నిదురపుచ్చే కలాచి! | Nidhurapucche kalachi | Sakshi
Sakshi News home page

నిదురపుచ్చే కలాచి!

Published Sun, Aug 2 2015 4:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

నిదురపుచ్చే కలాచి!

నిదురపుచ్చే కలాచి!

‘‘ఏంటి డియర్... పనుండి వెళ్తున్నా. హడావుడిలో నీకు చెప్పలేకపోయాను. చీకటి పడేలోపు నీ ముందు ఉంటాను కదా... టెన్షన్ ఎందుకు?’’... కారు నడుపుతూనే భార్య జరీనాకు సర్ది చెప్తున్నాడు అజ్మల్. ‘‘నువ్వు ఇలాగే అంటావ్ అజ్మల్. కచ్చితంగా త్వరగా రావు. రుబినా వాళ్లు మనకెంతో కావలసినవాళ్లు. వాళ్ల ఇంట్లో ఫంక్షన్‌కి కూడా ఆలస్యంగా వెళ్తే ఏం బాగుంటుంది?’... కినుకగా అంది జరీనా.అజ్మల్ నవ్వాడు. ‘‘నీ బుంగమూతి నాకు కనబడుతుందోయ్. అలిగినప్పుడు భలే ఉంటావ్‌లే’’... అల్లరి పెట్టాడు.‘‘చాలు చాలు. దీనికేం తక్కువ లేదు’’... ఉడుక్కుంది జరీనా.
 
 ‘‘సరే. ఐదున్నరకల్లా ఇంట్లో ఉంటాను. ఇక అలక వదిలెయ్. నేను వచ్చేసరికి రెడీగా ఉండు. నేను రాగానే...’’
 అజ్మల్ మాట మధ్యలో ఆగి పోయింది. ‘‘హలో... హలో...’’... అరి చింది జరీనా. కానీ అవతలి నుంచి అతడి స్వరం వినిపించడం లేదు. అలాగని లైన్ కట్ కాలేదు కూడా. కారు బ్రేక్ వేసిన శబ్దం వినిపించింది. ఇంకా చుట్టుపక్కల నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ అజ్మల్ మాట మాత్రం వినిపించడం లేదు. జరీనా గుండె ఝల్లుమంది. కొంపదీసి ఏదైనా ప్రమాదం జరగలేదు కదా!
 
 ఫోన్ కట్ చేసి మళ్లీ డయల్ చేసింది జరీనా. ఈసారి అజ్మల్ ఫోన్ ఎత్తలేదు. దాంతో జరీనా కంగారు మరీ ఎక్కువై పోయింది. మళ్లీ మళ్లీ చేసింది. నో రెస్పాన్స్. ఆమె గుండె దడదడా కొట్టుకుం టోంది. ఏం చేయాలో పాలుపోలేదు. అక్షత్ గుర్తొచ్చాడు. తను అజ్మల్ తమ్ముడు. ఆ ఊళ్లోనే కాస్తంత దూరంలో ఉంటున్నాడు. అతనికి ఫోన్ చేసి జరిగింది చెప్పింది. ఎందుకో అక్షత్ మనసు కూడా కీడు శంకించింది. అరగంట తిరిగేసరికల్లా వదినగారి ముందు ఉన్నాడు. ఇద్దరూ కలిసి అజ్మల్ కోసం ‘కలాచి’ గ్రామానికి బయలుదేరారు.
    
 కలాచిలో ప్రవేశించి కొన్ని మైళ్లు వెళ్ల గానే రోడ్డు పక్కన కనిపించింది అజ్మల్ కారు. కంగారుగా దాని దగ్గరకు పరు గెత్తారు అక్షత్, జరీనా. డ్రైవింగ్ సీట్లో వెనక్కి ఒరిగి ఉన్నాడు అజ్మల్. ఒంటిమీద దెబ్బలేవీ లేవు. కానీ మనిషి మాత్రం స్పృహలో లేడు. ఎంత లేపినా లేవట్లేదు. ఊపిరి మాత్రం ఆడుతోంది. వెంటనే అతణ్ని తీసుకుని తిరుగు ప్రయాణ మయ్యారు. తమ సిటీకి వెళ్తూనే నేరుగా ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అజ్మల్‌ని పరీక్షించిన డాక్టర్ చెప్పాడు... ‘‘ఎందుకంత కంగారు? ఇతను నిద్రపోతున్నాడంతే.’’ఉలిక్కిపడ్డారు అక్షత్, జరీనా. ‘‘ఏంటీ... నిద్రపోతున్నాడా?’’ అన్నారు ముక్తకంఠంతో. అవునన్నట్టు తలూపాడు డాక్టర్. ‘‘ఇతను వెళ్లింది కలాచికి కదా! అందుకే ఈ నిద్ర’’ అన్నాడు కూల్‌గా.
 
 మళ్లీ అయోమయానికి లోనయ్యారు ఇద్దరూ. కలాచికి వెళ్లడమేంటి? నిద్రపో వడమేంటి? నిజానికి ఈ ఇద్దరికే కాదు. ఇలాంటి షాక్ గత రెండేళ్లలో చాలా మందికి తగిలింది. కలాచి వెనుక ఉన్న మిస్టరీ ప్రపంచం ముందుకు వచ్చింది.

 కలాచి... కజకిస్తాన్‌లోని ఓ గ్రామం. ఐదు వందల కుటుంబాలకు మించి జనాభా ఉండరు. రెండేళ్ల క్రితం ఆ ఊరికి ఓ విపత్తు ముంచుకొచ్చింది. అక్కడి వారు ఉన్నవాళ్లు ఉన్నట్టే నిద్రపోసాగారు. ఒక్క సారి నిద్రలోకి జారుకున్న వారు రోజుల తరబడి నిద్రపోతూనే ఉండేవారు. తీరా మెలకువ వచ్చాక కొందరికి గతం గుర్తుం డేది కాదు. తమ ఇల్లు, తమ వాళ్లు, చివరికి తమ పేరు కూడా మర్చి పోయిన వాళ్లు ఉన్నారు. మెలకువే రాకుండా కోమాలోకి వెళ్లి ప్రాణాలు వదిలినవాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితి అందరినీ హడలెత్తిం చింది. వైద్యులు రంగంలోకి దిగారు. పరిశోధనలు చేశారు. కానీ ఆ పరిస్థితికి కారణమేంటో బోధపడలేదు.
 
 కలాచిని ఆనుకుని ఒక యురేనియం గని ఉంది. దాన్ని ఎప్పుడో మూసేశారు. కానీ దాని మీద నుంచి వచ్చిన కలుషిత గాలిని పీల్చడం వల్ల కానీ, నేలలో ఉన్న యురేనియం నిల్వల వల్ల పెరిగిన రేడి యేషన్ కారణంగా గానీ తమకీ పరిస్థితి వస్తుందేమోనన్నది కలాచి ప్రజల సందేహం. వైద్యులు, అధికారులు మాత్రం అది నిజం కాదంటున్నారు. గాలిలో కార్బన్ మోనాక్సైడ్ నిల్వలు పెరగడం వల్ల ఇలా జరిగిందేమోనంటూ థియరీలు చెబు తున్నారు. తమ వాదనను నిరూపించే ఆధారాలు మాత్రం చూపించలేక పోతున్నారు. దాంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఆ గ్రామస్తులందరినీ వేరే ప్రాంతాలకు తరలించింది. దాంతో కలాచి ఖాళీ అయిపోయింది. అక్కడ వచ్చిన సమస్య ఓ మిస్టరీగా మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement