ఆ అధికారులను కోల్‌కతా మ్యాచ్‌కు రానివ్వలేదు
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం కోల్ కతా వచ్చేందుకు పాక్ దౌత్యవేత్తలకు కేంద్రం అనుమతి నిరాకరించింది. మార్చి 19న భారత్- పాకిస్తాన్ మధ్య కోల్ కతాలో వరల్డ్ టీ 20 మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పాకిస్తాన్ అధికారులు ఏడుగురు కోల్ కతా వచ్చేందుకు అనుమతి కోరగా.. చివరినిమిషం వరకు తమకు అనుమతి ఇవ్వలేదని, చివరినిమిషంలో ఇద్దరు అధికారులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో వారు కూడా కోల్‌కతాకు వచ్చే అవకాశం లేదని పాక్ వర్గాలు తెలిపాయి.
కోల్ కతా మ్యాచ్ కోసం పాక్ దౌత్యవేత్తలకు భారత్ అనుమతి నిరాకరించడం నిజమేనని భారత్ కు చెందిన డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ ఇస్లామాబాద్ లో తెలిపారు. అయితే, ఇద్దరు దౌత్యవేత్తలకు కోల్ కతా వచ్చేందుకు ప్రయాణ అనుమతులు మంజూరు చేశామని, మరో ఐదుగురికి మాత్రం నిరాకరించామని భారత అధికారులు తెలిపారు. ఆ ఐదుగురికి పాకిస్తాన్ అంతర్గత భద్రతా సిబ్బందితో, ముఖ్యంగా ఐఎస్ఐతో సంబంధాలు ఉండటం వల్లే అనుమతి నిరాకరించామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 వరకు మొత్తం ఏడుగురిలో ఏ ఒక్కరికి అనుమతులు రాలేదని పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రోత్సహించేందుకే దౌత్యవేత్తలు కోల్ కతాకు వెళుదామనుకుంటున్నారని, ఈ విషయంలో భారత ప్రభుత్వం అనవసరంగా సమస్యను సృష్టిస్తోందని పాక్ దౌత్యవర్గాలు ఆరోపిస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా పాక్ జట్టు మ్యాచులు జరగనున్న కోల్ కతా , మొహాలీలను సందర్శించేందుకు పాకిస్తాన్ దౌత్యవేత్తలు, ప్రముఖులతో సహా 45 మందికి అనుమతి ఇవ్వాలని కేంద్ర విదేశాంగ శాఖను పాక్ కోరిందని తెలుస్తోంది. అయితే పాక్ మ్యాచ్ ఆడుతున్న ప్రతిచోటుకీ అంతమందిని అనుమతించడం సాధ్యం కాదని, ఇటువంటి నిర్ణయాలు అన్యోన్యత ఆధారంగా తీసుకుంటారని ఓ భారతీయ అధికారి తెలిపారు