పవన్కు ప్రతిరోజూ ఫోన్ చేసేదాన్ని: రేణు దేశాయ్
సినిమా నిర్మాణంలో తనకు ఏ సందేహం వచ్చినా ప్రతిరోజూ రాత్రి పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి మాట్లాడేదానినని రేణుదేశాయ్ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్ అంతకు మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ పుట్టిన రోజు ఈరోజు. రేణు దేశాయ్ నిర్మాతగా మారి ‘మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ చిత్రం నిర్మాణదశలో ఉండగా పవన్కు ఫోన్ చేసి ఆయన సలహాలు తీసుకునేదానినని చెప్పారు. ఏ విషయం గురించి అడిగినా పవన్ చాలా వివరంగా చెప్పేవారన్నారు.
రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 పుట్టారు. ఆమె మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో సెన్సేషన్. పవన్తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్తోనే ‘జానీ' సినిమాలో నటించారు. 2004లో వీరిద్దరికి పెళ్లి కాకముందే అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది. దాంతో నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగా రేణు దేశాయ్ ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు.
నటించడం మానివేసిన తరువాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఇప్పుడు నిర్మాతగా కూడా విజయం సాధించారు. రేణు దేశాయ్కు జన్మదిన శుభాకాంక్షలు.