సరిహద్దుకి ఆవల | Commanding Officer Commanding to Ranging | Sakshi
Sakshi News home page

సరిహద్దుకి ఆవల

Published Sun, May 27 2018 12:52 AM | Last Updated on Sun, May 27 2018 12:52 AM

Commanding Officer Commanding to Ranging - Sakshi

సెల్యూట్‌ చేసిన లాంచ్‌నాయక్‌ రాంసింగ్‌ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆఫీసర్‌ కమాండింగ్‌.‘‘సెర్చింగ్‌ పార్టీతో నేనూ వెళతాను సార్‌!’’ వినయంగా అన్నాడు రాంసింగ్‌.‘‘ఎందుకు?’’ అడిగేడు ఆఫీసర్‌ కమాండింగ్‌.‘‘స్వామి నాకు మిత్రుడు సార్‌!’’ చెప్పాడతను. అప్పటికే ఆఫీసర్‌ కమాండింగ్‌ చాలా విసుగ్గా ఉన్నాడు. నిన్న తెల్లవారుజామున పెట్రోలింగ్‌ పార్టీ ఒకటి మందుపాతరకి బలైంది. అయిదు శవాలు మాత్రం దొరికాయి. ఆయుధాలు, శరీరాల మీదున్న విలువైన వస్తువులు పట్టుకుపోయారు శత్రుసైనికులు. ఇద్దరు భారత సైనికుల శరీరాలు కత్తి పోట్లకు గురయ్యాయి. అంటే మందుపాతర పేలాక ప్రాణాలతో మిగిలిన వారిని అంతమొందించారన్నమాట. పెట్రోలింగ్‌ పార్టీలోని స్వామి అనే సైనికుని ఆచూకీ లేదు. శత్రుసైనికులు బందీగా పట్టుకుపోవడానికి అవకాశం లేదు. ఏ తుప్పల్లోనో శరీరం పడి ఉంటుందన్న ఆలోచనతో సెర్చింగ్‌ పార్టీని పంపుతున్నారు.  రెండు దేశాల సరిహద్దుకి మధ్య ఎవరికీ చెందని రెండు కిలోమీటర్ల ప్రాంతంలో చిన్న అడవి ఉంది. చొరబాటుదారులు అడవి ప్రాంతంలో పెట్రోలింగ్‌ పార్టీ కనుమరుగయిన మరుక్షణం సరిహద్దు దాటుతారు. చొరబాటుదారుల్ని వెంటాడే క్రమంలో పెట్రోలింగ్‌ పార్టీ మందుపాతర పేలుడులో చిక్కుకుంది. ఇది శత్రువు ఎత్తుగడ కావచ్చు.‘‘సరే వెళ్ళు’’ చెప్పాడు ఆఫీసర్‌ కమాండింగ్, ఆలోచనల నుండి తేరుకుని. రాంసింగ్‌ సెల్యూట్‌చేసి ఆక్కడి నుండి కదిలి సెర్చింగ్‌ పార్టీ ఇన్‌చార్జి హవల్దార్‌కి రిపోర్టు చేశాడు. ఆ తరువాత స్టోర్‌ నుండి ఆయుధాలు తీసుకున్నాడు.

సెంట్రీలు చూస్తుండగా సెర్చింగ్‌ పార్టీ బోర్డరు దాటింది. క్రమంగా సెర్చింగ్‌ పార్టీలోని నలుగురు సభ్యులు కనుమరుగయ్యారు. అంతా సరళరేఖ మాదిరిగా తమ మధ్య నాలుగు అడుగుల దూరం ఉండేటట్లు చూసుకుని నడుస్తోంది సెర్చింగ్‌ పార్టీ. కాళ్ళకి మెత్తని జంగిల్‌ షూస్‌ ఉండటంతో అడుగుల శబ్దం రావడం లేదు. అందరికంటే ముందున్న వ్యక్తి పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ అడుగులేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం పసిగడితే తన టీవ్‌ుని హెచ్చరిస్తాడతను. శత్రువుకి సమీపంగా వెళుతున్నామనే స్పృహ ఉంది అందరికీ. జాగ్రత్తతోపాటు ఆయుధాన్ని దూరం చేసుకోకూడదు. మృత్యువు చెప్పిరాదు. అడవిని సమీపించాక అంతా నేలమీద పడుకున్నారు. టీవ్‌ు లీడర్‌ బైనాక్యులర్స్‌తో అత్యంత జాగ్రత్తగా ముందుకి చూశాడు. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఎక్కడా అనుమానించదగ్గది ఏమీ కనిపించలేదు. క్లియరెన్స్‌ సిగ్నల్‌ ఇచ్చి నెమ్మదిగా లేచాడు. అందరూ గన్స్‌లోడ్‌ చేసి ఎటాకింగ్‌ పొజీషన్‌లో ముందుకి కదిలారు. వారి చూపు ముందున్న ప్రదేశం మీద ఉంది. ముందురోజు అక్కడ మందుపాతర పేలింది. అయిదు శవాలను తీసుకొచ్చారు క్యాంపుకి. దొరకని శరీరం కోసం ఇప్పుడొచ్చారు.లీడర్‌ చెయ్యి ఎత్తాడు. అందరూ టక్కున ఆగిపోయారు. అడవిలో అస్పష్టంగా ఉన్న కాలి బాటకి అడ్డంగా ల్యాండ్‌ మైన్‌ పేలుడుతో ఏర్పడిన గొయ్యి ఉంది. ఆ గొయ్యికి చుట్టూ తిరిగి అవతలికి వెళ్ళాడు లీడర్‌. కొంత దూరం వెళ్ళాక నెమ్మదిగా అరిచాడు.

‘‘ఇక్కడో ల్యాండ్‌మైన్‌ ఉంది.’’నేలమీద రెండడగులు లోతు తవ్వి ఆ గోతిలో భూమికి సమాంతరంగా అమరుస్తారు మందుపాతర. ఒక్క సేఫ్టీపిన్‌ మాత్రమే పైకి కనిపిస్తుంది. దానిమీద కాలు వేసినా లేదా కాలితో తన్నినా సేఫ్టీపిన్‌ లోపల ఉన్న కేప్‌కి తగిలి పేలుతుంది. చుట్టు పక్కల పదడుగుల దూరం వరకూ దాని ప్రభావం ఉంటుంది. యుద్ధభూమిలో అత్యంత వినాశకారి ఆయుధం ల్యాండ్‌ మైన్‌.బాటకి ఇరువైపులా కదిలారు నలుగురు. వాళ్ళంతా నేలని పట్టిపట్టి చూశారు. శత్రువు చాలా ప్రమాదకరమైన వాడనే ఆలోచన వాళ్ళ బుర్రలో కదులుతోంది. ఇక ఎలాంటి ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక వాళ్ళు కాస్త స్వేచ్ఛగా కదలసాగారు. ఒకవైపు గాలిస్తూ వెళ్ళిన రాంసింగ్‌కి చిన్న లోయ ఒకటి ఎదురైంది. అతను తలెత్తి చుట్టూ చూశాడు. ఒక చెట్టు కొమ్మకి యూనిఫాంలోని పీలిక ఒకటి వేలాడుతూ కనిపించింది. వీపుకి అమర్చుకున్న అవర్‌షాక్‌ నుండి రోప్‌ తీశాడు రాంసింగ్‌. దానికి చివర రాయికట్టి లోయలోకి వదిలాడు. మూడు వంతులు తాడు లోపలికి వెళ్ళాక నేలకి తగిలింది రాయి. ఇన్‌చార్జికి చెప్పి రెండోకొన చెట్టుకి కట్టి తాడు పట్టుకుని దిగడం ప్రారంభించాడు. పది నిమిషాలకి తాడు లూజయింది. ఇన్‌చార్జి లోపలికి తొంగి చూశాడు. వెలుగుతున్న టార్చి చుక్కలా కనపించిందంతే. గంట తరువాత లోపల నుండి రాంసింగ్‌ గొంతు వినిపించింది. 

‘‘బాడీ దొరికింది. స్లీపింగ్‌ బ్యాగ్‌ లోపలికి పంపండి...’’స్లీపింగ్‌ బ్యాగ్‌ మరో తాడుకి కట్టి లోయలోకి పంపేడు ఇన్‌చార్జ్‌. అరగంట తర్వాత శవాన్ని పైకిలాగాక రాంసింగ్‌ పైకి వచ్చాడు. రాంసింగ్‌ సూచన ప్రకారంఇద్దరు జవాన్లు బాడీతో అక్కడ నుంచి కదిలారు. రాంసింగ్‌ తన అవర్‌షాక్‌ నుంచి చిన్న గునపం బయటకు తీశాడు.‘‘అదెందుకు?’’ ఆశ్చర్యంగా అడిగాడు హవల్దార్‌.‘‘మనవాళ్ళ చావుకి కారణమైన శత్రువుకి బుద్ధి చెప్పాలి. మీరు లైనింగ్‌ పొజిషన్‌లో బైనాక్యులర్స్‌తో శత్రు సరిహద్దుని గమనించండి. ఎవరైనా ఇటు వస్తుంటే నన్ను హెచ్చరించండి..’’ చెప్పాడు రాంసింగ్‌.అతను ఏంచేస్తాడో అర్థంకాక పోయినా, నేలమీద పడుకుని బైనాక్యులర్స్‌ కళ్ళముందు పెట్టుకుని గమనించసాగేడు హవల్దార్‌. ల్యాండ్‌ మైన్‌ పేలుడుతో ఏర్పడిన గొయ్యి అవతల మొత్తం నాలుగు మందుపాతరలు ఉన్నాయి. వాటి మధ్య దూరాన్ని కాలి అడుగులతో కొలిచాడు. ఒక్కొక్క దాని మధ్య పదడుగుల దూరం ఉంది. శత్రు సరిహద్దువైపు ఉన్న చివరి ల్యాండ్‌మైన్‌ నుంచి పదడుగులు వెనక్కి నడిచి అక్కడ చిన్న గునపంతో గుండ్రంగా నేలమీద గుర్తు పెట్టాడు. దాని తరువాత ఒకటి, ఆ తరువాత మరొకటి పెట్టాడు. తను చెయ్యబోతున్న పనిని ఒకసారి సమీక్షించుకున్నట్టు కొన్ని క్షణాలు చూశాడు. తను చేస్తున్నది చాలా ప్రమాదకరమైన పని. ఏ మాత్రం తేడావచ్చినా నామరూపాలు లేకుండా పోతాడు. 

గుర్తులు పెట్టినచోట గోతులు తవ్వడానికి అరగంట పట్టింది. ఆ తరువాత తనకి దగ్గరలోని ల్యాండ్‌మైన్‌ దగ్గరకు వెళ్ళాడు. దానికి కాస్త ఎడంగా చుట్టూ అడుగున్నర లోతు తవ్వాడు. ఆపని చేస్తున్నప్పుడు అతని బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. చివరగా మట్టిమీద నిలబడిన ల్యాండ్‌మైన్‌ కిందికి రెండు చేతులు పోనిచ్చి ఊపిరిబిగపట్టి నెమ్మదిగా పైకి లేపాడు. అది కదలకుండా తీసుకెళ్ళి తను తీసిన ఓ గొయ్యిలో ఉంచి చుట్టూ మట్టి కప్పాడు.మిగతా రెండింటిని కూడా అలాగే తీసుకెళ్ళి పాతాడు.మూడు మందుపాతరలూ వెనక్కి జరిపాక మిగిలిన దాని దగ్గరకు వచ్చాడు. బరువైన రాయికి రోప్‌ కట్టి ఆ మందుపాతర మీద ఉంచాడు. రెండో చివర రోప్‌ని ఓ చెట్టుకి వదులుగా ముడివేసి చేతులు దులుపుకున్నాడు. అంతవరకూ రాంసింగ్‌ చర్యల్ని గమనించిన హవల్దార్‌ అన్నాడు – ‘‘చాలా ప్రమాదకరమైన పని. ఏదో ల్యాండ్‌మైన్‌ నీ చేతిలో పేలితే?’’.‘‘నిన్న పోయిన ఆరుగురికి మరొకరు జత అయ్యేవాడు... ప్రమాదమని శత్రువుకి బుద్ధి చెప్పకుండా ఊరుకుంటామా...’’ నవ్వేడు రాంసింగ్‌.డెడ్‌బాడీతో క్యాంపు చేరుకుంది సెర్చింగ్‌ పార్టీ.మరునాడు తెల్లవారుజామున రాంసింగ్‌ని నిద్రలేపాడు సెంట్రీ. అతను బేరక్‌ నుంచి బయటకొచ్చి చన్నీళ్ళతో ముఖం కడుక్కున్నాడు. చల్లగా ఉంది వాతావరణం. మరికాసేపట్లో అదృశ్యం కావడానికి సమాయత్తమవుతోంది చీకటి. రాంసింగ్‌ సరిహద్దు దాటి నిశ్శబ్దంగా అడవివైపు నడిచాడు. అడవిలోని కాలిబాటలోకి ప్రవేశించి చెట్టుకి కట్టిన తాడు అందుకుని చేతికి చుట్టుకుని బలంగా లాగాడు.ల్యాండ్‌మైన్‌ మీద ఉంచిన రాయి తప్పుకుంది. సేఫ్టీ పిన్‌ చిన్న చప్పుడుతో పైకి ఎగిరింది. భూమి కంపించేటట్టు పెద్ద చప్పుడు. వెనక్కి తిరిగి క్యాంపు చేరుకుని సెంట్రీపోస్టులో ఇసుక బస్తామీద కూర్చున్నాడు రాంసింగ్‌. అతని చేతికి పొగలు కక్కుతున్న టీ మగ్‌ అందించాడు ఒకతను. అది తాగుతూ  జరగబోయే పరిణామం కోసం ఎదురుచూడసాగేడు. సరిగ్గా తెలతెలవారుతుండగా అడవి నుంచిరెండు పేలుడులు అక్కడికి వినిపించాయి. పని పూర్తయినట్టు సెంట్రీలవైపు చూసి చిన్నగా నవ్వాడు రాంసింగ్‌.కుయుక్తితో భారత సైనికుల్ని మట్టుపెట్టి ఆయుధాలు, విలువైన వస్తువులు పట్టుకుపోయిన శత్రువు వలలో చిక్కుకొని అంతమయ్యాడు.

‘‘అటెన్షన్‌.... మార్చ్‌.....’’రాంసింగ్‌ ఎడమకాలు కుడికాలు పక్కకి చేర్చి కదిలాడు. కమాండ్‌ పాస్‌ చేసిన హవల్దార్‌ కూడా అతనితో సమానంగా అడుగులు వెయ్యసాగేడు. అది కంపెనీ హెడ్‌క్వార్టర్‌లోని మేజర్‌ క్యాంప్‌ ఆఫీస్‌.లోపల ముగ్గురు కూర్చుని ఉన్నారు. మధ్యలో రివాల్వింగ్‌ చైర్‌లో ఉన్నాడు మేజర్‌. సిబ్బందిలో ఎవరైనా తీవ్ర నేరాలకు పాల్పడితే శిక్ష విధించే కోర్ట్‌ ఆఫ్‌ మార్షల్‌ అది. ముందురోజు బోర్డర్‌ దగ్గర ఉన్న ప్లటూన్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌కి రాంసింగ్‌ని, హవల్దార్‌ని హెడ్‌ క్వార్టర్‌కి పంపమని ఉత్తర్వులు వచ్చాయి. ఇద్దరూ పది కిలోమీటర్లు నడచి హెడ్‌ క్వార్టర్‌ చేరుకున్నారు. ముందు హవల్దార్‌ని విచారించాక రాంసింగ్‌ని పిలిచారు.‘‘హాల్ట్‌...’’ చెప్పాడు హవల్దార్‌. ఇద్దరూ ఆగాక అన్నాడు – ‘‘సెల్యూట్‌..’’. ఎదురుగా ఉన్న మేజర్‌కి సెల్యూట్‌ చేశాక ‘‘డౌన్‌’’ అన్నాడు. మేజర్‌ హవల్దార్‌ వైపు చూసి తలూపాడు. అతను సెల్యూట్‌ చేసి ఎబౌట్‌ టర్న్‌ తీసుకుని మార్చింగ్‌లో అక్కడ నుండి బయటకి నడిచాడు.రెండు నిమిషాలు తన ముందున్న పేపర్లు పరిశీలించి ఆ తర్వాత తలెత్తి రాంసింగ్‌ మీదకి చూపు సారించాడు మేజర్‌. ఇరవై రెండు సంవత్సరాలు దాటిన యువకుడతను. మీసాలు పూర్తిగా రాలేదు. మూడు సంవత్సరాల ఆరు నెలలు అతని సర్వీస్‌. మేజర్‌ కళ్ళలో చిన్నపాటి ఆశ్చర్యం కదలాడింది. ‘‘శత్రువు అమర్చిన ల్యాండ్‌ మైన్స్‌ ప్లేస్‌ మార్చి పదిమంది మరణానికి కారకుడవయ్యావు. ఏ ధైర్యంతో ఆ పని చేశావ్‌?’’ కంగుమనే గొంతుతో అడిగాడు మేజర్‌.‘‘ఇది ధైర్యానికి సంబంధించినది కాదు సార్‌. నాతో పనిచేస్తున్న ఆరుగురిని శత్రువు పొట్టన పెట్టుకున్నాడు. వారి ఆయుధాలను వారిమీదే ప్రయోగించి బదులు తీర్చాను’’ వినయంగా చెప్పాడు రాంసింగ్‌.‘‘అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం..’’ కఠినంగా అన్నాడు మేజర్‌.‘‘మీ పర్మిషన్‌ తీసుకునే సమయం లేదు సార్‌! యుద్ధభూమిలో దొరికిన శత్రువుని దొరికినట్లే హతమార్చడం భారత సైనికునిగా నా బాధ్యత’’మేజర్‌ తలపరికించాడు.

‘‘నీకు స్వామితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయా?’’ అడిగేడు మేజర్‌.‘‘లేవు సార్‌! అతను నా ప్రాణ స్నేహితుడు.’’ చెప్పాడు రాంసింగ్‌.‘‘అయితే ఎందుకు చంపావ్‌ అతన్ని?’’ఊహించని ప్రశ్న కావడంతో నోరు మెదపలేదు రాంసింగ్‌.‘‘సెర్చింగ్‌ పార్టీతో వెళతానని ఈనెల తొమ్మిదిన ఆఫీర్‌ కమాండింగ్‌ని అడిగావు. అందరితోపాటు స్టోర్స్‌ నుంచి వెపన్స్‌ డ్రా చేశావు. తిరిగొచ్చాక వెపన్స్‌ హేండోవర్‌ చేసినప్పుడు స్టెన్‌గన్‌తూటాల్లో ఒకటి తక్కువైంది.’’మౌనంగా చూస్తూ ఉండిపోయాడతను.‘‘ఆ తూటా ఇదే..’’ పాలిథిన్‌ కవరులోని తూటా చూపించాడు మేజర్‌.‘‘పోస్టుమార్టవ్‌ులో స్వామి ఛాతీకి స్టెన్‌గన్‌ బేరల్‌ ఆనించి కాల్చినట్టు తేలింది. తూటా చేసిన గాయం నుండి కారిన రక్తం షర్టుకి అంటుకుని ఉంది. నిజానికి నువ్వు అతన్ని రక్షించడానికి వెళ్ళావు. కాని కాల్చి చంపావ్‌. ఇది బాధ్యతతో కూడిన డిసిప్లిన్‌ ఫోర్సు. ఇక్కడఎవరికి తోచినట్లు వారు ప్రవర్తించడం కుదరదు. నిన్ను ఉద్యోగం నుంచి తొలగించి, అరెస్ట్‌ చెయ్యవచ్చు’’ గంభీరంగా అన్నాడు మేజర్‌.గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు రాంసింగ్‌. 

లోయలో నేల కాలికి తగిలాక తాడు వదిలిపెట్టాడు రాంసింగ్‌. టార్చి వెలిగించి చుట్టూ చూశాడు. కొమ్మలు, తీగలు దట్టంగా అల్లుకుని నేల చిత్తడిగా ఉంది. అదోరకమైన వాసన ముక్కుపుటాలను తాకుతోంది. చెట్లు అడ్డదిడ్డంగా పెరిగాయి. కొండరాళ్ళు నాచు రంగులో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ముందుకి కదిలాడు. ఏవో పురుగులు శరీరంమీద పాకసాగాయి. ఒకసారి వాటిని దులుపుకుని అవంత తేలిగ్గా వదలవని గుర్తించాడు. ఆచితూచి అడుగులు వేస్తూ కదలసాగేడు. మందుపాతర పేలుడులో గాయపడిన వ్యక్తి ఆ లోయలో పడితే నామరూపాలు ఉండవని గుర్తించాడు. అతని ఆలోచనలు చెదరగొడుతూ ఓ రాయి పక్కన కనిపించింది స్వామి శరీరం.దగ్గరకు వెళ్ళి వెలుగులో చూసి చప్పున తలతిప్పుకుని రాబోయే వాంతిని ఆపుకున్నాడు. చూడటానికి చాలా భయంకరంగా ఉంది శరీరం. ఒక కాలు తొడ వరకు లేదు. ఓ చెయ్యికి మణికట్టు లేదు. ముఖంలో కుడి భాగం లోతైన గాయంతో దెబ్బతింది. శరీరాన్ని రకరకాల కీటకాలు కమ్మేశాయి. మరింత దగ్గరకు వెళ్ళి ఛాతీమీద చెయ్యేశాడు. గుండె చిన్నగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. అనుమానం తీర్చుకోవడానికి రెండో చెయ్యివేశాడు. ప్రాణం ఉంది.‘‘స్వామీ..’’ పిలిచాడు గద్గదంగా.‘‘స్వామీ...’’ అంటూ భుజం పట్టుకుని కదిపాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేదుకాని ఎడమకన్ను సగం తెరుచుంది.‘‘నేనురా... రాంసింగ్‌ని.’’ చెప్పాడు దుఃఖాన్ని ఆపుకుంటూ.‘‘రాంసింగ్‌...’’ అస్పష్టంగా ఉచ్చరించాయి స్వామి పెదవులు.‘‘అవును నేనే... నిన్ను వెంటనే ఇక్కడ నుంచి తీసుకువెళతాను’’ చెప్పాడు వణుకుతున్న స్వరంతో.‘‘వద్దురా...’’‘‘పైన మన పార్టీ ఉంది. మరేం భయంలేదు.’’ చెప్పాడు.‘‘నేను బతికే స్థితిలో ఉన్నానా?’’ అడిగాడు స్వామి.‘‘అవేం మాటలురా..’’ రాంసింగ్‌ గొంతు పూడుకుపోయింది.‘‘ఎక్కువసేపు బతకను... అది నిజం... నా ప్రాణం పోయాక ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. లేదంటే నాకు విముక్తి ప్రసాదించు. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఇక్కడ పడిన దగ్గరనుంచి చావు కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’రాంసింగ్‌ మాట్లాడలేదు. ఆ స్థితిలో స్వామిని చూసేసరికి మతిపోయిందతనికి. ఆవేదనతో గుండెలు బరువెక్కాయి. అతను బతకడని, ఒకవేళ బతికినాజీవచ్ఛవమని తెలుస్తూనే ఉంది.‘‘నాకు చెల్లెలు తప్ప ఎవరూ లేరని నీకు తెలుసు. దానిని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు...’’రాంసింగ్‌ కళ్ళు కన్నీళ్ళతో మసకబారాయి. అతను నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది.వణుకుతున్న చేత్తో స్టెన్‌గన్‌ బయటకు తీశాడు.

‘‘సో ... నేరం చేశావ్‌?’’ మేజర్‌ అన్నాడు.తల అడ్డంగా ఊపాడు రాంసింగ్‌. ‘‘అది నేరమని, నా భవిష్యత్తు నాశనమవుతుందని ఆలోచించలేదు సార్‌! నా ప్రాణ స్నేహితుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఏ దైవమూ వాడి చావుని ఆపలేదు. చావు ఆలస్యం కావడం వల్ల వాడు మరికాసేపు నరకయాతన అనుభవించడం తప్ప ఉపయోగం లేదు. అందుకే వాడి కోరిక తీర్చాను సార్‌..’’కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది అక్కడ.‘‘బయట వెయిట్‌ చెయ్యి, మళ్ళీ పిలుస్తాను..’’ చెప్పాడు మేజర్‌.రాంసింగ్‌ సెల్యూట్‌ చేసి బయటకొచ్చాడు.‘‘ఏమైంది బేటా?’’ బయట ఉన్న హవల్దార్‌ అడిగేడు.‘‘ఏం కాలేదు’’ రాంసింగ్‌ జవాబిచ్చాడు.‘‘ఏం కాదు’’ చెప్పాడతను. రాంసింగ్, స్వామి అతని స్క్వాడ్‌లోనే పనిచేస్తున్నారు. తనకంటే ముందు హవల్దార్‌ని పిలిచి మేజర్‌ విచారించాడని తెలుసు రాంసింగ్‌కి. అయితేలోపల ఏం జరిగిందో మాత్రం తెలియదు.అరగంట తర్వాత తన ముందు నిలబడిన రాంసింగ్‌ని అడిగేడు మేజర్‌.‘‘స్వామి చెల్లెలు పరిస్థితి ఏమిటి?’’‘‘ఆమెని మా గ్రామం తీసుకుపోతాను సార్‌. తల్లి, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఈమెతో నలుగురు అవుతారు. నాకు పెళ్ళిచేసుకునే వయసు రావడానికి ఇంకా రెండున్నర ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఆమె ఇష్టపడితే పెళ్ళి చేసుకుంటాను. లేదంటేఆమెకి నచ్చినవాడికిచ్చి పెళ్ళిచేస్తాను సార్‌!’’మేజర్‌ కొన్ని క్షణాలు తన ముందున్న కాగితాలు చూసి ఆ తర్వాత తలెత్తాడు. అతని ముఖం భావరహితంగా ఉంది. ‘‘నీకిది మొదటి వార్నింగ్‌. తక్కువ సర్వీసులో లాంచనాయక్‌గా ప్రమోషన్‌ పొందావు. మంచి భవిష్యత్‌ ఉంది నీకు. ఇక నుంచి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఉద్యోగం చెయ్యి. అనవసరమైన విషయాల జోలికి పోకు... వెళ్ళు.’’ చెప్పాడు గంభీరంగా.స్మార్ట్‌గా సెల్యూట్‌ చేసి వెనక్కి తిరిగాడు రాంసింగ్‌.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement