ఇది ఏపీని కించపరచడమే..:మేకపాటి రాజమోహన్‌రెడ్డి
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మేకపాటి ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి ఎలా అంటారని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరచడమే. అన్ని విధాలుగా నష్ట పరచడమే..’ అని చెప్పారు. గతంలో నిండు సభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. విచక్షణా రహితంగా రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఆనాడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాయని చెప్పారు. శుక్రవారం ఏపీ భవన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. హోం మంత్రి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర నిరాశలోకి నెట్టాయని అన్నారు.
రాష్ట్ర విభజన రోజు చేసిన వాగ్దానాలు అన్నింటినీ అమలు చేయాల్సిన అవసరం ఉందని మేకపాటి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏవిధంగా మభ్యపెట్టాలి? ఏవిధంగా తమ పార్టీలోకి తీసుకోవాలి? అన్న ఆలోచనలతో బిజీగా ఉన్నారని మేకపాటి ధ్వజమెత్తారు. ఏపీకి జరుగుతున్న నష్టాన్ని నివారించే దిశగా సీఎం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏమాత్రం కృషి చేయడం లేదని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై గానీ, రైల్వే జోన్‌ను తెప్పించుకోవడంపై గానీ దృష్టి సారించకపోగా.. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు.