దుబాయ్ జుమైరా బీచ్ రెసిడెన్స్ ఆరెంజ్ కంటెయినర్ లో ' స్పీక్ అప్' పేరిట నిర్వహించిన కార్యక్రమం.. హాజరైన వారికి కన్నీళ్ళు తెప్పించింది. బాధిత మహిళల ఆవేదనను బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో వినిపించిన ఆ స్వరం... అక్కడివారి హృదయాలను కదిలించింది. ఓ తాగుబోతు భర్తనుంచి ఆమె ఎదుర్కొంటున్న వేధింపుల వివరాలతో... బాధిత మహిళ జీవిత గాధ ఆధారంగా రూపొందించిన ఆడియో కథనం అది. మనసులను కదిలించిన ఆ భావోద్వేక సౌండ్ ట్రాక్ మహిళాలోకాన్నే మేలుకొలిపేందుకు, అవగాహన కల్పించేందుకు నినాదమైంది. అరబ్బు దేశంలో మొదటిసారి మహిళలపై గృహ హింసకు వ్యతిరేకంగా 'దుబాయ్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఛిల్డ్రన్' ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇంటరాక్ట్రివ్ కార్యక్రమం అది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు పునాదిగా మారింది.
పదిమంది మహిళల్లో సుమారు ఏడుగురు తమ జీవిత కాలంలో హింసను ఎదుర్కొంటున్నట్లు యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం తెలుస్తోందని కార్యక్రమం మేనేజర్ ఫాతిమా అస్ ఫలాసి తెలిపారు. బాధితులు నిశ్శబ్దంగా అనుభవిస్తున్న కష్టాలను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాలన్నదే తమ ఆశయమని, గుండె లోతుల్లో దాచుకున్న వారి భావోద్వేగాలను తెలుసుకొని వారికి ఉపశమనం కలిగించేందుకు తమ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని ఫాతిమా భావిస్తున్నారు. ఇటువంటి వేదికపై మహిళలు హింసపై మాట్లాడడం మంచి సంకేతమని, మరొకరికి సహాయంగా మారుతుందని ఫాతిమా అంటున్నారు.
గత ఏడు సంవత్సరాల్లో దుబాయ్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఛైల్డ్ సుమారు 15 వందలకు పైగా గృహహింస కేసులను పరిష్కరించింది. బాధితుల్లో ఎక్కువశాతం 18 ఏళ్ళ వయసున్నవారు... ఇతర దేశాలనుంచి వచ్చి, దుబాయ్ లోని పురుషులు, కుటుంబ సభ్యులవల్ల శారీరకంగానూ, మానసికంగానూ గృహ హింసకు గురైన వారే ఉన్నారు. అయితే మహిళలపై హింసకు పాల్పడటంలో ఏ దేశం మినహాయింపు కాదని, సుమారు ఆరు వందల మిలియన్లకు పైగా గృహహింసకు గురౌతుంటే దాన్ని హింసగా గుర్తించడం లేదని ఫాతిమా అన్నారు. అయితే హింస ఎటువంటిదైనా సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉంటామని ఆమె తెలిపారు.
అలాగే సమావేశం తర్వాత ఎందరో తమ అనుభవాలను, కన్నీటి గాధలను తమతో పంచుకున్నారని, సౌండ్ ట్రాక్ విన్నవారు స్పందించి, గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. అల్ ఫలాసీ ఆరెంజ్ కంటైనర్ మరి కొద్ది నెలల్లో గృహహింస నిర్మూలకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. ఇటీవల జనంలో గృహహింసపై అవగాహన కల్పించేందుకు, జీవితాలను తీర్చిదిద్దేందుకు ఎన్నో టీవీ కార్యక్రమాలను సైతం రూపొందిస్తున్నారు. అయితేనేం రోజురోజుకూ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. ఆరెంజ్ కంటైనర్ మరి ఏ మేరకు సేవలు అందించగల్గుతుందో వేచి చూడాలి.