూబెల్లం పెట్టి వండిన కాకరకాయ కూర గుర్తొచ్చి మొన్ననే నీళ్లోసుకున్న గర్భిణిలా మారిపోయేవాడు.
మామూలు రోజుల్లో వెల్లుల్లి పాయను గుమ్మం తొక్కనివ్వని వాడు... చలికాలం రాగానే వెల్లుల్లి కారప్పొడితో మొదలెట్టి, తోటకూర పాటోళీలోనూ, గోంగూర పులుసుకూరలోనూ వెల్లుల్లి గర్భాలు విరివిగా వేయించేవాడు. వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారప్పొడి వేసుకుని, దానిమీద ఆరారగా నెయ్యి వే(పో)సుకుని రెండు ముద్దలు తిని,స్వర్గం బెత్తెడు దూరంలోకొచ్చేసిందనేవాడు. గోంగూర పులుసుకూరలో వేసిన వెల్లుల్లిగర్భాలనువదలకుండా తినమనేవాడు. అదేమంటే చలికాలం వెల్లుల్లి ఒంటికి మంచిదంటూ క్లాసు పీకేవాడు. ఈ మూడునెలలూ పదిహేన్రోజుల కోసారైనా నువ్వు చిమ్మిరి చెయ్యాల్సిందే... నెలకో పనసకాయ తెగాల్సిందే! అరటికాయ కూరలో ఆవపెట్టాల్సిందే!
ఈ సీజన్‌లో ఇంటికి చుట్టాలొస్తే పండగే. ఉల్లిపాయ పకోడీలో, మిర్చిబజ్జీలో, అరటికాయ పుగ్గీలో, పెసర పుణుకులో చేయించి వేడివేడిగా వడ్డింపించేవాడు. పాపం! మహాతల్లి... మా మామ్మ ఆయన అడిగిన వంటకాలన్నింటినీ విసుక్కోకుండా వండి వార్చేది. వంటకాలే కాదు, ఏ రుతువులో దొరికే పండ్లు, కూరగాయలను ఆ రుతువులో తప్పనిసరిగా తినేవాడు, తినిపించేవాడు.
ఒక్క చలికాలమనే కాదు... ఎండాకాలంలోనూ, వర్షాకాలంలోనూ కూడా అంతే! సీజన్‌కి తగ్గ ట్టు తినడం, తినిపించడం.. నాకు తెలిసి ఇలా ఒక్క మా ఇంట్లోనే కాదు, ఆ కాలంలో ఇంచుమించు అందరి ఇళ్లలోనూ ఉండేదనుకుంటా. అందుకే అప్పటి వాళ్లు అన్నేసి ఏళ్లు వచ్చినా, ఆరోగ్యంగా ఉండేవారు. ఆ రోజుల్లో వాళ్లు సైన్సు పాఠాలు కానీ, న్యూట్రిషన్ కోర్సుగానీ చదివి ఉండకపోవచ్చు కానీ, ఏ కాలంలో ఏమి తింటే ఆరోగ్యమో, ఏది తినకపోతే అనారోగ్యమో బాగా తెలిసిన వాళ్లు.
బహుశా మా తాతయ్య వంటపాఠాల వల్ల... ఆయనతో చేసిన జీవన ప్రయాణం వల్లే కాబోలు, మా మామ్మ ఎనభయ్యో ఏట కూడా జాంకాయలను తరుక్కుని తిన్లేదు... హాయిగా కటుక్కున కొరుక్కుని తినేది. మేము వాళ్ల దగ్గర పెరిగినంతకాలమూ లేతవంకాయల్లా నవనవలాడే వాళ్లం. ఇప్పుడేమో మేమే కాదు... మా పిల్లలు కూడా తోటకూర కాడల్లా వడలిన ముఖాలతో, సడలిన శరీరాలతో ఉన్నాం.
- బాచి