సుజనా చౌదరి - సిఎం రమేష్
ఏపి రాజధాని విషయంలో ప్రతిపక్షం నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా, స్వపక్షంలో విభేదాలు తలెత్తడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా తయారైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ నెల 4వ తేదీ గురువారం శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపి కూడా స్వాగతించింది. అయితే ముందుగా చర్చ జరగకుండా ప్రకటించిన విధానం సరిగాలేదని విమర్శించింది.
ఎటువంటి వివాదాలకు తావులేకుండా రాజధాని ప్రకటన జరిగిపోయిందని అనుకుంటున్న తరుణంలో అధికారపక్షానికి చెందిన మంత్రులలోనే విభేదాలు వచ్చాయి. సీఎం విజయవాడ పరిసర ప్రాంతాలలో అని చెప్పి వదిలివేశారు. ఎక్కడ? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు. విజయవాడకు 41 కిలో మీటర్ల దూరంలో నూజివీడు, 40 కిలో మీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలోని అమరావతి, 15 కిలో మీటర్ల దూరంలో మంగళగిరి ఉన్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు వైపు రాజధాని విస్తరించాలని కొందరు మంత్రులు పట్టుబడుతున్నారు. మరికొందరు గుంటూరు జిల్లా మంగళగిరి వైపు విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మంగళగిరివైపు కావాలని కోరుతుండగా, సిఎం రమేష్ నూజివీడు వైపు ఉండాలని కోరుతున్నారు. ఈ విషయంలో మంత్రులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. రాజధానిపై మంత్రులు అందరూ ఒకే మాట మాట్లాడమని చెప్పినప్పటికీ, ఇప్పుడు మంత్రులు ఈ విధంగా చీలిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చికాకు కలుగుతోంది. దానికి తోడు తనకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, సిఎం రమేష్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఆయన తల పట్టుకొని కూర్చున్నారు.
**