దొర గడీలో దళితుల సంక్షేమం బందీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితుల సంక్షేమం, అభివృద్ధి ఈ మూడేళ్లలో దొర గడీలో బందీ అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. గురువారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు.
దళితుల సంక్షేమం, అభివృద్ధికి నిధులెన్ని కేటాయించారు, ఎంత ఖర్చుచేశారో ప్రజల్లోనే తేల్చడానికి సిద్ధమన్నారు. ఈటల రాజేందర్ వచ్చినా, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినా చర్చకు సిద్ధమేనని సంపత్‌కుమార్ సవాల్ చేశారు. బహిరంగ చర్చకు తేదీ, సమయం, స్థలం కూడా టీఆర్‌ఎస్ వాళ్లే నిర్ణయించాలన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే మూడు రోజుల్లో తేదీ, స్థలం, సమయం ప్రకటించాలని సంపత్‌కుమార్ సవాల్ చేశారు.