సాక్షి, సిటీబ్యూరో : నగరాభివృద్ధికి దిశానిర్దేశం చేసే హెచ్‌ఎండీఏ ఇప్పుడు ‘మహా’ ఇరకాటంలో పడింది. నిధుల సముపార్జనలో భాగంగా 12 లేఅవుట్లలో 42 విడి ప్లాట్లను వే లానికి సిద్ధం చేసినా ప్రస్తుత రాజకీయ అనిశ్చితి కారణంగా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం ప్లాట్లను వేలానికి పెడితే వివిధ ఉద్యమ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబికే అవకాశం ఉండటంతో అధికారులు ఆ అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు.
రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి, కొత్త లేఅవుట్స్ పర్మిషన్ కోసం ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం హెచ్‌ఎండీఏ అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్న వారు కూడా నిర్దేశిత ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎల్‌ఆర్‌ఎస్ కింద జోనల్ కార్యాలయాల నుంచి వచ్చే ఆదాయం కూడా స్తంభించిపోయింది. మొన్నటివరకు హెచ్‌ఎండీఏ ప్లాట్ల కోసం ఆరా తీసినవారు ఇప్పుడు ఆ ఛాయలకు కూడా రావట్లేదు.
దీంతో గత 4 రోజులుగా హెచ్‌ఎండీఏ కార్యాలయం బోసిపోయి కన్పిస్తోంది. కొత్త వెంచర్ల మాట అటుంచితే... ఇప్పటికే నిర్మించిన అపార్టుమెంట్ల, పలు లేఅవుట్స్‌లోని ప్లాట్లు అమ్ముడుపోని పరిస్థితి ఎదురైందని బిల్డర్లు, రియల్టర్లు వాపోతున్నారు. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, వివిధ పర్మిషన్లు, భూ వినియోగం మార్పు, ల్యాండ్ లీజులు, కొత్తప్రాజెక్టుల కోసం నిత్యం అనేక మంది హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వచ్చేవారు.
అయితే... ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర విభజన వ్యవహారం ఏదో ఒకటి తేలాకే... కొత్త లేఅవుట్లు, గ్రూపు హౌసింగ్ ప్రాజెక్టుల గురించి ఆలోచిద్దామన్న నిర్ణయానికి రియల్టర్లు వచ్చారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో పెద్దగా హడావుడి లేకపోవడంతో కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ కూడా బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్ భవనానికే పరిమితమవుతున్నారు. ఏవైనా అత్యవసర ఫైళ్లు ఉంటే అక్కడికే తెప్పించుకొని పరిశీలిస్తున్నారు.
ఆ ప్రాజెక్టులకు విఘాతం
నగరాభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకూ విఘాతం ఎదురైంది. ప్రధానంగా బాటసింగారం, మంగళపల్లిలో లాజిస్టిక్ పార్కులు, మియాపూర్‌లో భారీ బస్‌టెర్మినల్ నిర్మాణాన్ని హెచ్‌ఎండీఏ తలపెట్టింది. టెండర్‌లో వీటిని దక్కించుకొన్న సంస్థలు ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. అలాగే ఖానామెట్‌లో తలపెట్టిన సైన్స్ సిటీ, జవ హర్‌నగర్‌లో ప్రతిపాదించిన ఎడ్యుకేషనల్ హబ్‌లపై కూడా నీలినీడలు కమ్ముకొన్నాయి. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ సంస్థలే కాదు... దేశీయ విద్యాసంస్థలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి.
జవహార్‌నగర్‌లో భూమి కావాలంటూ ఇటీవల హెచ్‌ఎండీఏను సంప్రదించిన సంస్థలు సైతం ఇప్పుడు మొహం చాటేస్తుండటం గమనార్హం. విభజన వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకు హెచ్‌ఎండీఏతో ఎలాంటి ఒప్పందం చేసుకోవద్దని ఆయా సంస్థలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ చేసిన ల్యాండ్ పూలింగ్ ప్రయోగం కూడా రాష్ట్ర విభజన ప్రకటనతో బెడిసికొట్టడం అధికారులకు మింగుడు పడకుండా ఉంది.
ఆశలపై నీళ్లు
అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన హెచ్‌ఎండీఏ.. నగరంలోని 42 విడి ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.50 కోట్ల ఆదాయం సముపార్జించాలని భావించింది. గత ఏడాది మొత్తం 41 పాట్లు వేలానికి పెట్టగా 36 ప్లాట్లు అమ్ముడుపోయి సుమారు రూ.124 కోట్ల మేర ఆదాయం లభించింది. ఆ స్ఫూర్తితో వివిధ లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లను వెలికితీసి అధికారులు వేలానికి సిద్ధం చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర విభజన ప్రకటన హెచ్‌ఎండీఏ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఆ ప్రాజెక్టులకు విఘాతం
Published Mon, Aug 5 2013 12:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement