
సోమవారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను వాటర్ క్యానన్లతో చెదరగొడుతున్న పోలీసులు
- హెచ్‌సీయూ దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దద్దరిల్లిన ఢిల్లీ, హైదరాబాద్
- ఢిల్లీలోని మానవ వనరుల శాఖ కార్యాలయం వద్ద
- ఐదు గంటలపాటు విద్యార్థి సంఘాల ఆందోళన
- ఇది ప్రభుత్వ హత్యేనంటూ నినాదాలు
- కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇంటి ముట్టడికి యత్నం
- పోలీసులతో ఘర్షణ.. ఉద్రిక్తత
- వాటర్ క్యానన్లతో చెదరగొట్టిన పోలీసులు
- హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలోనూ మిన్నంటిన ఆందోళనలు.. 144 సెక్షన్ విధింపు
- రోహిత్ మృతిపై ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం
- దత్తాత్రేయ, వీసీ, తదితరులపై కేసు నమోదు
- అంబర్‌పేట్ శ్మశాన వాటికలో ముగిసిన రోహిత్ అంత్యక్రియలు
సాక్షి , న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యపై విద్యార్థి లోకం భగ్గుమంది. ఢిల్లీ దద్దరిల్లింది. విద్యార్థి, దళిత, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. రోహిత్‌ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని నినదించాయి. పార్లమెంటు సమీపంలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్చార్డీ) కార్యాలయం ఎదుట విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అనంతరం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, వాటర్ క్యానన్లు ప్రయోగించడంతో సోమవారమంతా దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) కూడా ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీ నుంచి రోహిత్‌తోపాటు సస్పెన్షన్‌కు గురైన విద్యార్థి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ ైవె స్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏబీవీపీ విద్యార్థులు సుశీల్‌కుమార్, కృష్ణచైతన్యపై ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో ఉలిక్కిపడ్డ హెచ్చార్డీ శాఖ.. రోహిత్ మృతిపై నిజానిజాలను వెలికి తీసేందుకు ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది.
శాస్త్రి భవన్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థి సంఘాల ఆందోళనతో హెచ్చార్డీ కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఎస్డీపీఐ, జేఎన్‌యూఎస్‌యూ, కేవైఎస్, దళిత్ స్టూడెంట్ ఫెడరేషన్, ఎస్‌ఐఓ, యూడీఎస్‌ఎఫ్, వైఎఫ్‌డీఏ, బీఏపీఎస్‌ఏ తదితర విద్యార్థి సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బారికేడ్లను తొలగించి కొందరు కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు నిలువరించారు. విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. నీళ్లు మొత్తం పూర్తవడంతో పోలీసులు తమ యత్నాన్ని విరమించుకున్నారు. చివరకు మరికొందరు పోలీసులను రప్పించి ఐదు ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇక్కడ ఆందోళన సద్దుమణుగుతున్న సమయంలో కొందరు విద్యార్థులు పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌లోకి పరుగులు తీశారు. వారంతా తుగ్లక్ రోడ్‌లోని హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇక్కడ కూడా పోలీసులు విద్యార్థులపై వాటర్ క్యానన్లు ప్రయోగించి, చివరకు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఏబీవీపీ, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే కేంద్రం విద్యార్థులపై చర్యలు తీసుకుందని, కేంద్ర చర్యల వల్లే రోహిత్ మృతి చెందాడని ఆరోపించారు. దత్తాత్రేయ లేఖ కారణంగానే కేంద్రం రంగంలోకి దిగిందని ఆరోపించారు. స్మృతి, దత్తాత్రేయ తక్షణం పదవులకు రాజీనామా చేయాలని, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
అట్టుడికిన హెచ్‌సీయూ
ఇటు హెచ్‌సీయూ కూడా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో అట్టుడికింది. ఉదయం 6 గంటలకే 300 మందికి పైగా పోలీసులు.. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన ఎన్‌ఆర్‌ఎస్‌ఐ వింగ్ హస్టల్‌కు చేరుకొని విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. ఉదయం 7.15 గంటలకు మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రోహిత్ మృతదేహన్ని బలవంతంగా తరలించడంతో విద్యార్థులు వర్సిటీలోని పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. అక్కడ వీసీ లేకపోవడం, కార్యాలయానికి తాళం వేసి ఉండటటంతో ‘వెలివాడ’ పేరిట బహిష్కరణకు గురైన విద్యార్థులు కొనసాగిస్తున్న ధర్నా శిబిరం వద్దకు చేరుకున్నారు. వీసీ, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అలోక్ పాండే, ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్‌ను సస్పెండ్‌చేయాలని, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేత, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజు, సోదరి నీలిమ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధిక విలేకరులతో మాట్లాడుతూ... తన కొడుకు చాలా ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని అన్నారు. క్యాంపస్‌లోకి వచ్చే వరకు సస్పెన్షన్ విషయం తనకు తెలియదని కన్నీళ్ల పర్వంతమయ్యారు. ‘‘నా కొడుక్కి ఎమ్మెస్సీలో ఆరో ర్యాంక్ వచ్చింది. పీహెచ్‌డీ ఫ్రీ సీటు వచ్చింది. రెండు సార్లు సీఎస్‌ఆర్‌ఐకి క్వాలిఫై అయ్యాడు. అలాంటి మెరిట్ స్టుడెంట్‌ను వేధించి చంపారు’’ అని ఆమె ఆరోపించారు. ఏ తప్పు చేయకపోతే వీసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అంబర్‌పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
దత్తాత్రేయ, వీసీ తదితరులపై కేసు
వర్సిటీ నుంచి సస్సెన్షన్‌కు గురైన విద్యార్థుల్లో ఒకరైన ప్రశాంత్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ ైవె స్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏబీవీపీ విద్యార్థులు సుశీల్‌కుమార్, బీజేవైఎం నేత విష్ణుపై ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ప్రజా గాయకులు గద్దర్, విద్యావేత్త చుక్కారామయ్య, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, పౌర హక్కుల నేత జయ వింధ్యాల, ఎం.బి. రఘునాథ్, ఆవుల బాలనాథం, ప్రజాకవి జయశంకర్, బత్తుల రాంప్రసాద్ తదితరులు ఉస్మానియా ఆసుపత్రికి తరలి వచ్చి రోహిత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి ఆత్మహత్య, విద్యార్థుల సస్పెన్షన్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.
విషవాయువు, ఉరితాళ్లు ఇవ్వండి..
దళిత విద్యార్థులు వర్సిటీలో అడ్మిషన్ తీసుకొనే సమయంలోనే ‘10 మిల్లీ గ్రాముల సోడియం యాసిడ్(విష వాయువు), ఉరితాళ్లు ఇవ్వాలంటూ’ తమ సస్పెన్షన్‌కు నిరసనగా గత డిసెంబర్ 18న వీసీ అప్పారావుకు అందజేసినవినతి పత్రంలో రోహిత్ పేర్కొన్నాడు. బాధ కల్గినప్పుడు అంబేద్కర్ భావజాలం గల దళిత విద్యార్థులు ఆ విషవాయువు లేదా ఉరి వేసుకొని ప్రాణం తీసుకునే వెసులుబాటు కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతటి మనో వేదనతో వినతి పత్రం ఇచ్చినా ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. విషయం కోర్టు పరిధిలో ఉందని నిర్లక్ష్యం చేయడంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ కుటంబ నేపథ్యమిదీ..
గుంటూరు జిల్లా గురజాడకు చెందిన రాధిక, మణికుమార్ దంపతుల పెద్ద కొడుకు రోహిత్. సోదరి నీలిమ బీకాం చేశారు. సోదరుడు రాజు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉప్పల్‌లోని ఎన్‌జీఆర్‌ఐలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిత్ తండ్రి మణికుమార్ మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గుంటూరులో టైలర్‌గా పనిచేసే రాధిక కొంత కాలంగా ఉప్పల్‌లోని బ్యాంక్ కాలనీలో చిన్న కొడుకు రాజు వద్ద ఉంటోంది. ఈ నెల 13న తల్లితో ఫోన్‌లో మాట్లాడిన రోహిత్.. పండుగకు వస్తానని చెప్పాడు. పండుగకు రాకపోవడంతో ఆమె ఆదివారం మధ్యాహ్నం రోహిత్ స్నేహితుడు విజయ్‌కి ఫోన్ చేసింది. అదే రోజు సాయంత్రం కొడుకు మృతి వార్త తెలిసింది.
సులభంగా విడిచిపెట్టం: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా
రోహిత్ ఆత్మహత్య ఘటనను సులభంగా విడిచిపెట్టబోమని, దీనిపై ప్రభుత్వానికి గట్టి సిఫారసు చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రాజకీయ జోక్యం వల్లే మొత్తం విషయం యూ టర్న్ తీసుకుందని అన్నారు. హెచ్‌సీయూకు వెళ్లి రోహిత్ ఆత్మహత్యపై వివరాలు తెలుసుకొని వచ్చిన ఆయన సోమవారం రాత్రి దిల్‌కుశ గెస్ట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, తమ వైపు నుంచి కూడా విచారణ జరిపే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు.