ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు భారత్‌లో రాజకీయ ఆశ్రయం కల్పించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీటీఐ తరఫున ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్‌లోని బారికోట్ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బల్దేవ్ కుమార్ పాక్‌లో మైనారిటీలకు రక్షణ లేదని ఆరోపించాడు. ఈ క్రమంలో భారత్‌లో తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం బల్దేవ్ మూడు నెలల వీసాపై భారతదేశంలో ఉన్నాడు. ఆగస్టు 12న ఆయన భారతదేశానికి వచ్చాడు. బల్దేవ్ ఇండియా రావడానికి ముందే తన భార్య, పిల్లలను లూధియానా ఖన్నాలోని వారి బంధువుల వద్దకు పంపాడు. ప్రస్తుతం పాక్‌లో మతపరమైన మైనారిటీలపై హింస పెరిగిపోయిందని.. అందువల్లే తన కుటుంబాన్ని పాక్ నుంచి ఇండియాకు పంపిచాల్సి వచ్చిందని తెలిపాడు. అంతేకాక తాను తిరిగి పాక్ వెళ్లాలని కోరుకోవడం లేదన్నాడు బల్దేవ్.
తన కుటుంబ భద్రత గురించి తాను భయపడతున్నానని.. అందుకే భారతదేశంలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నానని బల్దేవ్ తెలిపాడు. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ మీద విమర్శల వర్షం కురిపించాడు బల్దేవ్. నూతన పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ప్రమాణం చేసిన ఇమ్రాన్ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించాడు. పాక్‌లో హిందువులు, సిక్కులపై దారుణాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని కోరాడు. అంతేకాక భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన విన్నపాన్ని మన్నించి భారత్‌లో ఆశ్రయం కల్పిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు. బల్దేవ్ కుమార్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లూధియానా ఖన్నాలోని సమ్రాలా మార్గ్ ప్రాంతంలో రెండు గదుల ఇంట్లో అద్దెకుంటున్నాడు. బల్దేవ్ కుమార్ 2007లో పంబాజ్ ఖన్నా ప్రాంతానికి చెందిన భావనను వివాహం చేసుకున్నాడు. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉంది. కాగా బల్దేవ్ ఇద్దరి పిల్లలు పాక్ పౌరసత్వం పొందారు. 2016 ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ ఎమ్మెల్యే సోరన్ సింగ్ హత్య కేసులో బల్దేవ్‌పై ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment