ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వేస్‌కు సంక్రాంతి కళ వచ్చేసింది. దూర ప్రాంతాలకు టికెట్లన్నీ అడ్వాన్స్‌గా బుక్ అయిపోవడంతో పండుగకు ఇంటి వెళ్లాలనుకునే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్లీజ్.. ఒక్క టికెట్! అని బతిమలాడుకోవాల్సి వస్తోంది. ఇదే అదనుగా టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఆర్టీసీ ‘స్పెషల్’ పేరుతో అదనపు చార్జీ వసూలు చేస్తుంటే, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల టికెట్ ధరలు మూడింతలకు పెరిగాయి. మేమేమైనా తక్కువా అన్నట్లుగా రైల్వేస్ కూడా ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచేయడంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు.
ఎస్‌వీఎన్‌కాలనీ / పాత గుంటూరు : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. ఉద్యోగ, వ్యాపార, ఇతరత్రా అవసరాల రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సొంతూరు వెళ్లాలని అనుకునే పండుగ. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో టికెట్లన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయి. ఇప్పటికిప్పుడు టికెట్ కొనుక్కుని వెళ్లాలనుకునే వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ చెబుతున్న ధరలు విని సగటు ప్రయాణికుడు బేజారవుతున్నాడు. ఇదే అదనుగా ఆర్టీసీ కూడా స్పెషల్ సర్వీస్ పేరుతో బస్సులు నడుపుతూ అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. రైల్వే శాఖ కూడా పండగ రోజుల్లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచేసింది.
ఆగని దోపిడీ....
జిల్లా ఆర్టీసీ అధికారులు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు 350, హైదరాబాద్ నుంచి వచ్చేందుకు 330 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే, బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చేందుకు 40, వెళ్లేందుకు 45 బస్సులు వేశారు. చెన్నై నుంచి గుంటూరుకు వచ్చేందుకు 60, వెళ్లేందుకు 70 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, వీటిలో టికెట్లు ఇప్పటికే రిజర్వేషన్ అయిపోయాయి. కొన్నింట్లో మాత్రమే నామమాత్రంగా అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాలకు తక్కువ సంఖ్యలో బస్సులు ఉండటంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ధరలు విపరీతంగా పెంచేశారు. అలాగే, పండగ సీజన్‌లో రీజియన్‌లోని 13 డిపోల నుంచి దాదాపు 448 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఇవి చాలకపోవడంతో సిటీ సర్వీసులను ఎక్స్‌ప్రెస్, లగ్జరీ సర్వీసులుగా మార్చేసి నడిపేందుకు సిద్ధమయ్యారు. వీటిలో చార్జీలు అదనం అని వేరే చెప్పక్కర్లేదు.
రైళ్లదీ అదే తీరు..
సంక్రాంతి పండుగకు 6 రోజులపాటు వరుస సెలవులు రావడంతో రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దూర ప్రాంతాలు వెళ్లే రైళ్ల టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. కొన్నింట్లో వెయింటింగ్ లిస్టు 200 వరకు ఉంటే, మరికొన్నింట్లో ఏకంగా రిగ్రెట్ అని వస్తోంది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వరకు రెండు సువిధ సూపర్‌ఫాస్ట్ రైళ్లు, రెండు ప్రీమియం రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇదే అదనుగా డైనమిక్ ఫేర్ పేరుతో మూడు రెట్లు చార్జీ వసూలు చేస్తున్నారు. ఈ ధరలు సమయాన్ని బట్టీ మారిపోతుండటం గమనార్హం. సందట్లో సడేమియా అన్నట్లు రైలు టికెట్లు బుక్ చేసే ప్రయివేటు ఏజెన్సీల దోపిడీ సైతం పెరిగిపోయింది. ఇక రిజర్వేషన్ లేని ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఏ రైలులోనూ ఖాళీ దొరకకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. పనిలో పనిగా ఫ్లాట్‌పాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచి రైల్వే శాఖ అదనపు ఆదాయం కోసం ప్రయాణికులపై భారం వేసింది.
Comments
Please login to add a commentAdd a comment