బర్త్‌డేకి 13 లక్షల మంది వస్తారనుకుంటే...
బర్త్‌డేకి 13 లక్షల మంది వస్తారనుకుంటే...
Published Tue, Dec 27 2016 8:54 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
ఆమె ఓ మెక్సికన్ అమ్మాయి.. పేరు రూబీ. తన 15వ పుట్టినరోజును గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంది. అందుకోసం ఆమె తల్లిదండ్రులు సోషల్ మీడియాలో ఒక వీడియో ఇన్విటేషన్ కూడా పోస్ట్ చేశారు. దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తే, ఏకంగా 13 లక్షల మంది ఆమె పుట్టినరోజుకు వస్తామని చెప్పారు. దాంతో ఆ అమ్మాయి చాలా సంబరపడిపోయింది. సాధారణంగా అమ్మాయిల 15వ పుట్టినరోజు అంటే లాటిన్ అమెరికా దేశాల్లో చాలా పెద్ద పండగలా చేస్తారు. అమ్మాయి పెద్దది అయ్యిందని చెప్పడానికి దాన్నొక వేదికగా చేసుకుంటారు. అలాగే రూబీ కూడా తన 'క్విన్సీనెరా' పార్టీని చాలా పెద్ద ఎత్తున చేసుకోవాలనుకుంది. దాంతో లా జోయాలో జరిగే తన పుట్టినరోజు పార్టీకి అందరినీ పిలవమని తన తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు కూడా ఎక్కడా తగ్గకుండా దంపతులిద్దరూ మధ్యలో కూతురిని పెట్టుకుని మరీ వీడియో ఇన్విటేషన్ పోస్ట్ చేశారు. గుర్రపు రేసు ఉంటుందని, అందులో రూ. 34వేల బహుమతి కూడా ఉంటుందని చెప్పారు. దాంతో ఫేస్‌బుక్ యూజర్లలో 13 లక్షల మంది తాము ఆ పార్టీకి వస్తున్నామని చెప్పారు.
కానీ లా జోయా అనే ఆ ఊళ్లో మొత్తం ఉండే ప్రజల సంఖ్యే 200కు మించదు. ఇంత పెద్దమొత్తంలో వస్తారనేసరికి అంతా సంబరపడిపోయారు. కానీ చివరకు కేవలం కొన్ని వేల మంది మాత్రమే వచ్చారు. దాంతో.. తాను అనుకున్న స్థాయిలో పుట్టినరోజు జరగలేదని రూబీ చాలా బాధపడిపోయింది. ఆమె ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. మంచి గులాబి రంగు గౌనులో మెరిసిపోతున్నా, కళ్లలో నీళ్లు మాత్రం చిమ్ముతూనే ఉన్నాయి. అయితే.. అన్ని వేల మంది రావడం కూడా నిజానికి ఆ ఊరికి చాలా ఎక్కువే. వచ్చినవాళ్లతో ఆ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. మీడియా కెమెరాలు కూడా అక్కడున్న వారందరినీ కవర్ చేయడంలో మునిగిపోయాయి.
నిజానికి ఆ పార్టీకి మామూలుగా అయితే 800 మంది వరకు వస్తారని ముందు ఊహించారు. కానీ, ఫేస్‌బుక్‌లో వచ్చిన స్పందన చూసి ఓ భారీ మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఇందుకు స్థానిక ప్రభుత్వం కూడా సహకరించింది. స్వీట్ సిక్స్‌టీన్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయిని చూసేందుకు మెక్సికో నలుమూలల నుంచి వచ్చారు. రూబీ పుట్టినరోజు కోసం వెళ్లే వారికి 30 శాతం తగ్గింపు ధరలకు విమాన టికెట్లు ఇస్తామని ఇంటర్‌జెట్ అనే విమానయాన సంస్థ కూడా ఆఫర్ చేసింది.
Advertisement