కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్ | Facebook Sues IndianTechie For Running Deceptive Ads COVID19 Fake News | Sakshi
Sakshi News home page

కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్

Published Fri, Apr 10 2020 5:39 PM | Last Updated on Fri, Apr 10 2020 5:45 PM

Facebook Sues IndianTechie For Running Deceptive Ads COVID19 Fake News - Sakshi

కాలిఫోర్నియా:  ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్  భారతీయ టెకీకి భారీ షాకిచ్చింది. కరోనా  వైరస్ పై తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. తన ప్రకటనల సమీక్ష ప్రక్రియను దాటవేయడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి మోసపూరిత ప్రకటనలు, తప్పుడు సమాచారాన్ని అందించేలా సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నందుకు ఫేస్‌బుక్ బసంత్ గజ్జర్ పై దావా వేసింది. 

ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, మోసపూరిత ప్రకటనలతో అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బసంత్ గజ్జర్ సంస్థ లీడ్‌క్లోక్‌ పై ఈ దావా వేసింది.కోవిడ్-19కి సంబంధించి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంతో పాటు, అనేక ఇతర సాంకేతిక సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. కరోనాకు సంబంధించి నకిలీ వార్తలు, తప్పుడు ప్రకటనలకు సంబంధిచి యాడ్-క్లోకింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించినట్లు వెల్లడించింది. కరోనా వైరస్, క్రిప్టోకరెన్సీ, డైట్ పిల్ప్ తదితర నకిలీ వార్తలతో ఫేస్ బుక్ నిబంధనలను ఉల్లఘించాడని పేర్కొంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లోని ఆటోమేటెడ్ అడ్వర్టైజింగ్ రివ్యూ ప్రాసెస్‌ నుంచి తప్పించుకునేలా యాడ్-క్లోకింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించినట్లు ఆరోపించింది.థాయ్‌లాండ్‌లో ఉన్నగజ్జర్ లీడ్‌క్లోక్ ద్వారా క్లోకింగ్ సాఫ్ట్‌వేర్ సాయంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మోసపూరిత ప్రకటనలను నడుపుతున్నాడని ఫేస్‌బుక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ లిటిగేషన్ డైరెక్టర్ జెస్సికా రొమెరో ఒక ప్రకటనలో తెలిపారు.  (కరోనా భయమా? మీకో బుల్లి పెట్టె : రూ.500 లే)

అలాగే గూగుల్, ఓత్, వర్డ్ ప్రెస్, షాపీఫై లాంటి ఇతర సాంకేతిక సంస్థలను లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ఈ క్లోక్డ్ వెబ్‌సైట్లలో కొన్ని ప్రముఖుల చిత్రాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియా దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. లీడ్‌క్లోక్‌ కస్టమర్లను గుర్తించడంతోపాటు, వారిపై అదనపు అమలు చర్యలు తీసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలిపింది. తాజా పరిణామంతో గోప్యతకు సంబంధించి, ఫేక్ న్యూస్ నివారణకు ఇతర సెక్యూరిటీ చర్యల్ని చేపట్టినట్టు వెల్లడించింది. కాగా క్లోకింగ్ అనేది హానికరమైన టెక్నిక్. దీనిద్వారా ఆయా సైట్లలోకి చొరబడి, వెబ్‌సైట్  స్వభావానికి విరుద్ధంగా, నకిలీ వార్తలు, ప్రకటనలు ఇస్తుంది. అంతేకాదు సంబంధిత సంస్థల సమీక్ష వ్యవస్థలను బలహీనపరుస్తుంది. మోసపూరిత ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహిస్తుంది.  (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement