భారత్లో మరో ప్రాణాంతక వ్యాధి..!?
మరో ప్రాణాంతక వ్యాధికి భారతదేశం కేంద్రమైందని తాజా నివేదికలు చెప్తున్నాయి. గాలి, నీరు, మట్టిలో విస్తృతంగా ఉండే ఓ బ్యాక్టీరియా కారణంగా ఆ వ్యాధి సోకుతుందని, దాన్ని వెంటనే గుర్తించకపోతే రెండు రోజుల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆక్స్ఫర్డ్ వర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటికే స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను ఎలా నిర్మూలించాలోనని తలలు పట్టుకుంటుండగా.. భారత్లో మరో ప్రాణాంతక వ్యాధిని కలిగించే అత్యంత భయంకరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఉందని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు.
'మెలియోఐడోసిస్' పేరున గాలి, నీరు, మట్టిలో లో ఈ క్రిమి వ్యాపించి ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వ్యాధి సోకిన వెంటనే సరైన సమయానికి వైద్యం అందించకపోతే కేవలం రెండు రోజుల్లోనే ప్రాణాలు తీసేంత ప్రమాదకారి అని చెప్తున్నారు. అయితే ఈ బ్యాక్టీరియాను గుర్తించడం కొంత కష్టమేనని లండన్కు చెందిన నేచర్ మైక్రో బయాలజీ పత్రికలో నివేదికను ప్రచురించారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 44శాతం దక్షిణాసియాలోనే ఉన్నట్లు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ డ్యాన్స్ నవంబర్లో మణిపాల్ వర్శిటీలో చెప్పారు. అంతేకాక మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియాలోనే ఈ బ్యాక్టీరియాతో మరణాలు అధికశాతం నమోదవుతున్నట్లు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 1,65,000 మెలియోఐడోసిస్ కేసులను గుర్తిస్తే, దీని బారిన పడి సుమారు 89 వేలమంది చనిపోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. తమ అంచనాల ప్రకారం సుమారు 45 దేశాల్లో ఈ బ్యాక్టీరియా వ్యాపించి ఉందని పరిశోధకులు చెప్తున్నారు. మరో 34 దేశాల్లో ఈ క్రిములు వ్యాపించి ఉన్నా వాటిని గుర్తించలేదని నేచర్ మైక్రోబయాలజీ పత్రిక పేర్కొంది. ఈ భయంకర క్రిములు ఎక్కువగా ఈశాన్య ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియాలోని వ్యాపించి ఉన్నాయని జ్వరం, మూర్ఛ, శ్వాసకోశాలకు సంబంధించిన అసౌకర్యం కలిగి ఉండటం ఈ వ్యాధి లక్షణాలని అంటున్నారు.
ముఖ్యంగా భారత దేశంలో పెద్ద తరహా నిర్మాణాలతో.. ఆయా ప్రదేశాల్లో గాలితో ఎగిరే దుమ్ము, మట్టి వల్ల ఈ వ్యాధి మరింత సులభంగా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. అయితే ఈ వ్యాధికి ఇంకా ఎటువంటి ముందస్తు టీకాలు కనిపెట్టలేదని, ఒక్కసారి సోకిందంటే చికిత్స కాస్త కష్టమేనని పరిశోధకులు అంటున్నారు. మధుమేహం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారికి ఈ బ్యాక్టీరికా మరింత త్వరగా సోకే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.