నేడు సింగిల్స్ అవేర్‌నెస్ డే
మనకు నచ్చిన వారికి మనం నచ్చలేదు. మనల్ని మెచ్చిన వారు మనకి నచ్చలేదు. ఫైనల్‌గా మిగిలింది ఒంటరి ప్రయాణం. సోషల్ యానిమల్‌గా పుట్టిన మనిషి సింగిల్‌గా సెటిలవ్వాలంటే సింపుల్ థింగ్ కాదు. కానీ, జంటగా ఉన్న వారిని మించిన ఆనందాలను అందుకుంటున్న ‘ఏక్ నిరంజన్’లు సిటీలో ఉన్నారు. అలాంటి వారినుద్దేశించిందే ఈ సింగిల్స్ అవేర్‌నెస్ డే!
..:: ఎస్.సత్యబాబు
కొన్ని సర్వేల ఫలితాల ప్రకారం.. వాలెంటైన్స్ డే రోజున 60 శాతం మంది ఒంటరితనంలో కుంగిపోతున్నారట. ఇందులో 7 శాతం మంది తీవ్రమైన ఫస్ట్రేషన్‌కు గురవుతున్నారట. ఇలాంటి పరిస్థితుల నుంచీ, రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో లేని వ్యక్తుల ఆవేదనలో నుంచి పుట్టిందీ ‘డే’. వాలెంటైన్స్‌డే తర్వాతి రోజును పలు దేశాల్లో సింగిల్స్ అవేర్‌నెస్ డే ఆర్ అప్రిషియేషన్ డే (ఎస్‌ఏడీ), క్విర్కీ ఎలోన్ డే అనీ వ్యవహరిస్తారు. ఒంటరిగా ఉండడం శాపం కాదని, బంధాల్లేకపోయినా ఆనందంగా ఉండగలమని చెప్పడానికి ఈ రోజును ప్రత్యేకించారు. ఫిబ్రవరి 15న అమెరికా మహిళల్లో 15 శాతం మంది తమకు తామే ఫ్లవర్స్ పంపించుకుంటారట. చైనాలో మాత్రం నవంబరు 11న సింగిల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున నాలుగు ఒకట్లు వస్తాయి కాబట్టి అది సింగిల్ లైఫ్‌కు మద్దతిచ్చే సంఖ్య అని భావిస్తారు.
ఏం చేస్తారు?
ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున సింగిల్ ఈవెంట్స్, ట్రావెలింగ్ చేస్తారు. వాలెంటైన్స్ డే కలర్ అయిన రెడ్‌కు పూర్తి వ్యతిరేకంగా భావించే గ్రీన్ కలర్‌ను ధరిస్తారు. అసలు రిలేషన్స్ అంటే ఇష్టమే లేని వాళ్లు బ్లాక్ ధరిస్తారు. అలాగే సింగిల్ అవేర్‌నెస్ డే శుభాకాంక్షలు తెలిపే కార్డులు, బహుమతులు, దీని కోసం ప్రత్యేకించిన పాటలు సైతం అందుబాటులో ఉన్నాయి.
ఒంటరితనం కాదు దయనీయం...
ఒంటరిగా ఉండడం కూడా వేడుక చేసుకోదగిన విషయమేనని ఎస్‌ఏడీ రూపకర్తలు అంటున్నారు. ఇప్పటికే రిలేషన్‌లో ఉన్న చాలామంది ఒంటరి జీవితమే మేలనుకుంటున్నారనే విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ‘ఎస్ అయామ్ సింగిల్. అండ్ అయామ్ ఓకే’ అని సగర్వంగా చెప్పాలంటున్నారు. కారణాలేమైనా.. నగర జీవనంలో ఒంటరితనాన్ని ఎంచుకునే వారు పెరిగిపోతున్నారు. ‘ఏ వయసులోనైనా మనిషికి తోడు అవసరం. అది పెళ్లి, స్నేహం, లివిన్ రిలేషన్‌షిప్... ఇలా ఏ రూపంలోనైనా దొరకవచ్చు. అయితే అది దొరకనంత మాత్రాన దురదృష్టవంతులం అనుకోకూడదు. సింగిల్‌గా ఉన్నవారికి ఆ లోన్లీ ఫీలింగ్ తొలగించేందుకు కృషి చేస్తున్నాం’ అంటున్నారు తోడునీడ ఆర్గనైజేషన్‌కి చెందిన రాజేశ్వరి.
ఒక్కరై రావడం... ఒక్కరై పోవడం...
పుట్టుకలోనూ, పోవడంలోనూ మనం ఒంటరులమే. లైఫ్‌లో మనల్ని మనం ప్రేమించలేకపోతే ఎవర్నీ ప్రేమించలేం. మనల్ని మనం నెంబర్‌వన్‌గా ట్రీట్ చేసుకోవాలి. అప్పుడే సింగిల్‌గా ఉండడం జాలి పడాల్సిన విషయం కాదని తెలుస్తుంది. సరైన సోల్‌మేట్ దొరికితే సరే... లేకుంటే సింగిల్‌గా ఉండడంలోనూ ఆనందం ఉంది.
- సురేష్, సినీనటుడు
సంతోషిస్తున్నా...
ఒంటరిగా ఉండడం బాధపడాల్సిన విషయమేమీ కాదు. మనకు నచ్చినట్టు, మనం కోరుకున్నట్టు జీవించడానికి అదో మంచి చాన్స్. మీ సమయం, మీ నిర్ణయాలు, మీ ఆర్థికస్వేచ్ఛ.. అన్నీ మీవే. పిటీ అనే మాటే లేదు. ఆల్ హ్యాపీస్. సింగిల్‌గా ఉండడంలోని హాయిని నేను ఎంజాయ్ చేస్తున్నా.
- ఆర్.జె.భార్గవి, రేడియో మిర్చి
సింగిల్.. జోష్ ఫుల్
Published Sun, Feb 15 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement