గృహ రుణం.. బోలెడు చార్జీలు
బ్యాంకుల్లో గృహ రుణాలు తీసుకునేటప్పుడు సాధారణంగా వడ్డీ రేట్లు మాత్రమే పోల్చి చూసుకుంటూ ఉంటాం. కానీ, హోమ్ లోన్ విషయంలో వడ్డీ రేటే కాకుండా చూసుకోవాల్సిన ఇతర చార్జీలు కూడా చాలా ఉంటాయి. వీటి గురించి తెలుసుకుంటే బెస్ట్ డీల్ దక్కించుకోవడం సాధ్యపడుతుంది. లోన్ మంజూరు చేయడానికి ముందు బ్యాంకులు రుణ దరఖాస్తును ప్రాసెసింగ్ చేస్తాయి (పత్రాల వెరిఫికేషన్ మొదలైనవి). ఇందుకు ప్రాసెసింగ్ చార్జీల కింద కొంత మొత్తాన్ని తీసుకుంటాయి.
బ్యాంకును బట్టి తీసుకునే రుణ మొత్తంలో 0.25% - 1% దాకా ఇది ఉండొచ్చు. ఎస్‌బీఐ వంటి బ్యాంకులు పాతిక లక్షల దాకా రుణాలపై 0.25 శాతం మేర, అంతకు మించి డెబ్భయ్ అయిదు లక్షల దాకా రూ. 6,500 మేర, ఆ పైన రూ. 10,000 మేర ఫిక్సిడ్ ఫీజు తీసుకుంటున్నాయి. అదే హెచ్‌డీఎఫ్‌సీ అయితే లోన్ అమౌంటులో 0.50% దాకా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఈ ఫీజుల నుంచి మినహాయింపులు ఇస్తుంటాయి. ఇది కాకుండా.. సదరు ప్రాపర్టీకి చట్టపరమైన చిక్కులేమైనా ఉన్నాయేమో సైతం బ్యాంకులు వెరిఫికేషన్ చేసుకుంటాయి.
ఇందుకు లాయర్ల సలహా తీసుకుంటాయి. దీనికయ్యే ఫీజులను కస్టమర్ దగ్గర్నుంచే వసూలు చేస్తాయి. ఒకవేళ ప్రాపర్టీని ముందుగానే సదరు బ్యాంకే ఆమోదించిన పక్షంలో ఇలాంటి ఫీజుల బాదరబందీ ఉండదు. ఇక, మార్ట్‌గేజ్ డీడ్ చార్జ్ (ఎంవోడీ) అంటూ లోన్ మొత్తంలో దా దాపు అరశాతం దాకా బ్యాంకులు వసూలు చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా.. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ, డాక్యుమెంటేషన్ చార్జీలు మొదలైనవీ ఉంటాయి.