సంగ్రామం: పోస్టర్ల ప్రపంచ యుద్ధం | Religious Roots of Europe: Method and Theory | Sakshi
Sakshi News home page

సంగ్రామం: పోస్టర్ల ప్రపంచ యుద్ధం

Published Sun, Feb 16 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

సంగ్రామం: పోస్టర్ల ప్రపంచ యుద్ధం

సంగ్రామం: పోస్టర్ల ప్రపంచ యుద్ధం

పద్దెనిమిదో శతాబ్దం ఆఖరికి లితో గ్రాఫిక్ అచ్చు విధానం సంపూర్ణ రూపం తెచ్చుకుంది. ఈ ఆకర్షణీయమైన, రంగుల ప్రచారాస్త్రాన్ని సైన్య విస్తరణకు మొదటిగా యూరప్ పాలకులు గ్రేట్‌వార్ వేళ విస్తృతంగా వినియోగించుకున్నారు.
 
 ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యుద్ధాన్ని నడిపించే దివ్యాస్త్రంగా మారిపోవడం మొదటి ప్రపంచయుద్ధంతోనే ఆరంభమైంది. ఆజ్ఞల కింద అణగారి పోయి ఉండే తన ఆత్మనీ, క్రమశిక్షణకు బందీగా తప్ప ఉండలేని తన ఆలోచననీ కూడా సైనికుడు దానికి అప్పగించవలసి వచ్చింది. నాటి యూరప్ పాలకులు యుద్ధోన్మాదాన్నీ, సామ్రాజ్య కాంక్షనీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో, కళాదృష్టి మాటున యువతరం మెదళ్ల మీదకు ‘దేశరక్షణ’ పేరుతో దాడికి పంపారు. గ్రేట్‌వార్ (మొదటి ప్రపంచ యుద్ధం)లో సైనికుడంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రణభూమిలో ఆడించిన ఓ మరబొమ్మ. ఆ ఆట... గోడల మీద బొమ్మలతో మొదలయింది.  
 
 చూడగానే గగుర్పొడిచేటట్టు శతఘ్ని నోళ్లలా తెల్లని పోస్టర్ మీద నల్లటి పెద్ద పెద్ద అక్షరాలు. లేదా పసుపు రంగు బ్యాక్‌డ్రాప్‌తో రక్తవర్ణ అక్షరాలు- ‘బ్రిటన్ నీ సేవ కోరుతోంది! వెంటనే సైన్యంలో చేరు!’ అంటూ. ఇలాంటి నినాదాలతో బ్రిటన్ అంతటా ఏ మూల, ఏ గోడ చూసినా 1914 సెప్టెంబర్ నాటికి వాల్‌పోస్టర్లు వెలిశాయి. గ్రేట్‌వార్‌కు లక్షల కొద్దీ సైన్యాన్ని పంపదలిచిన, పంపిన ప్రతిదేశంలోను- బ్రిటన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా...  ఇలాంటి 5.4 కోట్ల పోస్టర్లను 200 రకాల డిజైన్లలో ముద్రించి గోడల నిండా అతికించాయి. కళాకారుల నేర్పు మేరకు వాటికి రకరకాల ఆకృతులు. అన్నీ యుద్ధంలో చేరమంటూ పిలుపునిచ్చినవే. యుద్ధం చేస్తున్న సొంత దేశం ఆర్థిక వనరుల కోసం బాండ్లు కొనమని కోరినవే. యుద్ధ వ్యయానికి ప్రజల నుంచే రుణాలు సేకరించారు. అందుకు హామీగా ఇచ్చిన పత్రాలకు ‘లిబర్టీ బాండ్లు’ అని పేరు పెట్టారు.
 
 పద్దెనిమిదో శతాబ్దం ఆఖరికి లితో గ్రాఫిక్ అచ్చు విధానం సంపూర్ణ రూపం తెచ్చుకుంది. ఈ ఆకర్షణీయమైన, రంగుల ప్రచారాస్త్రాన్ని సైన్య విస్తరణకు మొదటిగా యూరప్ పాలకులు గ్రేట్‌వార్ వేళ విస్తృతంగా వినియోగించుకున్నారు. రెండడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు ఉండే ఈ పోస్టర్లు ఇప్పటికీ యూరప్‌లో కొన్నిచోట్ల భద్రంగా ఉన్నాయి. విలియం రెడీ అనే వ్యక్తి వ్యక్తిగత గ్రంథాలయంలోనే యాభయ్ వరకు ఇవి ఉన్నాయి. అల్ఫోన్సో మచా, టులోజ్ లాట్రెక్, లీటెన్ వంటి కళాకారులు ఈ ప్రక్రియకు ఎంతో ఆకర్షణనూ, ప్రచారాన్నీ తెచ్చారు.
 
 ‘బ్రిటన్ పిలుస్తోంది!’ అన్న నినాదంతో ఉన్న పోస్టర్ మీద అడవి దున్న కొమ్ములను గుర్తుకు తెస్తున్న మీసాలతో ఒక మొహం దర్శనమిస్తుంది. అది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లండ్ ప్రభుత్వ యుద్ధ కార్యదర్శిగా నియమితుడైన హొరాషియో హెర్బర్ట్ కిష్నర్‌ది. అతడే ఫీల్డ్‌మార్షల్ లార్డ్ కిష్నర్. ఇతడు ఎవరో కాదు. బెంగాల్‌ను విభజించిన కర్జన్ (1899-1905) కాలంలో భారతదేశానికి వచ్చి, 1909 వరకు సర్వసైన్యాధ్యక్ష పదవిని నిర్వహించినవాడే. 1911-14 మధ్య కిష్నర్ ఈజిప్ట్ కౌన్సిల్ జనరల్‌గా ఉన్నాడు. యుద్ధం ప్రారంభం కాగానే ప్రధాని హెర్బర్ట్ హెన్రీ ఏస్క్విత్ యుద్ధ కార్యదర్శిగా లార్డ్ కిష్నర్‌ను నియమించాడు. ఆగస్టు 4న జర్మనీ మీద బ్రిటన్ యుద్ధం ప్రకటించిన తరువాత ఆరో తేదీన పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని ఇతడే. కర్జన్‌కూ బ్రిటన్ యుద్ధ కేబినెట్‌లో చోటు దక్కడం మరో విశేషం. నిజానికి ఇంగ్లండ్‌లో చాలామంది, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలలో కూడా క్రిస్మస్ నాటికి (1914) యుద్ధం ముగిసిపోతుందని అంచనాకు వచ్చారు. కానీ అది సాధ్యం కాదని ఊహించినవాడు కిష్నర్. అందుకు సాక్ష్యం అతడి సైనిక సన్నాహం. తర్జని చూపుతూ కిష్నర్ ముఖంతో ప్రచురించిన వాల్‌పోస్టర్ అంత సంచలనం సృష్టిస్తుందని అతడు కూడా ఊహించలేదు. మోన్స్ యుద్ధంలో ఇంగ్లండ్ పలాయనం చిత్తగించే సమయానికి బ్రిటిష్ సేన ఇరవై డివిజన్లు. దీనిని కిష్నర్ 70 డివిజన్లకు పెంచాడు. బ్రిటిష్ సర్వసైన్యాధ్యక్షుడు సర్ జాన్‌ఫ్రెంచ్‌కు మించి ఇతడికి పలుకుబడి ఉండేది. కిష్నర్ అప్పుడు ఇంగ్లండ్‌కు ఆరాధ్యదైవం.
 
  ‘‘కిష్నర్ పిలుపునిచ్చిన తరువాత యుద్ధానికి రావాలి కాబట్టి సైన్యంలో చేరాను’’ అని టామీ గ్రే అనే బాల సైనికుడు ఒక ఉత్తరంలో రాయడమే ఇందుకు నిదర్శనం. గ్రే వయసు పదహారేళ్లు. కానీ పద్దెనిమిదేళ్లని అబద్ధం చెప్పి మరీ సైన్యంలో చేరాడు. ఇలా కొన్ని లక్షల మంది కుర్రాళ్లు యుద్ధంలో చేరిపోయారు. ఇతడి పిలుపుతోనే యుద్ధం ముగిసే నాటికి బ్రిటన్ పౌరులు ప్రతి నలుగురిలో ఒకరు యుద్ధానికి వెళ్లారు.  
 యుద్ధం ఆరంభం అయ్యే నాటికి బ్రిటన్ సైన్యం 7,10,000. ఇందులో రెగ్యులర్ సైనికులు 80,000. వీరే సదా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. మోన్స్ ఓటమి దేశాన్ని కుదిపేసింది. తరువాతే మరో ఐదు లక్షల సైన్యం కావాలని, అర్హులంతా యుద్ధంలో చేరాలని పార్లమెంట్ చేత కిష్నర్ పిలుపునిప్పించాడు. ఎంపిక కోసం ఒక పార్లమెంటరీ కమిటీనే నియమించేటట్టు చేశాడు. ఆ పిలుపు ఒక ప్రభంజనంలా దేశాన్ని తాకిందంటే అతిశయోక్తి కాదు. ఒక దశలో రోజుకు సగటున 33,000 మంది సైన్యంలో చేరారు. అనుకున్నట్టే ఐదు లక్షల మంది స్వచ్ఛందంగా దేశం కోసం యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం అయిపోయిన తరువాత వీరికీ సైన్యానికీ సంబంధం ఉండదు. వీరినే ప్రైవేటు సైనికులు అనేవారు.
 
 కిష్నర్ పిలుపు బ్రిటన్‌ను ఎంతగా ప్రభావితం చేసిందంటే, యుద్ధంలో చేరడానికి ఏ కొన్ని అర్హతలు కనిపించినా అలాంటి యువకులకి ఎవరూ ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. సైన్యంలోకి వెళ్లమని ఒత్తిడి చేసేవారు. హ్యారీ లాడర్ అనే ఒక గాయకుడు దేశమంతా తిరుగుతూ పాటల ద్వారా సైన్యంలో చేరమని ప్రచారం చేసేవాడు. ఆ పాటలతో ఉత్తేజితులై కొందరు యువకులు ముందుకు వచ్చేవారు. వాళ్లని వేదిక ఎక్కించి తాను సైన్యంలో చేరుతున్నట్టు ప్రకటన ఇప్పించేవాడు. ఇలా మొదట వచ్చిన కుర్రాడికి పది పౌండ్లు బహుమానం ఇచ్చేవాడు. ఇంకొక గాయకుడు మారీ లాయిడ్ ఒక పాట రాశాడు. ‘యుద్ధంలో చేరకముందు నువ్వంటే నాకు అనిష్టం. ఇప్పుడు ఒంటి మీదకు  ఖాకీ దుస్తులు వచ్చాయి. నిన్ను తప్పక ప్రేమిస్తా!’ ఇదీ పాట.
 
 ఇక ఆ పోస్టర్ల మీద ఒక విహంగ వీక్షణం: సైనిక జనరల్ పెట్టుకునే టోపీని ముద్రించి దానికి పైన, కింద అక్షరాలు రాశారు. ఇలా-‘ఈ టోపీ నీ తలకు సరిపోతే, ఈ రోజే యుద్ధంలో చేరు!’ ఇటలీ వేయించిన ఒక పోస్టర్‌లో జర్మన్ చాన్సలర్ విల్‌హెల్మ్ భూగోళాన్ని పండులా కొరుక్కుతింటున్నట్టు చిత్రించారు. రక్తసిక్త బ్రిటిష్ సైనికుడి శవాన్ని భుజం మీద వేసుకుని ప్రళయభీకరంగా అరుస్తూ  వస్తున్న ఒక భల్లూకాన్ని చిత్రించి, ‘ఈ ఉన్మాద పీడిత మృగాన్ని నాశనం చేయండి! సైన్యంలో చేరండి!’ అంటూ ఇంగ్లండ్ మరో పోస్టర్‌ను ముద్రించింది. ఆ భల్లూకం జర్మనీకి ప్రతీక. ‘అమెరికా వైమానికదళంలో చేరు. అమెరికా మృగరాజువనిపించుకో’ అని మరో పోస్టర్‌లో కనిపిస్తుంది. యుద్ధ రంగం నుంచి ఒక సైన్యాధికారి ఫోన్ చేస్తున్నట్టు మరో పోస్టర్ కూడా ముద్రించారు. ‘మరింత సేనను పంపండి!’ అని ఆ అధికారి అంటూ ఉంటాడు. కింద వ్యాఖ్య ఇది: ‘ఈ పిలుపునకు స్పందించవలసిన అవసరం లేదా?’
 
 బాయ్స్ స్కౌట్స్ వ్యవస్థాపకుడు బేడెన్‌పాల్ తయారు చేయించిన ఒక పోస్టర్ గురించి కూడా పేర్కొనాలి. ‘బాలల్లారా! బాలికల్లారా! మీ అంకుల్ శామ్ యుద్ధంలో విజయం సాధించడానికి మీరూ సహకరించగలరు’ అన్న నినాదంతో దీనిని రంగుల్లో ముద్రించారు. ఇంగ్లండ్ ముద్రించిన ఒక పోస్టర్‌లో, ఏసుక్రీస్తు జర్మనీని వీడి వస్తున్నట్టు చిత్రించారు. మా భూమిని వీడి వెళ్లవద్దంటూ చాన్సలర్ విల్‌హెల్మ్ కింద పడి రోదిస్తున్నట్టు కూడా చిత్రించారు.
 
 జర్మనీ పోస్టర్లు మరింత ‘కళాత్మకం’ అని పేరు తెచ్చుకున్నాయి. డేవిడ్ పోలాక్ అనే కళాకారుడు వీటిని తయారు చేశాడు. నిజానికి జర్మనీకి ప్రత్యేకంగా సైనికులను నియమించుకోవలసిన అవసరం లేదు. ఏప్రిల్ 16, 1871న అమలులోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రతి జర్మన్ పౌరుడు జీవితకాలంలో మూడేళ్లు సైన్యంలో పనిచేయడం అనివార్యం. 17-45 సంవత్సరాల మధ్య ఏదో ఒక కాలంలో ఈ బాధ్యతను పూర్తిచేయవలసిందే. సాంకేతిక పరిజ్ఞానం రీత్యా 1900 నాటికి జర్మన్ సేన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం. సంఖ్యాపరంగా పెద్ద సైన్యం రష్యాది.
 - డా॥నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement