సీఎస్ కార్యాలయం బెజవాడకు
కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లోకి తరలింపు
* జీవో జారీ చేసిన ప్రభుత్వం
* వారంలో 4 రోజులు సీఎం ఏపీలోనే...
* ప్రైవెటు భవనాల కోసం త్వరలో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) క్యాంపు కార్యాలయాన్ని వెంటనే విజయవాడకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
విజయవాడలోని కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌కు సీఎస్ క్యాంపు కార్యాలయాన్ని తరలించాల్సిందిగా సోమవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విజయవాడలో ఏర్పాటవుతుండడంతో సమన్వయం కోసం సీఎస్ క్యాంపు కార్యాలయం కూడా అక్కడే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోకి సీఎస్ క్యాంపు కార్యాలయాన్ని తరలిస్తారు.
కలెక్టర్ మరో క్యాంపు కార్యాలయం ఎంపిక చేసుకోవాలని జీవోలో స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయవాడ నుంచే కార్యకలాపాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఫైళ్లు ‘ఈ-ఆఫీస్’ ద్వారా ఆన్‌లైన్‌లో వస్తున్నందున అధికారులు ఎక్కడి నుంచైనా పని చేయవచ్చునని జీవోలో వెల్లడించారు.
విజయవాడలోని నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని సీఎం క్యాంపు ఆఫీస్‌గా మారుస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రూ.40 కోట్లు వెచ్చించి నామినేషన్‌పై ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. లింగమనేని ఎస్టేట్‌ను సీఎం తన నివాసంగా ఉపయోగించుకోనున్నారు. దీనికి రూ.100 కోట్లు వెచ్చించేందుకు రంగం సిద్ధం చేశారు. విజయవాడ కేంద్రంగా రాష్ట్ర పరిపాలన సాగించాలని సీఎం నిర్ణయించారు. ఆయన ఇకపై వారంలో నాలుగు రోజులపాటు ఏపీలోనే ఉండనున్నారు. అధికారులు, ఉద్యోగులను త్వరలో తరలించనున్నారు.
జవహర్‌రెడ్డి కమిటీ నివేదిక సమర్పణ
విజయవాడకు ఉద్యోగుల తరలింపునకు సంబంధించి వసతి గుర్తింపు కోసం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఉద్యోగుల కోసం 25 లక్షల చదరపు గజాల వసతి అవసరమని సూచించింది. ఇందులో ప్రైవేట్, ప్రభుత్వానికి చెందిన ఏడు లక్షల చదరపు గజాల వసతి సిద్ధంగా ఉందని పేర్కొంది. విజయవాడలోని మేథా టవర్స్‌లో ఖాళీగా ఉన్న మూడు అంతస్థులను తీసుకోవాలని సూచించింది. ప్రైవేట్ భవనాలను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని వెల్లడించింది.