మెట్రో దారిలో మహా మాల్స్ | Mega malls to come in metro corridor | Sakshi
Sakshi News home page

మెట్రో దారిలో మహా మాల్స్

Published Wed, Sep 4 2013 10:27 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

Mega malls to come in metro corridor

హైదరాబాద్: ‘కలల మెట్రో’... సౌకర్యవంతమైన ప్రయాణానికి మాత్రమే కాదండోయ్..! అందరి అవసరాలు తీర్చేందుకూ సిద్ధమంటోంది. మెట్రో కారిడార్లలో కళ్లు చెదిరే రీతిలో షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు, ఆస్పత్రులు, ఆటపాటలకు సైతం వేదికలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని 66 మెట్రో స్టేషన్ల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో దశల వారీగా వీటి నిర్మాణం ప్రారంభం కానుంది. షాపింగ్‌తో పాటు విద్య, వైద్యం, సినిమా, బ్యాంకు ఇలా నగరవాసి ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేశారు. విదేశాల్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములాను నగరంలోనూ అనుసరిస్తున్నారు. పంజగుట్టలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్‌మాల్ నిర్మాణాన్ని ఇటీవలే మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఏర్పాటుకానున్న మెట్రో స్టేషన్‌కు కూతవేటు దూరంలో మరో 3 లక్షల చదరపు అడుగుల మేర వాణిజ్య స్థలాన్ని దశల వారీగా అభివృద్ధి చేసేందుకూ ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది. నూతనంగా ఏర్పాటు కానున్న మాల్స్, మల్టీప్లెక్స్‌లతో ఎదురయ్యే సమస్యలపై సమగ్ర అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాల్స్, మల్టీప్లెక్స్ నిర్మించే ప్రాంతాలు
1. హైటెక్ సిటీ ఎదురుగా, 2. పంజగుట్ట మెట్రోజంక్షన్, 3. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్, 4. మూసారాంబాగ్ మెట్రోస్టేషన్, 5. అమీర్‌పేట్ మెట్రో జంక్షన్, 6. సికింద్రాబాద్(జీహెచ్‌ఎంసీ పాత భవనం), 7. బాలానగర్ ట్రక్‌పార్క్, 8. ఎల్బీనగర్ ఓపెన్ స్టేడియం, 9. ముషీరాబాద్ పాత గాంధీ ఆస్పత్రి, 10.రాయదుర్గం ఐటీ కారిడార్    

సింగపూర్, హాంకాంగ్ తరహాలో...
ప్రస్తుతం చారిత్రక కట్టడాలు, దర్శనీయ స్థలాలకే కేరాఫ్‌గా మారిన గ్రేటర్ సిటీ మెట్రో మాల్స్, మల్టీ ప్లెక్స్‌లతో సింగపూర్, హాంకాంగ్ అందాలు సంతరించుకోవడం తథ్యమని నిపుణులు చెబుతున్నారు. మెట్రో కారిడార్లలో ఏర్పాటు చేయనున్న బడా మాల్స్‌లో విందు, వినోదాలకు కొదవే లేదు.

చిన్నారులకు ఆటపాటలు, మహిళలకు షాపింగ్, నిత్యావసర సరుకులు దొరికే ఏ టు జడ్ స్టోర్స్ కొలువుతీరనున్నాయి. వయోభేదం లేకుండా అన్ని వర్గాల వారినీ ఈ మాల్స్ ఆకర్షించనున్నాయి.

బ్యాంకింగ్ సేవలు, డయాగ్నోస్టిక్స్, ట్రామాకేర్ సెంటర్ వంటి అత్యవసర వైద్య సేవలు.. ఇలా అన్నిరకాల సౌకర్యాలుండే బహుళ అంతస్తుల భవనాలకు మెట్రో రూట్లు నెలవుకానున్నాయి.

మూడు మెట్రో కారిడార్ల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 57 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మాల్స్ ఏర్పాటుకానున్నాయి.
ప్రాజెక్టు పూర్తయ్యే (2017) నాటికి మొత్తంగా సుమారు 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. ఇవన్నీ మెట్రో స్టేషన్లకు కూతవేటు దూరంలో ఉండేవే.

మెట్రో స్టేషన్‌లో రైలు దిగినవారు స్కైవాక్ మీదుగా వీటిలోకి చేరుకోవచ్చు. సుమారు ఐదు నుంచి పది అంతస్తుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక్కో మాల్ కనీస విస్తీర్ణం లక్ష చదరపు అడుగులుంటుంది. గరిష్టంగా 10 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పనున్నారు.

కళ్లుచెదిరే బహుళ అంతస్తుల మాల్స్‌లో మీకు అన్ని వస్తువులు దొరుకుతాయి. వీటి ఏర్పాటుతో నగర పునర్నిర్మాణం కొత్తపుంతలు తొక్కనుంది.

పురాతన భవంతుల స్థానే రూపుదిద్దుకోనున్న సరికొత్త మాల్స్‌లో అన్నిరకాల స్టోర్స్, ఎంఎన్‌సీ, ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలు, కంప్యూటర్, ఐటీ శిక్షణ, పరిశోధన, విద్యాసంస్థలునెలకొల్పనున్నారు.

సౌకర్యాలివే...
మల్టీప్లెక్స్‌లు, మాల్స్
ఆఫీసు, వాణిజ్య స్థలాలు
ఫుడ్‌కోర్టులు, చాట్‌బండార్స్, బేకరీలు
దేశ, విదేశీ హోటళ్లు,
ఫుడ్‌కోర్టులు
డ్యూటీఫ్రీ షాప్‌లు
బ్రాండెడ్ దుస్తుల దుకాణాలు, ఫ్యాక్టరీ ఔట్‌లెట్లు
సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్
విక్రయదుకాణాలు
ఆక్సిజన్ సెంటర్లు
ట్రామాకేర్ సెంటర్లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు
బ్యాంకులు, ఏటీఎంలు
పిల్లల ఆట పాటలు, స్కేటింగ్, స్నూకర్, వీడియో గేమ్స్, సిమ్యులేటర్ డ్రైవింగ్ సెంటర్లు
అన్ని రకాల నిత్యావసరాలు దొరికే స్టోర్స్
కేఫ్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు
దేశ, విదేశీ పుస్తకాలు,
మ్యాగజైన్ స్టోర్లు
పాదరక్షలు,
షూస్ విక్రయించే దుకాణాలు
సౌందర్య సాధనాలు,
ఫ్యాషన్ మెటీరియల్

ఇనార్బిట్ మాల్‌ను తలదన్నే రీతిలో...
గచ్చిబౌలి ఇనార్బిట్ మాల్ ప్రస్తుతం 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువైంది. వీకెండ్స్‌లో విందు, వినోదాలు, ఆటపాటల సౌకర్యాలుండడంతో అన్ని వర్గాలను విశేషంగా ఆకర్షిస్తోంది. సమీప భవిష్యత్‌లో ఏర్పాటుకానున్న మెట్రో మాల్స్ ఈ మాల్‌ను తలదన్నే రీతిలో ఉండబోతున్నాయి. ముషీరాబాద్ పాత గాంధీ ఆస్పత్రి, రాయదుర్గం ఐటీ కారిడార్ల వద్ద సుమారు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్స్ ఏర్పాటుకానున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement