భార్య శవం పక్కన ఆరు రోజులు.. | heart touching love story, husband spends six days with wife deadbody | Sakshi
Sakshi News home page

భార్య శవం పక్కన ఆరు రోజులు..

Published Tue, May 9 2017 3:43 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

భార్య శవం పక్కన ఆరు రోజులు.. - Sakshi

భార్య శవం పక్కన ఆరు రోజులు..

అన్యోన్యంగా, ఆత్మీయంగా, పాతికేళ్లకు పైగా కలిసి మెలిసి బతికిన భార్యాభర్తల్లో ఎవరు భౌతికంగా దూరమైనా మరొకరు భరించలేకపోవచ్చు. బాధ పడవచ్చు. ఆ బాధ నుంచి బయట పడటం అంత సులభమూ కాకపోవచ్చు. చనిపోయినవారు మళ్లీ బతికొచ్చే అవకాశం లేనప్పుడు అంత్యక్రియలు జరపకుండా శవం పక్కన పెట్టుకొని ఎవరూ గడపలేరు కదా! కానీ ఇంగ్లండ్‌లోని డెర్బీషైర్‌లో నివసిస్తున్న రస్సెల్‌ డేవిసన్‌ అనే 50 ఏళ్ల వ్యక్తిని భార్య శవాన్ని అంత త్వరగా ఆస్పత్రి మార్చురీకి లేదా శ్మశానానికి తరలించడం ఇష్టం లేక ఆరు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. నిద్రపోతున్నట్లు ఆమె శవాన్ని మంచం మీద పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకుంటూ వచ్చారు. ఇద్దరూ కలసి జీవితంలో అనుభవించిన మధుర క్షణాలను, స్మృతులను భార్య శవంతో పంచుకుంటూ గడిపారు.

భార్య మరణంతో దిగ్భ్రాంతికి గురై మానసిక స్థితి తప్పి రస్సెల్‌ అలా వ్యవహరించలేదు. సర్వికల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్య వెండీ ఏదో రోజు చనిపోతుందని రస్సెల్‌కు మూడేళ్ల క్రితమే తెలుసు. డాక్టర్లు ఆరు నెలలకు మించి విండీ బతకదన్నారు. అయినా ఆమె రెండున్నరేళ్లు ఎక్కువగానే బతికారు. జీవించే ఆరు నెలల కాలాన్ని భార్యతో గడపాలనుకున్న రస్సెల్‌ ఓ కారవాన్‌ వ్యాన్‌ను కొనుగోలు చేసి, భార్యతో యూరప్‌ అంతా తిరుగుతూ వచ్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత ఆమెకు సర్వికల్‌ క్యాన్సర్‌ నొప్పి రావడంతో ఇంగ్లండ్‌ తిరిగొచ్చి రాయల్‌ డెర్బీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోనే ఆమె మరణించింది.


‘చావు గురించి మాట్లాడాలంటేనే ఈ సమాజానికి ఎంతో భయం. ఎంత శవంగా మారితే మాత్రం పాతికేళ్ల భాగస్వామిని ఒక్క రోజుతో దూరం చేసుకుంటామా? అలా చేసుకోవద్దని ఈ సమాజానికి చెప్పడానికే నేను ఆరు రోజుల పాటు భార్య శవం చెంతనే, పక్కనే గడిపాను. నా బంధుమిత్రులు, ఆమె బంధుమిత్రులు రోజూ వచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఆమెకు నివాళులర్పించేవారు. ఆమెతో కబుర్లు చెప్పేవారు. మృతదేహాన్ని భద్రపర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా శవం కుళ్లి పోవడం గానీ, దుర్వాసన రావడం గానీ జరగలేదు. చట్టప్రకారం మృతదేహాన్ని ఆరు రోజులకు మించి భద్రపర్చడానికి వీల్లేదు కాబట్టి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏడోరోజున ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాం’ అని రస్సెల్ చెప్పారు. ఏరోజుకారోజు భార్య శవం పక్కన గడిపిన క్షణాల గురించి ఫేస్‌బుక్‌లో వెల్లడించిన రస్సెల్, అంత్యక్రియల అనంతరం కూడా భార్యను ఉద్దేశించి ఓ లేఖ రాశారు.

‘నా హృదయం ముక్కలైంది. ఎప్పుడు కోలుకుంటానో తెలియదు. అసలు కోలుకోవాలని కూడా కోరుకోవడం లేదేమో. కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తోంది. ఆ తర్వాత ఎప్పటికో గానీ కాస్త సేదతీరను. డార్లింగ్‌ వెండీ! నీ పరలోక ప్రయాణం కూడా సుఖంగా జరగాలని కోరుకుంటున్నా. నేను గానీ, నీ ఇద్దరు పిల్లలు గానీ, నీ ఆప్తులు గానీ నిన్ను ఎప్పటికీ మరచిపోలేం. ఎలా జీవించాలో, గౌరవప్రదంగా ఎలా మరణించాలో నీవు మాకు చూపించావు. ఇప్పటివరకు అన్ని విషయాల్లో నా వెన్నంటి నిలబడినందుకు నీకు సర్వదా కృతజ్ఞుడిని’ అని రాసిన లేఖను ఆయన తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు డెర్బీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగే వెండీ శ్రద్ధాంజలి కార్యక్రమానికి రావాల్సిందిగా బంధుమిత్రులతోపాటు ఫేస్‌బుక్‌ మిత్రులను ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement