సైకిల్ కథ
ఇప్పుడంటే నానా రకాల మోటర్ బైకులు రయ్‌మంటూ రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి గానీ, దాదాపు రెండు శతాబ్దాల కిందట మనుషులు ఇలాంటి వాహనాలు అందుబాటులోకి రాగలవని ఊహించనైనా ఊహించలేదు. మోటర్ ఇంజిన్‌కు ముందే అప్పట్లో తక్కువ శ్రమతో మనుషులు నడప గలిగే తేలికపాటి వాహనాన్ని తయారు చేయడానికి యూరోప్‌లో కొంతమంది ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాల్లోంచి పుట్టిందే సైకిల్.
పంతొమ్మిదో శతాబ్ది ప్రారంభంలో తొలిసారిగా తయారు చేసిన సైకిల్‌కు కలప ఫ్రేమ్‌ను ఉపయోగించారు. దానికి ముందు చక్రం పెద్దగా, వెనుక చక్రం చిన్నగా ఉండేది. తొక్కడానికి ముందు చక్రానికి పెడల్స్ ఉండేవి. వాహనం తేలికగానే ఉన్నా, దీన్ని నడపాలంటే సర్కస్ ఫీట్లు చేసినంత కష్టపడాల్సి వచ్చేది. తర్వాతి కాలంలో చైన్, బాల్ బేరింగుల ఏర్పాటుతో తేలికగా తొక్కగలిగే సైకిల్ రూపొందింది. ఆధునిక సైకిల్‌కు మాతృక అయిన ఈ సైకిల్‌ను బ్రిటిష్ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త జాన్ కెంప్ స్టార్లే 1885లో రూపొందించారు.
ఈ సైకిల్‌కు బ్రేకులు పెట్టారు. దీనిని రోవర్ సేఫ్టీ బైసికిల్ అనేవారు. ఇవి పాశ్చాత్య దేశాల్లో విరివిగా కనిపించేవి. తొలినాళ్లలో పోలీసులు, పోస్ట్‌మన్లు కూడా వీటి మీదే ఆధార పడేవారు. ఖరీదు తక్కువ కావడంతో మోటరు సైకిళ్లు అందుబాటు లోకి వచ్చిన తర్వాత కూడా సామాన్యుల వాహనంగా చలామణీ అయ్యేవి. కాలంతో పాటు సైకిళ్లలోనూ మార్పులు వచ్చాయి. వీధుల్లోనే కాదు... కొండలు, గుట్టలపైనా తొక్కగలిగే సైకిళ్లు వచ్చాయి. బ్యాటరీతో నడిచే సైకిళ్లూ వచ్చాయి. అయితే, నగరాల్లో ట్రాఫిక్ పుణ్యమా అని ఇప్పుడు సైకిళ్లు బహు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి.