ప్రధాని మోదీ అజేయుడు అనే భావన ఇప్పుడు రాజ్యమేలుతున్నట్లుంది. పేదప్రజలతో మోదీ కుదుర్చుకున్న సామాజిక బంధం, చేష్టలుడిగిన ప్రతిపక్షమే దీనికి కారణం. సంక్షేమతత్వం, జాతీయ భద్రతపై స్థిరమైన వాదం, మోదీపై అవధులు మీరిన వ్యక్తిగత ఆరాధన కేంద్రంగా సాగిన తాజా రాజకీయ క్రీడలో కాంగ్రెస్‌ని మట్టికరిపించామని మోదీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఓటమైనా, గెలుపైనా రాజకీయాలలో పాఠాలు నేర్చుకోవడానికి తక్షణ సాక్ష్యాలే మంచి మార్గాలు. మోదీ ఇప్పుడు తిరుగులేని విజేత కావచ్చు. కానీ, తాను అవతార పురుషుడేమీ కాదు. 2014లో మోదీ అఖండ విజయం సాధించిన తరువాత ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ 67 స్థానాలు సాధించారు. అందుకు కారణం అప్పుడు ఆప్‌కు ఉన్న గొప్ప ఆలోచనే. అటువంటి రాజకీయ మార్పిడి జరగాలంటే కీలకమైన శస్త్ర చికిత్స అవసరం, హోమియోపతితో కుదరదు.
మన క్రికెట్ జట్టు కిట్ రంగుపై కూడా పరస్పరం పోట్లాడుకునేంతగా మన సమాజం నిలువుగా చీలిపోయి ఉన్న కాలంలో కూడా నరేంద్ర మోదీ అభిమానులు, విమర్శకులు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉంటున్నారు. అదేమిటంటే, ప్రధాని నరేంద్రమోదీ అజేయుడు. ఇప్పుడే కాదు, సమీప భవిష్యత్తులో కూడా. వచ్చే పాతికేళ్ల వరకు తమ అధికారం చెక్కుచెదరదని మోదీ అభిమానుల భావన. 1952–1989 మధ్యకాలంలో కాంగ్రెస్ పాలనకు సమానంగా బీజేపీ పాలన ఉండబోతోందన్నది వీరి అభిప్రాయం. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనకు 1977–79లో మాత్రమే తాత్కాలికంగా విరామం ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం భారత్ లౌకిక వామపక్షంగా కొనసాగినట్లే దేశగతిని మార్చే అలాంటి అవకాశమే ఇప్పుడు తమకు వచ్చిందని జాతీయ మితవాదులు చెబుతున్నారు. పాత సామాజిక–రాజకీయ సమీకరణాలు ప్రత్యేకించి కఠినతరమైన లౌకికవాదం ఎంత బలహీనమై చేవకోల్పోతూ వచ్చాయో కేవలం ఐదేళ్ల తమ పాలనలోనే జాతీయ మితవాద పక్షం నిరూపించేసింది. పైగా లౌకికవాదాన్ని, సంక్షేమవాదాన్ని పాత వామపక్షం నుంచి లాక్కుని, పేద ప్రజలు తమకు ఓట్లు వేసే విధంగా మరింత సమర్థంగా వాటిని మలుచుకోవడం ఎంత సులభమో మితవాద పక్షం చేసి చూపించింది. పదేపదే మెజారిటీ సాధించటంతో తమ సైద్ధాంతిక లక్ష్యసాధనను 2015 నాటికే అంటే మోదీ మూడో దఫా పాలన ప్రారంభం నాటికే పరిపూర్తి చేయగలగమని మితవాద పక్షం భావిస్తోంది. తాము విశ్వసిస్తున్న హిందూ రాష్ట్ర బావనకు అనుగుణంగా భారత్‌ను పూర్తిగా మార్చాలనే తమ లక్ష్యాన్ని వచ్చే ఆరేళ్లలో సాధించేస్తామని వీరి నమ్మిక. ఆనాటికి ఆరెస్సెస్‌ను స్థాపించి సరిగ్గా వందేళ్లవుతుంది కూడా.
గతంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ సాధించిన విధంగా భారతీయ పేద ప్రజానీకంతో తాము ఒక సామాజిక బంధాన్ని ఏర్పర్చుకున్నామని మోదీ అభిమానులు ఇప్పుడు నమ్ముతున్నారు. హిందూ జాతీయవాదం దన్నుతో కాకుండా సంక్షేమవాదం, జాతీయ భద్రతపట్ల ఉద్వేగం, మితిమీరిన వ్యక్తిగత ఆరాధన ద్వారా తాము కాంగ్రెస్ పనిపట్టామని వీరి భావన. వాస్తవానికి ఇవి కాంగ్రెస్ సొంత లక్షణాలు. వీటిని తామే ఇప్పుడు ఉత్తమంగా సాధిస్తున్నట్లు వీరు భావి స్తున్నారు. తమకు ఓటు వేయనందుకు ఓటర్ల పట్ల ప్రతిపక్షం ప్రదర్శిస్తున్న ఆవేశం, ఆగ్రహంలోంచి ప్రస్తుతం దాని మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. మోదీ గెలిచారు కానీ భారత్ ఓడిపోయిందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇక కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇతరుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఉదాహరణకు, కర్ణాటకు సీఎం కుమారస్వామి రాష్ట్రంలో ఉద్యోగాలు కోరుకుంటున్న వారిపై విరుచుకుపడ్డారు. ‘మీరు మోదీకి ఓటు వేశారు కదా.. మీకు కావలసిన ఉద్యోగాలకోసం మోదీనే అడగండి’. ఇది దివాళాతనానికి సరైన సంకేతం.
మరోవైపున మాయావతి తన ఓటమికి తనతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ యాదవే కారణమని ఆరోపించారు. బీఎస్పీ అధినేత ఇప్పుడు చాలా భయాందోళనల్లో మునిగి ఉంటున్నారు. మమతా బెనర్జీ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే మరి. అన్నీ ముగిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఫ్రంట్‌లో భాగమై తనతో చేతులు కలపడానికి రావలసిందిగా మమత కాంగ్రెస్, వామపక్షాలకు పిలుపునివ్వడం నైతికంగా దివాళాకోరుతునానికి సరైన నిదర్శనం. దీంతో మమతా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదనే అభిప్రాయానికి వచ్చేసినట్లు అందరికీ తెలిసిపోయింది. ఇక వామపక్షం, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్ వంటివారిని లెక్కపెట్టవలసిన అవసరం లేదు. మోదీని జయించడం అసాధ్యం అనే మానసిక స్థితిలో ప్రతిపక్షం కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి వనరుల వినియోగంలో 95:5 ఆధిక్యతను సాధించడంలో, సంస్థలపై, మీడియాపై పూర్తి పట్టును సాధించడంలో మోదీ అసాధారణ స్థాయికి చేరుకున్నారు. చారిత్రకంగా రాజీవ్ గాంధీ అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇలాగే ఉంటూ వస్తోంది. తనను తిరస్కరించిన ప్రజల పట్ల ఆ పార్టీ ఎంత ఉద్రేకంతో, ఘర్షణాత్మకంగా వ్యవహరిస్తోందంటే, అదే ప్రజల వద్దకు వెళ్లి తనను ఎందుకు తిరస్కరించారు అని అడగటానికి కూడా అది ధైర్యం చేయడం లేదు.
ఓటర్లు తమ పట్ల ప్రదర్శించిన ఈ ‘మూర్ఖత్వం’ పట్ల కాంగ్రెస్ చాలా ఆగ్రహంతో ఉంది. ‘ఓకే మిత్రులారా, మీరు మమ్మల్ని కోరుకోవడం లేదు కాబట్టి కృతజ్ఞత లేని మీలాంటి వారి అవసరం మాకూ లేదు’. తన కంచుకోట అమేధీలో అనూహ్యంగా పరాజయం పాలైన రాహుల్ గాంధీ ఐదువారాల తర్వాత కూడా ఆ నియోజకవర్గానికి తన ముఖం చూపించడానికి ఇష్టపడడం లేదంటేనే ఇంతకు మించిన భుస్వామి తరహా ఆగ్రహం మరొకటి ఉండబోదు. రాజకీయంగా తాము మళ్లీ పుంజుకుంటాం అని సవాలు విసిరే శక్తి ప్రతిపక్షంలో పూర్తిగా నశించిపోయింది. దాని స్థానంలో ప్రతిఘటన అనే అమూర్త భావన ప్రస్తుతం ముందుపీఠిలో ఉన్నట్లుంది. మోదీని ఇప్పట్లో ఓడించడం అసాధ్యమని ఆయన మద్దతుదారులు, వ్యతిరేకులు భావిస్తుండటం సరైనదే అయినట్లయితే, దీనికి తొలి బాధితులుగా మిగిలేది మనలాంటి రాజ కీయ వ్యాఖ్యాతలే. వాస్తవం ఏదంటే రాజకీయాలు సుదీర్ఘకాలం స్తంభిం చిపోవు లేక నిస్తబ్దతలో కూరుకుపోయి ఉండవు. అది చాలావరకు చక్రీయంగానే ఉంటుంది. అయితే ఆ చక్రం కింది నుంచి పైకి పైనుంచి కిందికి స్థానం మార్చుకోవడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. నెహ్రూ– గాంధీ వంశపరిపాలన కాలంలోనూ జరిగింది ఇదే కదా.
విజయాన్ని లేక పరాజయాన్ని చాలా త్వరగా ప్రకటించుకునే స్వీయ విధ్వంసకత్వానికి సంబంధించిన అనేక ఉదాహరణలకు ప్రజాస్వామిక వ్యవస్థలు సాక్షీభూతాలుగా నిలిచి ఉన్నాయి. కానీ వీటిలోనూ ఓటమిని అంత సులువుగా అంగీకరించని వారు చాలా మంది ఉన్నారు. వారు పరాజయానికి సంబంధించిన షాక్‌ను తట్టుకుని ఓటములనుంచి గుణపాఠాలు నేర్చుకుని తమ సహనంతో తమనుతాము పునర్నిర్మించుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఒకవైపు, అడ్వాణీ–వాజ్‌పేయిల నేతృత్వంలో బీజేపీ సాధించిన విజయాలు ఒకవైపు దీనికి చక్కటి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఇందిరాగాంధీ ఘోరపరాజయం అనంతరం కేవలం రెండున్నరేళ్ల కాలంలో తననుతాను పునర్నిర్మించుకోగలిగింది. ఆమె చాలా స్వల్ప కాలంలోనే, ఓటమి కలిగించిన షాక్ నుంచి కోలుకున్నారు. జాతీయ భద్రత విషయంలో జనతా ప్రభుత్వం బలహీనతను పసిగట్టిన వెంటనే దానిపై ఆమె దాడి ప్రారంభించి విజయం సాధించారు. కాబట్టే 1980 ఎన్నికల్లో భారతీయ జనసంఘ్‌తో కలిసిన జనతా పార్టీ అవమానకరమైన రీతిలో ఓటమికి గురికాగా, ఇందిరాగాంధీ అద్భుత విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చారు. అలాగే 1980లో పరాజయం పాలైన తమ శ్రేణులను వాజ్‌పేయి, అడ్వాణీలు సంఘటితం చేసి భారతీయ జనతా పార్టీగా నూతనపార్టీని పునర్నిర్మించారు. కానీ నాలుగేళ్ల వ్యవధిలో అంటే 1984 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ప్రభంజనం ముందు కొట్టుకుపోయి రెండే రెండు పార్లమెంటు స్థానాలతో మిగిలిపోయారు.
కానీ, అడ్వాణీ, వాజ్‌పేయి తలలు వేలాడేయలేదు. తమ బలహీనతలను తెలుసుకునే వినయంతో తలలు దించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు రాజీవ్ 414 స్థానాలు గెలుచుకున్న సంగతి గుర్తు చేసుకోండి. మోదీ ఇప్పటికీ 303 స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు. మూడేళ్లు తిరిగేసరికల్లా అదే ప్రతిపక్షం రాజీవ్ చేష్టలుడిగే స్థితికి చేర్చింది. అందుకు రాజీవ్ తప్పులు కూడా సహాయపడ్డాయి. కానీ, ప్రతిపక్షం.. ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్ లోపల, వెలుపల చక్కగా పనిచేసింది. కాంగ్రెస్ లోని అసమ్మతివాదులతో, ఇతర ప్రతిపక్ష నేతలను కూడగట్టడంతోపాటు కార్యకర్తలతో కలిసి పనిచేసింది. అప్పుడే బోఫోర్స్, ఇతర కుంభకోణాలపై మీడియా హోరెత్తించింది. కాంగ్రెస్, సోషలిస్టులకు అవకాశం లేకుండా రామమందిరం, హిందూత్వ నినాదంలను చేపట్టడమే 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి అసలు కారణం. మీరు దీనిని వ్యతిరేకించొచ్చు. కానీ, ప్రత్యామ్నాయంగా ఒక గొప్ప ఆలోచన కావాలి. 35 ఏళ్లు పట్టినప్పటికీ గతంలో కాంగ్రెస్ మాదిరిగానే ఇప్పుడు బీజేపీ బలంగా నిలబడింది. ఓటమి అయినా గెలుపైనా రాజకీయాలలో పాఠాలు నేర్చుకోవడానికి తక్షణ సాక్ష్యాలే మంచి మార్గాలు. మోదీ ఇప్పుడు తిరుగులేని విజేత కావచ్చు. కానీ, తానూ మనిషే–అవతారపురుషుడేమీ కాదు. 2014లో మోదీ భారీ విజయం సాధించిన తరువాత ఢిల్లీలో కేజ్రీవాల్ 67 స్థానాలు సాధించారు. అప్పడు ఆప్‌కు ఉన్న గొప్ప ఆలోచనే కారణం. అటువంటి రాజకీయ మార్పిడి జరగాలంటే కీలకమైన శస్త్ర చికిత్స అవసరం, హోమియోపతితో కుదరదు.
ప్రస్తుతం క్రికెట్ సీజన్ నడుస్తోంది కాబట్టి మోదీ గురించి అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఒక విశ్లేషణను మీకు గుర్తు చేస్తా. వివియన్ రిచర్డ్స్ బౌలర్లపై చిన్నచూపుతో బ్యాటింగ్ చేయడానికి ఎలా వస్తాడో, మోదీ కూడా శాంతంగా పార్లమెంట్లోకి అడుగుపెడతారు. రిచర్డ్స్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్ క్రికెట్ బృందం ఒక పరిష్కారాన్ని కనుగొంది. దగ్గరగా, రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. అతడు ఎలాగైనా కొట్టనీ, ఆ బంతిని అడ్డుకోవడమే. అతడికి విసుగొచ్చి తప్పుచేసే వరకూ అదే ఎత్తుగడ అనుసరించింది. అంతులేని సహనం, ఆత్మరక్షణ, ఎదుటివారు తప్పు చేసే వరకూ ఎదురు చూడటం ఒక ఎత్తుగడ. అందుకు మొదట కావలసినది తెలివితేటలకంటే ధైర్యమూ, దృఢచిత్తమే.
శేఖర్ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
twitter@shekargupta
ప్రధాని అంత అజేయుడా?
Published Sat, Jun 29 2019 12:19 AM | Last Updated on Sat, Jun 29 2019 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment