వార్డ్‌రోబూ ముసలాయనా మృత్యువూ | Funday story world in this week | Sakshi
Sakshi News home page

వార్డ్‌రోబూ ముసలాయనా మృత్యువూ

Published Sun, Sep 23 2018 12:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Funday story world in this week - Sakshi

మా నాన్న గదిలోని వార్డ్‌రోబు మామూలు కర్ర సామగ్రి కాదు. అది ఇంటి లోపల మరో ఇల్లులా ఉండేది. మా నాన్న పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన ఆ వార్డ్‌రోబు మేం ఇల్లు మార్చినప్పుడల్లా మా వెంట వచ్చి ఆఖరుకు మిరాఫ్లోర్స్‌లోని మా నాన్న పడకగదిలోకి చేరింది. దాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక మతిస్థిమితం లేని వడ్రంగి అత్యంత నైపుణ్యంతో తయారు చేశాడట. అది మూడు భాగాలుగా ఉండేది. ఒక్కో భాగానిది ఒక్కో విలక్షణత్వం. ఎడమవైపు భాగానికి ఇంటి తలుపంత పెద్ద తలుపు! దాని తాళంకప్ప నుంచి వేలాడే పెద్ద తాళంచెవి తుపాకిలా, రాజదండంలా, గదలా– ఇలా రకరకాల ఆటబొమ్మలుగా పనికొచ్చే విధంగా ఉండేది. తన సూట్లను, తను ఎన్నడూ తొడుక్కోని ఇంగ్లీషు కోటును నాన్న ఈ భాగంలో వేలాడదీసేవాడు. గంధపు చెక్కల, కలరా ఉండల సువాసన నిండిన ప్రపంచంలాంటి ఆ వార్డ్‌రోబు లోనికి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఆ తలుపు ద్వారానే వెళ్లాలి. రకరకాల వస్తువులు ఉండే మధ్యభాగం మాకు మూడుభాగాల్లోని అత్యంత ప్రీతికరమైన భాగం. అందులో కిందవైపు నాలుగు పెద్దపెద్ద సొరుగులు. నాన్న చనిపోయిన తర్వాత మా అన్నదమ్ముల్లో ఒక్కొక్కరికి ఒక్కో సొరుగు సంక్రమించింది.  సొరుగులకు పైన ఒక పెద్ద అర. అందులో నాన్నకిష్టమైన పుస్తకాలు దాదాపు ముప్పై ఉండేవి. వార్డ్‌రోబులోని మధ్యభాగానికి ఒక పెద్ద దీర్ఘ చతురస్రాకారపు తలుపు. ఆ తలుపును ఎప్పుడూ తాళంవేసి మూసి ఉంచేవాళ్లు. అందులో ఏముందో మాకెవ్వరికీ తెలియదు. బహుశా కాయితాలు, చిన్నప్పటి ఫొటోలు ఉండవచ్చు. అవి చిరిగిపోతే జీవితంలో కొంత భాగం చిరిగిపోతుందనే భయం వల్ల జాగ్రత్తగా దాచి ఉంటారు. నిజానికి అప్పటికే మేం జీవితంలోని కొంత భాగాన్ని నష్టపోయాం. ఇక కుడివైపు ఉన్న భాగానికి ఇంకో తలుపు ఉండేది. కాని ఆ తలుపుకు ఒక వాలు అంచుల అద్దాన్ని బిగించారు. ఈ భాగంలో కూడా షర్టులు, అండర్‌వేర్ల కోసం కింద సొరుగులు ఉండి వాటి పైభాగాన ఒక మనిషి నిటారుగా నిలబడగలిగేటంత పెద్ద అర ఉండేది.

పైభాగంలో పుస్తకాల అర వెనుక నుంచి ఎడమవైపు భాగాన్ని కుడివైపు భాగంతో కలుపుతూ ఒక పొడవైన ఖాళీ స్థలం ఉండేది. ఎడమవైపు తలుపు ద్వారా లోపలికి దూరి కొన్ని క్షణాల తర్వాత అద్దం ఉన్న కుడివైపు తలుపును తోసుకుని తలను బయటకు పెట్టే ఆట మాకు బాగా నచ్చేది. దాగుడుమూతల ఆట సమయంలో పైభాగంలోని తోవలాంటి ఆ ఖాళీ స్థలం దాక్కోవడానికి మాకు చక్కగా పనికొచ్చేది. అక్కడ దాక్కున్నప్పుడు మా స్నేహితులెవరూ మమ్మల్ని కనుక్కోలేకపోయేవాళ్లు. మేం  వార్డ్‌రోబులో ఉన్నామని తెలిసినా పైకి వెళ్లి కాఫిన్‌లో మాదిరి ఆ మధ్యభాగంలో కాళ్లు చాపి పడుకుని ఉన్నామని వాళ్లు ఊహించలేకపోయేవాళ్లు. మా నాన్న మంచం ఆ వార్డ్‌రోబులోని కుడివైపు భాగానికి సరిగ్గా ఎదురుగా ఉండేది. దిండ్లపై తలను పెట్టుకుని న్యూస్‌పేపరు చదువుకుంటున్నప్పుడు నాన్న తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకోగలిగేవాడు. ఆయన అద్దంలో తనను తాను చూసుకోవడం కన్న ఎక్కువగా పూర్వం అందులో చూసుకున్నవాళ్లను వీక్షించేవాడు.  ‘‘మంత్రివర్గ సమావేశానికి వెళ్లే ముందు ఖ్వాన్‌ ఆంటోనియో రిబేరో ఎస్టాడా తన టైను సరిచేసుకుంటూ ఆ అద్దంలోనే చూసుకున్నాడు’’ అనీ, ‘‘సాన్‌ మార్కోస్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు డాన్‌ రమోన్‌ రిబేరో అల్వారెజ్‌ డెల్‌ విల్లార్‌ ఆ అద్దంలోనే చూసుకున్నాడు’’ అనీ, ‘‘ఎన్నిసార్లు కాంగ్రెస్‌ సమావేశంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు నా తండ్రి డాన్‌ జూలియో రిబేరో బెనైట్స్‌ తయారవుతూ ఆ అద్దంలో తనను తాను చూసుకోలేదూ?’’ అనీ అంటూ ఉండేవాడు మా నాన్న. నాన్న పూర్వీకులంతా ఆ అద్దపు లోతుల్లో బంధింపబడ్డారు. వాళ్ల రూపాలనూ వాటి మీద పడిన తన ప్రతిబింబాన్నీ చూసుకుని ఆ క్షణాన వాళ్లతో కలసి జీవించినట్టు ఊహించుకునేవారు. ఆ అద్దం కారణంగా దివంగతుల ప్రపంచంలోకి మా నాన్న ప్రవేశించేవాడు. అదేవిధంగా తన పూర్వీకులను ఈ బతికి ఉన్న ప్రపంచంలోకి తీసుకొచ్చేవాడు.

 తన వివాహపు రోజు నుంచి నాన్న మద్యపానాన్నీ, స్నేహితులతో కలవడాన్నీ మానేశాడు. అరుదుగా మా తోటలో పళ్లచెట్లు విరగకాసి మరులుగొలిపినప్పుడో లేక మేం అందమైన డిన్నర్‌ సెట్‌ కొన్నప్పుడో నాన్న తన పాత సహచరులను మా ఇంటికి ఆహ్వానించేవాడు. ఆ విధంగా మా ఇంటికి మొదట వచ్చినవాడు అల్బర్టో రికెట్స్‌. ఆయన అచ్చు గుద్దినట్టుగా సరిగ్గా నాన్నలాగే ఉండేవాడు కాని సైజు మాత్రం చాలా చిన్నది. వాళ్లిద్దరు ఒక్కంతే తెల్లగా, ఒక్కంతే బక్కపలచగా ఉండేవాళ్లు. వాళ్లిద్దరూ ఒకరినొకరు కలుసుకుని పది పన్నెండేళ్లయింది. ఈ పది పన్నెండు సంవత్సరాల కాలంలో రికెట్స్‌ ఒక మందుల కంపెనీలో పనిచేసి బాగా ధనవంతుడయ్యాడు. ఇప్పడు ఆ కంపెనీకి ఆయనే యజమాని. మా నాన్నేమో ఎంతో కష్టం మీద మిరాఫ్లోర్స్‌లో ఇల్లు కొనగలిగాడు.

ఈ పది పన్నెండేళ్ల కాలంలో రికెట్స్‌ సాధించినది మరొకటి ఉంది. అదేమిటంటే ఆయనకు ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు అల్బర్టో జూనియర్‌. రికెట్స్‌ మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు తన కొడుకును వెంట తెచ్చాడు. ఇద్దరు స్నేహితులు ఉంటే వాళ్ల పిల్లలు ఒకరితో ఒకరు నిజమైన స్నేహితులుగా ఉండటమన్నది అరుదు కనుక మొదట్లో మేము జూనియర్‌ అల్బర్టోను సందేహించాము. అతడు బక్కపలుచగా, వికారంగా, కొన్నిసార్లు పూర్తి ముభావంగా ఉండటాన్ని గమనించాం మేము. నాన్న తన స్నేహితునితో మా పండ్లతోటలో తిరుగుతూ చీనీ చెట్టును, మేడిచెట్టును సీమరేగు చెట్టును, ఇంకా తీగల చెట్లను చూపిస్తుంటే మేం మా గదిలో ఆడుకోవటానికి జూనియర్‌ అల్బర్టోను మాతో తీసుకువెళ్లాము. ఆ అబ్బాయికి తోబుట్టువులు లేరు కనుక మేం కనిపెట్టి ఆడుకునే ఆటలేవీ అతనికి తెలియవు. ఆటలో రెడ్‌ ఇండియన్‌లా నటించాల్సినప్పుడు ఆ పాత్రను అతడు సరిగ్గా చెయ్యలేదు. ఇక టెన్నిస్‌ రాకెట్‌ను ఆటలో మెషిన్‌గన్‌లా కూడా వాడుకోవచ్చని అతనికి తెలియదు. మాకిష్టమైన ఆటను అతనితో కలసి వార్డ్‌రోబులో ఆడటం దండగని నిర్ణయించడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు. దానికి బదులు నేల మీద బొమ్మకారును నెట్టడం, చెక్కముక్కలతో ఇల్లు కట్టడం వంటి చిన్న చిన్న ఆటలను ఎవరి బొమ్మలతో వారే ఆడుకునేలా మా కాలక్షేపాన్ని సాగించాం.

మధ్యాహ్న భోజన వేళకు ముందు ఆడుకుంటున్న మాకు బయట ఉన్న మా నాన్న, అతని స్నేహితుడూ కిటికీలోంచి కనిపించారు. వివిధ రకాల పూల చెట్లను చూపించడం మిగిలిపోయింది. కనుక అప్పుడు వాళ్లు తోటలో పచార్లు చేస్తున్నారు. తోట పనిలోని ఆనందాన్ని మా నాన్న గుర్తించి అప్పటికి కొన్ని సంవత్సరాలైంది. ఒక పొద్దుతిరుగుడు పువ్వులో లేక గులాబి పువ్వులో గొప్ప జీవిత సత్యం దాగి ఉండటాన్ని గ్రహించాడు మా నాన్న. ఒకప్పుడైతే తీరిక వేళల్లో మా నాన్న విసుగూ అలసటా కలిగించే పుస్తక పఠనం చేస్తూ జీవిత పరమార్థాన్ని గురించి ఆలోచించేవాడు. కాని ఇప్పుడలా కాదు. చెట్లకు నీరు పారించడం, మొక్కల ఆకులను, కొమ్మలను కత్తిరించడం, చెట్లకు అంటుకట్టడం, కలుపు తీయడం చేస్తున్నాడు. పుస్తకాల మీద ఆయనకున్న ప్రేమ ఒకేసారి ఏకమొత్తంగా మొక్కల మీదికి, పువ్వుల మీదికి మళ్లింది. పూర్తి తోటను తయారు చేసి వోల్టేర్‌ నవలలోని ఒక పాత్ర చెప్పినట్టు తన ఆనందమంతా తోటపనిలోంచే వచ్చిందని నిర్ణయించాడు.

‘‘ఏదో ఒకనాడు టార్మాలో భూమి కొని తీరుతాను. కాని ఇట్లాంటి చిన్న ప్లాట్‌ కాదు. పెద్ద ఫామ్‌నే కొంటాను. అప్పుడు నీకు నా తడాఖా తెలుస్తుంది అల్బర్టో’’ అని నాన్న అనటం మాకు వినపడింది.
‘‘టార్మాకు బదులు చాక్లకాయో అయితే ఎలా ఉంటుంది పెరికో? అది లిమా నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాని వాతావరణం మాత్రం లిమాలో ఉన్నట్టే ఉంటుంది’’ అన్నాడు నాన్న స్నేహితుడు. అక్కడ తాను అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద ఇంటిని కడుతున్న విషయాన్ని నాన్నకు చెప్పాడు.‘‘కానీ నా తాత టార్మాలో నివసించేవాడు. చాక్లకాయోలో కాదు కదా’’ అన్నాడు నాన్న.టార్మాలో అయితే నాన్నకు తన పూర్వీకులతో కలసి నివసించినట్టు! నాన్నను తన స్నేహితుడు యవ్వన దశలో పెరికో అని పిలిచేవాడట.అల్బర్టో జూనియన్‌ తన బొమ్మకారును మంచం కిందికి పంపి అక్కడికి పాక్కుంటూ వెళ్లాడు దాన్ని తేవటానికి. అతడు బిగ్గరగా వేసిన గెలుపు కేరింత వినపడింది మాకు. అతనికి మంచం కింద ఫుట్‌బాల్‌ దొరికింది. అతన్ని ఉల్లాసంగా ఉంచడానికి ఎంతగానో యాతన పడుతున్న మాకు ఫుట్‌బాల్‌ ఆడాలనే ఆ ఒంటరి అపరిశుభ్ర బాలుని రహస్యమైన కోరిక తెలిసిపోయింది. అప్పటికే అతడు లేసులతో ఆ ఫుట్‌బాల్‌ను పట్టుకుని దాన్ని తన్నబోయాడు. కాని మేము అతన్ని వారించాం. గదిలో ఫుట్‌బాల్‌ ఆడటం పిచ్చితనమే. తోటలో ఆడటమేమో నిషేధితం. కనుక మాకు వీధిలోకి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోయింది.

ఆ వీధి కొన్నేళ్ల కిందట మేము గోమెజ్‌ సోదరులతో ఆడిన ఉద్వేగపూరిత క్రీడలకు మైదానంగా ఉండేది. ఆ గేములను మేము పూర్తి చీకటి పడేదాకా నాలుగైదు గంటలు ఆడేవాళ్లం. అప్పుడు మాకు ఒకరికొకరు గాని, ప్రత్యర్థులు చేసిన గోల్స్‌ గాని కనపడేవి కావు. ఆట అప్పుడు ఒక దయ్యాల తోపులాటలా ఒక భయంకరమైన చీకటి యుద్ధంలా తయారయ్యేది. అందులో అన్ని రకాల ఫౌల్‌లు, మోసాలు చోటు చేసుకునేవి. పిల్లలమే అయినా మా ఆటల్లో మేము కనబరచినంత కసిని, ప్రగాఢమైన పట్టుదలను లేక ఆత్మాభిమానాన్ని ప్రొఫెషనల్‌ జట్లు కూడా కనబరచి ఉండవు. అందుకే గోమోజ్‌ కుటుంబం వెళ్లిపోయిన తర్వాత మేం ఫుట్‌బాల్‌ ఆటను పూర్తిగా మానేశాం. అలాంటి వర్ణనీయ క్రీడా సమరాల వంటి గేములు మళ్లీ జరగవు అని ఫుట్‌బాల్‌ను మంచం కింద దాచి ఉంచేశాం. ఇప్పుడు జూనియర్‌ అల్బర్టో దాన్ని వెలికితీసే దాకా ఆ ఫుట్‌బాల్‌ మంచం కింద అలానే పడి ఉంది. అతడు కోరుతున్నది ఫుట్‌బాల్‌ ఆట అయితే అతనికి మొహమ్మొత్తేటంతగా ఆడుదామని నిర్ణయించుకున్నాం.మా ఇంటి గోడ ముందు గోల్‌పోస్టు ఉంచాం. ఎందుకంటే గోల్‌ అయినప్పడు బంతి గోడను తాకి వెనక్కి వస్తుంది. జూనియర్‌ అల్బర్టోను గోల్‌పోస్టులో నిల్చోబెట్టాం. మా మొదటి ప్రయత్నాలను అతడు ధైర్యంగానే ఎదుర్కొని గోల్‌ అవకుండా కాపాడాడు. కాని ఆ తర్వాత మేం విజృంభించి ధనాధన్‌ గోల్‌ తర్వాత గోల్‌ చేశాం. ఆ అబ్బాయి నేల మీద పారాడుతూ, కాళ్లూ చేతులూ బార్లా చాపి బంతిని ఆపలేకపోతుంటే అది చూసి మాకు ఆనందోత్సాహాలు కలిగాయి.

తర్వాత గోల్‌ కొట్టడానికి అతని వంతు వచ్చింది. గోల్‌ ఆపడం నా పని. బక్కపలుచగా ఉన్న అతడు బంతిని తన్నుతున్నప్పుడు ఒక కంచర గాడిద తన్నినట్టనిపించింది. మొదటి గోల్‌ను నేను ఆపగలిగాను. కాని తర్వాత కొంతసేపటి దాకా నా అరచేతులు మండాయి. గోల్‌పోస్టు మూలలోకి తన్నిన అతని రెండో గోల్‌ గొప్పది. కాని అతడు చేసిన మూడో గోల్‌ అత్యంత సుందరమైనదీ బ్రహ్మాండమైనదీనూ. ఆ బంతి నా చేతుల మధ్యలోంచి దూసుకుపోయి, గోడపై నుంచి వెళ్లి, మల్లెచెట్టు కొమ్మల మధ్యలోంచి సైప్రెస్‌చెట్టు మీదుగా పోయి, తుమ్మచెట్టు కొమ్మను తాకి అక్కణ్ణుంచి మా ఇంటి లోపలికి అదృశ్యమైంది. ఎప్పట్లాగానే మేము వీధి పేవ్‌మెంట్‌ గట్టుమీద కూర్చుని బంతిని తీసుకొచ్చే పనిమనిషి కోసం నిరీక్షించసాగాం. కాని ఎవరూ రాలేదు. మేం లేచి బంతిని వెతకటానికి వెళ్లాలనుకున్న సమయంలో మా ఇంటి దొడ్డిదారి తలుపును తెరుచుకుని నాన్న వచ్చాడు. అతని చంకలో ఫుట్‌బాల్‌ ఉంది. ఆయన బాగా పాలిపోయి ఉన్నాడు. మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీధి చివరిదాకా నడిచి, ఎదురుగా ఈలవేస్తూ వస్తున్న కూలివాడి దగ్గరకు చేరాడు. ఆ బంతిని వాడి చేతుల్లో పెట్టి మావైపు ఒక్క చూపు కూడా చూడకుండా ఇంట్లోకి వెళ్లిపోయాడు. జరిగిన విషయం అర్థం కావడానికి ఆ కూలివాడికి కొంత సమయం పట్టింది. అర్థం అయిన తక్షణమే వాడు బంతిని తీసుకుని పరుగెత్తడంతో వాణ్ణి పట్టుకునే అవకాశం లేకపోయింది మాకు. 

మధ్యాహ్న భోజనానికి మమ్మల్ని పిలవటం కోసం అమ్మ ద్వారం దగ్గర వేచి ఉంది. ఆమె ఎంత ఆందోళనగా ఉన్నదంటే ఆమెను చూడగానే ఏదో జరగరాని ఘోరం జరిగినట్టు తెలిసిపోయింది మాకు. లోపలికి రావలసిందిగా ఒక తొందరతో కూడిన చిన్న సంజ్ఞ చేసింది. మేం ఆమెను దాటుకుంటూ పోతుంటే ‘‘అలా ఎందుకు చేశార్రా మీరు?’’ అన్నదామె. మా నాన్న గదికి ఉన్న ఒక ఊచలు లేని కిటికీ సగం తెరిచి ఉండటాన్ని గమనించగానే ఏం జరిగి ఉంటుందో మేము ఊహించగలిగాం. జూనియర్‌ అల్బర్టో అద్భుతంగా తన్నిన ఆ బంతి నమ్మశక్యంకాని విధంగా అర్ధచంద్రాకారపు బాటలో పయనించి గోడలు, చెట్లు, ఊచలు మొదలైనవాటిని దాటి వార్డ్‌రోబుకు ఉన్న అద్దానికి సరిగ్గా నట్టనడుమ తగిలింది. అల్బర్టో జూనియర్‌ కాని మరెవరైనా కాని జీవితమంతా ప్రయత్నించినా అట్లాంటి షాట్‌ను మళ్లీ కొట్టడం సాధ్యం కాదు.లంచ్‌ తినడం మాకు ఇబ్బందికరమైంది. అతిథి ముందు మమ్మల్ని తిట్టలేక నాన్న తన కోపాన్ని దిగమింగుకున్నాడు. ఆయన పాటించిన మౌనాన్ని ఛేదించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. భోజనం తర్వాత మేము పండ్లరసాలను తీసుకుంటున్నప్పుడు నాన్న కొంచెం మెత్తబడి మాకందరికీ కొన్ని ఆహ్లాదకరమైన కథలు చెప్పాడు. నాన్న నర్మగర్భంగా చేసిన సూచనను అల్బర్టో గ్రహించడంతో ఆ భోజనాలు నవ్వులతో ముగిశాయి. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ మధ్యహ్న భోజనమేగాక పాత మిత్రుణ్ణి ఆహ్వానించడమనే అరుదైన సదుద్దేశం పూర్తి ప్రహసనంగా మారిన విషయం మా మానసుల్లోంచి చెరగిపోలేకపోయింది.  తండ్రీ కొడుకులిద్దరూ త్వరగానే వెళ్లిపోయారు. నాన్నకు మమ్మల్ని శిక్షించే అవకాశం దొరికిందని మేము భయపడ్డాం. కాని స్నేహితుని రాక వల్ల అలసిపోయి ఆయన మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే పగటి కునుకులోకి జారుకున్నాడు.

నిద్రలోంచి మేల్కొనగానే నాన్న మమ్మల్నందర్నీ తన గదిలో సమావేశపరచాడు. దిండ్ల మీద తలను ఆనించిన ఆయన తాజాగా, ప్రశాంతంగా కనిపించాడు. మధ్యాహ్నపు వెలుతురు గదిలోకి పుష్కలంగా వచ్చేలా కిటికీ తలుపులను బార్లా తెరిచాడు.వార్డ్‌రోబును చూపిస్తూ ‘‘అటు చూడండి’’ అన్నాడు. ఆ దృశ్యం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అద్దాన్ని పోగొట్టుకోవడం ద్వారా వార్డ్‌రోబు తన ప్రాణాన్నే కోల్పోయినట్టు ఉంది. ఇంతకు మునుపు అద్దం ఉండిన చోట ఇప్పుడు కేవలం ఒక నల్లని దీర్ఘ చతురస్రాకారపు చెక్క మాత్రమే ఉంది. అది ఏమీ చెప్పని, దేన్నీ ప్రతిఫలించని దిగులు నిండిన ఖాళీ ప్రదేశం అనిపించింది. తళతళ మెరిసే తటాకపు నీళ్లన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు ఉన్నది ఆ ఖాళీ స్థలం.‘‘నా పూర్వీకులు తమను తాము చూసుకున్న అద్దం అది’’ అని మమ్మల్ని వెళ్లిపొమ్మన్నట్టు చేయి ఊపాడు నాన్న.ఆ రోజు నుంచి మా నాన్న తన పూర్వీకుల గురించిన ప్రస్తావన తేవడం మేమెరుగం. తను అదృశ్యమవుతూ ఆ అద్దం తన పూర్వీకులను కూడా అదృశ్యం చేసింది. గతం మా నాన్నను బాధించడం మానేసింది. పైగా నాన్న తన భవిష్యత్తులోకి కుతూహలంతో చూడనారంభించాడు.బహుశా తనింకా ఎక్కువకాలం జీవించేది లేదని ఆయనకు తెలిసిందేమో! అందువల్ల తన పూర్వీకులను కలుసుకోవడానికి ఆయనకు అద్దపు అవసరం లేకపోయింది. మరో జన్మలో కూడా వాళ్లను కలుసుకోలేననుకున్నాడు. ఎందుకంటే ఆయనకు పునర్జన్మ మీద నమ్మకం లేదు. అతన్ని బంధించిన పుస్తకాల ప్రపంచం, పువ్వుల ప్రపంచంలో కూడా వాళ్లను కలువలేననుకున్నాడు. ఆయనకు అదొక శూన్యం నిండిన ప్రదేశం.
పెరూవియన్‌ కథ : హూలియో రమోన్‌ రిబేరో
 అనువాదం: ఎలనాగ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement