ఉద్యోగులకు 'చేదు' పనిష్మెంట్..!
చైనాః ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడంకోసం కొన్ని కంపెనీలు షరతులు విధిస్తుంటాయి. అలవెన్సులు కట్ చేయడం, ఎక్కువ సమయం పనిచేయించడం ఇదేదీ కుదరకపోతే సస్సెండ్ చేయడం కూడా చూస్తుంటాం. కానీ ఓ చైనా కంపెనీ తమ ఉద్యోగులు టార్గెట్ ను చేరుకోలేకపోతే వింత శిక్ష విధిస్తోంది. అమ్మకాల్లో అనుకున్న గమ్యాన్ని చేరుకోలేనివారికి సహోద్యోగుల ముందు 'చేదు' అనుభవాన్ని చవి చూపిస్తోంది. ఆధునిక నాగరికతను, అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న దేశంలో.. ఉద్యోగులకు ఇస్తున్న అనాగరిక శిక్షకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
ఇప్పటిదాకా చరిత్రలో కనీ వినీ ఎరుగని శిక్షను ఛొన్క్గింన్గ్ ఆధారిత లెషాంగ్ డెకరేషన్స్ కార్పొరేషన్ కంపెనీ.. తమ ఉద్యోగులకు విధిస్తోంది. టార్గెట్స్ చేరుకోలేకపోయిన వారితో బలవంతంగా కాకరకాయలు తినిపించే పనిష్మెంట్ ఇస్తోంది. ఉన్నతాధికారుల అంచనాల ప్రకారం వారాంతపు టార్గెట్లు చేరుకోలేకపోయిన వారితో బలవంతంగా సహచరుల ముందు కాకరకాయలు తినిపించి తీవ్రంగా అవమాన పరుస్తోంది. ఒకవేళ తినేప్పుడు ఏమాత్రం కింద పడినా, చేదు భరించలేక ఉమ్మేసినా.. మరింత ఎక్కువగా తినాలన్న రూలు పెట్టింది. సరైన ఫలితాలను ఇవ్వలేని కార్మికులకు ఇటువంటి అవమానకర పనిష్మెంట్ ఇస్తోంది. ఈ చేదును భరించలేక ఉద్యోగులు ఎప్పటికప్పుడు అంచనాలను చేరుకుంటారన్న ఆలోచనతో కంపెనీ ఈ క్రూరమైన శిక్షను విధిస్తోంది. ఇంటర్నెట్ లో పోస్టు చేసిన ఫోటోలను బట్టి.. సుమారు 40 మంది ఉద్యోగులు బలవంతంగా ఈ కాకరకాయ శిక్షను అనుభవించినట్లు తెలుస్తోంది. ఆ చేదు కాకరకాయలను తినండం.. ముఖ్యంగా మింగడం ఎంతో కష్టంగా ఉందని శిక్షను అనుభవించినవారిలో ఓ యువతి స్థానిక విలేకరులకు ఫిర్యాదు చేసింది. తినేప్పుడు ఎక్కిళ్ళు, వాంతు వచ్చినా సరే ఉమ్మకుండా తినాల్సి వచ్చిందని మరో యువతి చెప్పింది.
లెషాంగ్ డెకరేషన్స్ కార్పొరేషన్ కంపెనీకి చెందిన ఓ మహిళా ఉద్యోగి.. తమ సంస్థలో ఉద్యోగులపట్ల యాజమాన్యం, ఉన్నతాధికారులు చూపిస్తున్నదురాగతాలను వెలుగులోకి తెచ్చింది. ఇంతకు ముందు కూడా సంస్థ అధికారులు ఉద్యోగులతో గుంజీలు తీయించడం, కార్యాలయం చుట్టూ రెండుమూడుసార్లు పరిగెట్టించడం వంటివి చేసినట్లు తెలిపింది. తాజాగా వారాంతపు పనిష్మెంట్ లో భాగంగా కిలో 2.5 యువాన్లకు కొని మరీ చేదు కాకరకాయలను తినిపిస్తోందని పేర్కొంది. చేదు సమస్యను ఎదుర్కొంటున్న ఉద్యోగులు.. ఆ వివరాలను తెలుపుతూ ఫోటోలు ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అసాధారణ శిక్ష... అధికారులు ఆశించిన దానికి భిన్నంగా కూడా ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బలవంతంగా సహచరుల ముందు కాకరకాయలు తినిపించడంతో 50 శాతం ఉద్యోగులు సంస్థను విడిచి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగులకు సంస్థ ఇచ్చే చాలీచాలని జీతాలకు తోడు, అధికారులు పెట్టే అధిక ఒత్తిడి, ముఖ్యంగా సహోద్యోగుల ముందు అవమానించడాన్ని భరించలేకే సంస్థను విడిచి వెళ్ళేందుకు సిద్ధమౌతున్నట్లు సదరు మహిళా ఉద్యోగి స్థానిక విలేకర్లకు ఫిర్యాదు చేసింది.
చైనా శ్రామిక చట్టం ఆర్టికల్ 88 ప్రకారం.. ఉద్యోగికి ఎటువంటి నష్టం సంభవించినా యాజమాన్యం అందుకు బాధ్యత వహించి, పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే కంపెనీలు ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. కార్మికుల కాళ్ళు, చేతులు కట్టి వీధుల్లో అందరి ముందూ నడిపించడం, సరస్సులచుట్టూ మోకాళ్ళపై నడిపించడం వంటి ఎన్నో అమానవీయ శిక్షలను కొన్ని సంవత్సరాలుగా కంపెనీల్లోని అధికారులు ఉద్యోగులకు విధిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారంటూ కార్మికులు వాపోతున్నారు.