‘సెస్’ అద్దంలో బాబు బండారం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి
- ఏపీలో వ్యవసాయం పరిస్థితి దారుణమని తేల్చింది
- అప్పుల ఊబిలో 93 శాతం మంది రైతులు
- సగటున ఒక్కోరైతుకు రూ.1.23 లక్షల అప్పు
- రుణమాఫీ అంకెల గారడీకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి అది చేశాం.. ఇది చేశామని ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ బడాయి మాటలేనని సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్) నివేదిక బయట పెట్టిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం నియమించిన సెస్ చైర్మన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. రైతుల దుస్థితిపై అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసిన చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా 93 శాతం మంది రైతులు అప్పుల్లో మునిగిపోయారని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, సగటు రైతు అప్పు లక్షా 23 వేల రూపాయలు ఉందని సెస్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఏపీలో రెండంకెల వృద్ధి రేటు అని, వ్యవసాయ మిషన్ అని చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని ఈ నివేదికతో తేలిపోయిందన్నారు. చంద్రబాబుకు మొదటి నుంచి వ్యవసాయం దండగనే అభిప్రాయం ఉందని విమర్శించారు.
అప్పుల్లో రైతులు..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రైతులు 93 శాతం అప్పుల్లో మునిగిపోవడానికి ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన రుణమాఫీ వాగ్దానమే కారణమని విశ్వేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. హామీ నెరవేర్చకుండా చంద్రబాబు కాలయాపన చేయడంతో రైతులు అప్పులు చెల్లించలేకపోతున్నారని, రుణా లు రీ షెడ్యూల్ కావడం లేదని తెలిపారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకొని రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానాన్ని పక్కనపెట్టి రైతులకు రుణాలు ఇవ్వాలని సెస్ కమిటీ సూచించిందని తెలిపారు. అయితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానాన్ని అనుసరిస్తూ రైతులకు బంగారంపై బ్యాంకు రుణాలు ఇవ్వొద్దని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు వరాలు ఇస్తూ, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండున్నరేళ్లుగా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతే.. 4 రెయిన్‌గన్లతో హడావిడి చేసి కరువును పోగొట్టామని ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు. కరువుకాట కాల సమయంలో ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందలేదని సెస్ నివేదికలో నిపుణులు చెప్పారని తెలిపారు.
ఎదురుదాడితో..
రాధాకృష్ణ కమిషన్ చేసిన 114 సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తుందో లేదోనని విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జయతిఘోష్ కమిటీ, చెన్నారెడ్డి కమిటీ, స్వామినాథన్ నివేదికలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు వాటి గురించి మాట్లాడటం మానేశారని గుర్తుచేశారు. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. కేంద్రం నియమించిన భూపేంద్ర హుడా కమిటీ కూడా ఎకరానికి రూ.10 వేలు, వాణిజ్యపంటలైతే ఎకరానికి రూ.25 వేలు ఇవ్వమని చెప్పిందని, దీన్ని అమలు చేస్తామని అసెంబ్లీలో అట్టహాసంగా ప్రకటించి అమలులో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించారు. సెస్ నివేదికతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, ఈ నివేదికలను అమలు చేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.