విడుదలలో చోటుచేసుకున్న అంతులేని జాప్యం...అది కలిగించిన ఉత్కంఠతో పోలిస్తే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో దేశ ప్రజలముందు పరిచిన ప్రత్యేకతలేమీ లేవు. విపక్ష స్థానంనుంచి మాట్లాడగలిగిన వెసులుబాటువల్ల కావొచ్చు...కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే ఇది కొంత దూకుడుగా ఉన్న మాట వాస్తవమే అయినా, బీజేపీ గత మేనిఫెస్టోలను దృష్టిలో ఉంచుకుని గమనిస్తే వివాదాస్పదమైన అంశాల్లో కాస్త నిదానంగానే ఉన్నట్టు లెక్క. రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌర స్మృతి, 370వ అధికరణ తొలగింపు వంటి విషయాల్లో ఈ సంగతి వెల్లడవుతుంది.
హిందుత్వ ఎజెండా ఉన్న పార్టీ గనుక బీజేపీ లక్ష్యాల్లో ఆదినుంచీ ఇవి ఉన్నాయి. అయితే, 1999లోనూ, 2004లోనూ బీజేపీ తన సొంత మేనిఫెస్టోలకు బదులు ఎన్డీయే పక్షాలతో కలిసి రూపొందించిన ఉమ్మడి ఎజెండాలను విడుదల చేసింది. సహజంగానే ఆ ఎజెండాల్లో వీటి ప్రస్తావన లేదు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఈ అంశాలన్నీ మళ్లీ వచ్చిచేరాయి. వాటి స్వరమూ హిందుత్వ ఎజెండాకు అనుగుణం గానే ఉంది. కానీ, లౌక్యం ఒంటబట్టడంవల్ల కావొచ్చు... ఈసారి మాత్రం అవే అంశాలను వేరే కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. రామమందిర నిర్మాణాన్ని ‘రాజ్యాంగ పరిధికి లోబడి’ చేపడతామని తాజా మేనిఫెస్టో చెబుతున్నది. అలాగే ఉమ్మడి పౌరస్మృతిని హిందూ - ముస్లిం కోణంనుంచి కాక ‘జెండర్’ సమానత్వానికి అవ సరంగా పేర్కొంటున్నది. ఇక 370 అధికరణ కూడా సంబంధిత పక్షాలతో చర్చిం చి తొలగించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. నరేంద్ర మోడీ నుంచి ‘చాలా ఎక్కువ’ ఆశించే హిందుత్వవాదులకు ఈ ‘సర్దుబాట్లు’ ఎంత వరకూ నచ్చుతాయో చూడాలి.
మైనారిటీల బుజ్జగింపు అవధులు దాటు తున్నదని తరచు విమర్శలకు దిగే బీజేపీ ఈసారి వారి సమస్యలపై సైతం దృష్టిసారించడం విశేషం. ‘స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటుతున్నా మైనారిటీల్లో ఎక్కువమంది... ప్రత్యేకించి ముస్లింలు పేదరికంలో కూనారిల్లడం దురదృష్టకరమ’ని మేనిఫెస్టో వ్యాఖ్యానించింది. వారి ఉద్ధరణ కోసమంటూ పలు వాగ్దానాలు చేసింది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధులకు ప్రశ్నించే అవకాశం ఇచ్చివుంటే బీజేపీ వైఖరిలో చోటుచేసుకున్న ఇలాంటి మార్పులపై మరింత ఆరా తీసేందుకు వీలుచిక్కేది.
ఇక ఉదారవాద ఆర్ధిక విధానాలను దాదాపు అన్ని పార్లమెంటరీ పార్టీలూ శిరోధార్యంగా భావిస్తున్న వర్తమాన కాలంలో అధికారంనుంచి వైదొలగే పక్షానికి భిన్నమైన ఆర్ధిక అజెండాను బీజేపీ ఇవ్వగలదని ఎవరూ అనుకోలేదు. కనుక కాంగ్రెస్ ఆర్ధిక విధానాలకు బీజేపీ విధానాలకూ పెద్దగా తేడా కనబడదు. చిల్లరవర్తకంలో మినహా ‘ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా, ఉద్యోగాల సృష్టికి తోడ్పడేవిధంగా’ ఇతర రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతిస్తామని బీజేపీ మేనిఫెస్టో అంటున్నది. ఇలాంటివి ఆచరణలోకొచ్చేసరికి ఎలా అమలవుతాయన్నది ప్రశ్నార్ధకమే.
ఎందుకంటే, 2004కు ముందు ఎఫ్‌డీఐలకు తలుపులు బార్లా తె రిచింది తామేనన్న సంగతిని మరుగునపరిచి రెండేళ్లక్రితం యూపీఏ సర్కారు దానికి కొనసాగింపు చర్యకు పూనుకున్నప్పుడు బీజేపీ గట్టిగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ ప్రవర్తనా డిటోయే. విపక్షంలో ఉండి ఎన్‌డీఏ సర్కారు ప్రయత్నాన్ని అడ్డుకున్న ఆ పార్టీ తాను గద్దెనెక్కాక దాన్నే దేశ ప్రజలపై రుద్దింది. ఇలా ఒక మాటకూ, విధానానికీ కట్టుబడక...అధికార పీఠంపై ఉన్నామా, విపక్షంలో ఉన్నామా అనేదాన్నిబట్టి స్వరం మార్చడం అలవాటైపోయిన ప్రస్తుత తరుణంలో మాటలు కాక...అంతిమంగా ఆయా పక్షాల ఆచరణే గీటురాయి అవుతుంది. ‘బ్రాండ్ ఇండియా’పై దృష్టిపెడతామని, సుపరిపాలనను, అభివృద్ధిని అందిస్తామని మేనిఫెస్టో హామీ ఇస్తున్నది. 2009లో యూపీఏ వెంట వెళ్లిన మధ్యతరగతిని, యువతను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు...వృద్ధిని పునరుద్ధరిస్తామని, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామని, పన్ను ఉగ్రవాదాన్ని రూపుమాపు తామని, వంద ఆధునిక నగరాలను అభివృద్ధి చేస్తామని అంటున్నది. ఉద్యోగ కల్పనపై కూడా ఊరింపులు బాగానే ఉన్నాయి.
మన దే శం అనుసరించే అణ్వస్త్ర విధానాన్ని వర్తమాన అవసరాలకు అనుగుణంగా సవరిస్తామని మేనిఫెస్టో చెబుతోంది. ప్రస్తుత అణ్వస్త్ర విధానం వాజ పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపకల్పన చేసిందే. అణ్వస్త్ర దేశంపై తొలి దాడికి దిగకపోవడం, అణ్వస్త్ర రహిత దేశంపై అసలు అణ్వస్త్రాన్నే వినియోగించకపోవడం ఆ విధానంలోని కీలకాంశాలు. దీనికి ఏ సవరింపులు చేయదల్చుకున్నారో బీజేపీ స్పష్టంగా చెప్పలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక 108కి బీజేపీ మేనిఫెస్టోలో చోటుదక్కడం విశేషం. 2009 ఎన్నికల్లో హామీ ఇచ్చినా యూపీఏ సర్కారు దాన్ని అమల్లోకి తీసుకురావడంలో విఫలమైంది.
కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై మేనిఫెస్టో ప్రత్యేక దృష్టిపెట్టింది. యూపీఏ ఏలుబడిలో పరమ అధ్వాన్నస్థితికి చేరుకున్న ఈ సంబంధాలను పట్టాలెక్కిస్తామని చెబుతోంది. ప్రధాని, ముఖ్యమంత్రులు కలిసి ‘టీం ఇండియా’గా ఉండాలన్నది తమ ఆశయమంటున్నది. ఏ కీలక అంశంలోనూ రాష్ట్రాలను సంప్రదించక రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చిన చరిత్ర యూపీఏ సర్కారుది. పార్టీ మేనిఫెస్టోలో సీమాంధ్ర ప్రస్తావన కూడా ఉంది. ఆ ప్రాంతానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తోంది. విభజన విషయంలో నిలకడలేని మాటలతో పొద్దుపుచ్చి, చివరకు దానికి సహకరించిన బీజేపీ సీమాంధ్రకు చేయబోయే ‘పూర్తి న్యాయం’ ఏమిటో చూడాల్సివుంది. ఈ మేనిఫెస్టోపైనా, దానికి మూలమైన గుజరాత్ నమూనాపైనా రాగల రోజుల్లో మరింతగా చర్చ సాగుతుంది. బీజేపీ ఇప్పటిలా కేవలం ‘మోడీ మంత్ర’పైనే ఆధారపడక, మేనిఫెస్టోలోని అంశాలకూ ఇక జవాబులివ్వాల్సి ఉంటుంది.
మారింది స్వరమే!
Published Wed, Apr 9 2014 1:05 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement