నర్తనమే‘ప్రీతి’కరం | they were intrest on classical dance | Sakshi
Sakshi News home page

నర్తనమే‘ప్రీతి’కరం

Published Mon, Sep 8 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

నర్తనమే‘ప్రీతి’కరం

నర్తనమే‘ప్రీతి’కరం

ప్రొఫెషన్‌కార్పొరేట్ జాబ్ అనుకున్నంత తేలికేం కాదు. పెద్దజీతం వెనుకే ప్రాజెక్టులు, టార్గెట్ల మానసిక ఒత్తిడి తప్పదు. శాస్త్రీయ నృత్యమంటే నల్లేరుపై నడక కాదు. దానికి కళాపిపాస మాత్రమే కాదు, కఠోర సాధన కావాలి. ఈ రెండు రంగాల్లోనూ ఏకకాలంలో రాణించాలంటే మనో నిబ్బరం, శారీరక సామర్థ్యం ఉండాలి. అవి ఉన్న వారికి వేదికలు నీరా‘జనాలు’ పడతాయి. కార్పొరేట్ సంస్థలు కళాభినందనలు కురిపిస్తాయి.
 
నర్తనమే‘ప్రీతి’కరం
‘‘పని ఒత్తిడి ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువగా డ్యాన్స్‌క్లాస్‌లో గడుపుతా’’ నన్నారు బేగంపేట నివాసి, ఎస్ అండ్ పి క్యాపిటల్ ఐక్యూ కంపెనీలో బిజినెస్ కన్సల్టెంట్‌గా చేస్తున్న ప్రీతి. ‘‘ డ్యాన్స్ చేస్తుంటే వచ్చే తృప్తి మరెందులోనూ రాదు’’ అంటున్నారు. పదేళ్లుగా నృత్యసాధనలో ఉన్న ప్రీతి, మూడేళ్ల క్రితమే జాబ్‌లో జేరారు. ఉద్యోగంలో చేరాక నృత్యసాధన కష్టం కాలేదా? అన్న ప్రశ్నకు ‘‘జాబ్ మొదలుపెట్టాక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఇవ్వడం పెరిగింది. 

చెన్నై, బెంగళూరు, తిరుపతి, ఒరిస్సా, పూరి ఇలా ఎన్నో చోట్ల లాస్ట్ త్రీ ఇయర్స్‌లో ప్రదర్శనలిచ్చా’’ అంటూ వివరించారు. ‘‘కొండాపూర్‌లో ఆఫీస్,  దోమలగూడలో డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్.. నేనుండేది బేగంపేట. రోజూ 3గంటల దాకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. టైమ్ బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టం అనిపించడం లేదు’’ అంటూ చెప్పారామె. తనకు ఆఫీస్‌లో ప్రత్యేకమైన గౌరవం అందుతున్న వైనాన్ని చెబుతూ.. ‘‘నా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వర్కింగ్ అవర్స్‌ను దాని ప్రకారం సెట్ చేయడం అవీ మా బాస్‌లు చూస్తార’’న్నారు.
 
అభిరుచి బలమైనది. సంప్రదాయం అంతకంటే బలమైనది. సంప్రదాయ కళలపై అభిరుచి ఏర్పడితే, ఎంతటి వ్యయప్రయాసలకైనా వెనుకాడరు కళాకారులు. ఒకవైపు ఊపిరి సలపని విధినిర్వహణలో సతమతమవుతూనే, మరోవైపు తమకు అభిరుచి గల సంప్రదాయ కళలో రాణిస్తున్నారు నగరానికి చెందిన ముగ్గురు యువతులు. మనసుంటే మార్గాలకు లోటుండదని వీరు రుజువు చేస్తున్నారు. ప్రసిద్ధ నర్తకి శోభానాయుడు అకాడమీలో సాధన చేసే వీరు ‘సిటీప్లస్’తో తమ ముచ్చట్లు చెప్పారు.
 
డ్యాన్స్ ‘హోస్టెస్’
నాట్యం లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.. ఈ మాట ఒక ఎయిర్‌హోస్టెస్ నోటి నుంచి వినిపిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నిత్యం ఆకాశయానం చేసే లావణ్య మనసు గాల్లో విహరించేది మాత్రం కాళ్లకు గజ్జెలు కట్టినప్పుడే. గచ్చిబౌలి నివాసి అయిన ఆమె జీతం కోసం విమానాల్లో విధులు నిర్వర్తిస్తూ, జీవితాన్ని పరిపుష్టం చేసుకోవడం కోసం నాట్యంతో సహవాసం చేస్తున్నారు. ‘‘నృత్యసాధన 8వతరగతిలో స్టార్ట్ చేశాను. వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చాను. డ్యాన్స్ ఒక వ్యసనం లాంటిది.
 
టెన్షన్స్ అన్నీ పోతాయి. అకాడమీ ఒక టెంపుల్ లాంటిది.  డ్యాన్స్‌తో నాకు డిసిప్లిన్, పంక్చువాలిటీ, కాన్సన్‌ట్రేషన్.. అన్నీ వచ్చాయి. అందుకే మంచి జాబ్ వచ్చినా డ్యాన్స్ వదలదలచుకోలేదు. 2005 నుంచి ఎయిర్‌ఇండియాలో జాబ్ చేస్తున్నా.  రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఫ్లయిట్ టైమింగ్స్‌తో ప్రతి రోజూ ప్రాక్టీస్‌కి వెళ్లలేను. అయితే మా ఆఫీసు వాళ్లు కూడా చాలా హెల్ప్ చేస్తారు. అప్పుడప్పుడు టైమింగ్స్ ఎడ్జస్ట్ చేస్తారు. తాజాగా ఢిల్లీలో ఎయిర్‌ఇండియా వాళ్ల ప్రోగ్రామ్‌లో నా ప్రదర్శన ఏర్పాటు చేశారు. బయటి నుంచి రాగానే మమ్మీ అన్నీ రెడీ చేసి పెడుతుంది. డ్యూటీ దిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి వచ్చి, కాస్ట్యూమ్స్ తీసుకుని డ్యాన్స్ క్లాస్‌కి వెళతా. 3గంటలు సాధన చేస్తా’’ అంటూ వర్క్‌టైమింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్న వైనాన్ని చెప్పారు లావణ్య.
 
నృత్యమే ‘నిత్య’కృత్యం
నృత్యమే తన నిత్యకృత్యం అంటున్నారు టీసీఎస్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిత్య. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో నివసించే ఆమె.. ఆరేళ్ల వయసులో అమ్మ ప్రోత్సాహంతో నృత్యసాధన ప్రారంభించారు. ‘చదువు, వీణ, డ్యాన్స్.. ఇలా దాదాపు పదహారేళ్లు గడిచింది. చదువు దెబ్బతింటుందని చాలామంది టెన్త్‌క్లాస్‌లో పూర్తిగా పుస్తకాలకే అంకితమవుతారు. నేను అప్పుడు కూడా ఇవి మానలేదు. టెన్త్‌లో 92శాతం పైన మార్కులు సాధించాను. ఎంసెట్‌లో సిటీ పరిధిలో 21వ ర్యాంక్ తెచ్చుకున్నాను.
 
జేఎన్‌టీయూలో ఫ్రీ సీట్ వచ్చింది. నా చదువంతా మెరిట్ స్కాలర్‌షిప్ మీదే సాగిందంటే అది డ్యాన్స్ పుణ్యమే. నృత్యం నాకు చాలా గుర్తింపు కూడా తెచ్చింది. ప్రతిష్టాత్మక డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాను. కంపెనీ తరఫున ముంబైలోని టాటా హౌస్‌లో జేఆర్‌డీ టాటా 157వ జయంతి సందర్భంగా ఫారిన్ డెలిగేట్స్ ముందు మేడమ్ శోభానాయుడు కొరియోగ్రఫీ చేసిన నృత్యం ప్రదర్శించాను. అకాడమీలో బైక్ పార్క్ చేసుకుని, ఆఫీసుకు వెళతాను. ఆఫీసు నుంచి అకాడమీకి తిరిగొచ్చి, ప్రాక్టీస్ అయ్యాక బైక్ మీద ఇంటికొస్తాను. రోజుకు గంటన్నర ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందో ముందే తెలియదు కాబట్టి ఆఫీసు వర్క్‌లో అడ్వాన్స్‌గా ఉంటాను’ అని తన నృత్య సాధనను వివరించారు నిత్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement