ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థికి బోధిస్తున్న ఉపాధ్యాయుడు
సాక్షి, పూణే : ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులంటేనే చిన్నచూపు చూస్తున్న క్రమంలో 29 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేవలం ఒకే ఒక విద్యార్థి కోసం రోజూ 50 కిమీ ప్రయాణించి గమ్యం చేరకుంటున్నారు. 12 కిమీ మట్టిరోడ్డును దాటి మరీ కొండ ప్రాంతంలో ఉన్న పాఠశాలకు నిత్యం వెళ్లివస్తుంటారు. పూణేకు 100 కిమీ దూరంలోని చందర్ అనే కుగ్రామంలోని ఈ పాఠశాలలో కేవలం ఒకే ఒక విద్యార్థి ఉన్నాడు. కేవలం 15 గుడిసెలు మాత్రమే ఉండే ఈ గ్రామంలో జనం కంటే పాముల సంఖ్యే ఎక్కువ.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గత రెండేళ్లుగా యువరాజ్ సంగాలే అనే ఎనిమిదేళ్ల బాలుడు ఒక్కడే విద్యార్థి. ఇక నిత్యం స్కూల్‌కు చేరుకోగానే ఉపాధ్యాయుడు రజనీకాంత్ మెంధే మొదటగా చేసే పని తన విద్యార్థిని వెతికిపట్టుకోవడమే. స్కూల్‌కు వచ్చేందుకు విముఖత చూపే బాలుడు చెట్ల మాటున నక్కి ఉండటమో, గుడిసెలో ఉండిపోవడమో చేస్తుంటాడని మెంధే చెప్పుకొచ్చారు. సహవిద్యార్ధులెవరూ లేకపోవడం వల్లే అతను స్కూల్‌కు రావడానికి అయిష్టత చూపుతున్నాడంటారు. మారుమూల గ్రామమైన చందర్‌కు నేషనల్ హైవే నుంచి మట్టిరోడ్డు మీదుగా రావాలంటే గంటకు పైగా సమయం పడుతుంది.
ఎంపీ సుప్రియా సూలే నియోజకవర్గంలో ఈ గ్రామం ఉన్నప్పటికీ ఆమె ఇటువైపు రానేలేదని గ్రామస్తులు చెబుతుంటారు. ఎనిమిదేళ్ల నుంచీ తాను ఈ స్కూల్‌కు వస్తున్నానని, అప్పట్లో 11 మంది పిల్లలుండేవారని, అయితే ఉన్నత విద్య సదుపాయాలు 12 కిమీ దూరంలోని మనగావ్‌లో ఉండటంతో పలువురు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని టీచర్ మెంధే చెప్పారు. బాలికలను గుజరాత్‌లోని ఫ్యాక్టరీలు, పొలాల్లో దినసరి కూలీలుగా పనులకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను స్కూలుకు పంపాలని తల్లితండ్రులను తాను వేడుకుంటున్నా వారు వినడం లేదన్నారు. రహదారి సౌకర్యాలు లేకపోవడంతో పాటు నిన్నమొన్నటివరకూ స్కూల్‌కు నాలుగు గోడలు మినహా పైకప్పూ లేదని, ఎన్నో ఏళ్ల తర్వాత యాస్‌బెస్టాస్ షీట్‌తో ఎండ, వానల నుంచి రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. గతంలో పై కప్పు లేకపోవడంతో పైనుంచి పాము తనపై పడిందని, మరోసారి వర్షంలో మట్టిరోడ్డుపైన బైక్‌పై నుంచి కింద పాముపై పడిపోయానని టీచర్ గుర్తుచేసుకున్నారు. ఇంకా ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురవుతాయోనని రజనీకాంత్ మెంధే ఆందోళన చెందుతున్నారు.
స్కూల్‌లో ఉన్న ఆ ఒక్క విద్యార్ధి చేజారకుండా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోయినా అధికారులు సమకూర్చిన సోలార్ ప్యానెళ్లతో కొన్ని వైర్లు, చిన్న టీవీ సెట్‌ను ఉపయోగించి ఆయన ఈ-లెర్నింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. యువరాజ్‌కు స్కూల్ పట్ల ఆసక్తి కలిగించేందుకు తాను ఈ ఏర్పాట్లు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇన్ని ప్రతికూలతలున్నా బదిలీకి దరఖాస్తు చేసుకోకుండా కుగ్రామంలో అక్షరజ్యోతి వెలిగించాలన్న రజనీకాంత్ తపనను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment