పైన పటారం...
‘బెస్ట్ కాలనీ’ సరిహద్దులో వరెస్ట్
వినయ్‌నగర్ కాలనీ బస్టాండ్‌లో డ్రైనేజ్ సమస్య
40 ఏళ్ల నాటి వ్యవస్థతో పదేళ్లుగా ఇబ్బందులు
250 మీటర్లు మార్చేందుకు జలమండలి కక్కుర్తి
సిటీబ్యూరో: అది సైదాబాద్‌లోని ఐఎస్ సదన్ చౌరస్తాను ఆనుకుని ఉన్న వినయ్‌నగర్ కాలనీ... గతేడాది బెస్ట్ కాలనీగా ఎంపికై బల్దియా నుంచి రూ.10 లక్షల నజరానా అందుకుంది. అయితే కాలనీ లోపల హుందాగానే ఉన్నా సరిహద్దులో మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ దుర్భరంగా మారింది. దాదాపు 40 ఏళ్ల నాటి పైప్‌లైన్‌ను కేవలం 250 మీటర్ల మేర మర్చడంలో ప్రభుత్వ విభాగాల కక్కుర్తితో 10 ఏళ్లగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ సంఘం ఆరోపిస్తోంది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని మసీదు/దేవాలయం నుంచి దాదాపు 250 మీటర్ల మేర ఏళ్ల నాటి డ్రైనేజ్ పైప్ లైనే ఉంది. ఈ ప్రాంతంలో పదేళ్లుగా వాణిజ్య, నివాస సముదాయాలతో పాటు వసతిగృహాలు పెరగడంతో వాటి నుంచి బయటకు వచ్చే మురుగునీరు ఎన్నో రెట్లు పెరిగింది. చౌరస్తా నుంచి చంపాపేట్ వెళ్లే సాగర్ హైవే. వినయ్‌నగర్ కాలనీ సరిహద్దుల్లోనే ఇబ్రహీంపట్నం/దేవరకొండకు వెళ్లే బస్సులు నిలిపే బస్టాప్ సైతం ఉంది. ప్రధానంగా రద్దీ వేళల్లోనే పాత పైప్‌లైన్ కారణంగా మ్యాన్‌హోల్స్ పొంగి బస్టాండ్‌తో పాటు రహదారిని ముంచెత్తుతోంది.
దీంతో ప్రయాణికులు అవస్థలుఎదుర్కొంటున్నారు. ఐఎస్ సదన్ చౌరస్తా వెంబడి జీవనం సాగించే చిరువ్యాపారులు, ఆటో స్టాండ్‌కు ఆటో ఎక్కేందుకు వచ్చే స్థానికులు మురుగు నీటిలోంచే వెళ్లాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని ‘ఏడేళ్లుగా ఈదీబజార్‌లోని జలమండలి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటి వరకు అధికారులు కనీసం ఎస్టిమేట్స్ కూడా తయారు చేయలేదు. సోమవారం చంద్రాయణగుట్టలోని జలమండలి జనరల్ మేనేజర్ నాగేంద్రకుమార్‌ను కలిశాం. గరిష్టంగా మూడు రోజుల్లోపు అంచనాలు తీయారు చేయాల్సిందిగా ఈదిబజార్ అధికారుల్ని ఆదేశించారు. కేవలం 250 మీటర్ల మేర పైప్‌లైన్ మార్చడానికి ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ స్థానికుల్ని, ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని వినయ్‌నగర్‌కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి అవినాష్ కె.రౌత్ అన్నారు.